వినాయక చవితి సందర్భంగా అభిమానులకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతమైన గుడ్ న్యూస్ చెప్పాడు. ప్రముఖ సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్ ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ప్రజలు, అభిమానులకు వినాయక చవితి పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ, తన లేటెస్ట్ చిత్రం ‘దేవర’ మూవీ ట్రైలర్ విడుదల తేదీపై ఒక పెద్ద అప్డేట్ ఇచ్చాడు. అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘దేవర’ సినిమా ట్రైలర్ ఈ నెల (సెప్టెంబర్) 10వ తేదీన విడుదల కానుందని ఎన్టీఆర్ ప్రకటించి అభిమానులకు ఆనందాన్ని కలిగించాడు. ఈ సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఓ పోస్టర్‌ను కూడా షేర్ చేశాడు.
ఆ పోస్టర్‌లో ఎన్టీఆర్ ఒక రాయిపై నిలబడి చేతిలో గొడ్డలి వంటి పదునైన ఆయుధంతో సీరియస్ లుక్‌లో ఉండగా, వెనక అలలు ఎగిసిపడుతున్నాయి. పూర్తి బ్లాక్ అండ్ బ్లాక్ అవతారంలో ఎన్టీఆర్ లుక్ అదిరిపోయేలా ఉంది. ఈ పోస్టర్ ద్వారా సినిమా యూనిట్ ‘దేవర’ మూవీ సెప్టెంబర్ 27, 2024న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్నట్లు మరోసారి గుర్తు చేసింది. స్వయంగా ఎన్టీఆర్ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. తారక్ అభిమానులు ఈ ట్రైలర్ కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నట్లు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పటికే ‘దేవర’ మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ముఖ్యంగా ‘దేవర ఫియర్ సాంగ్’ మరియు ‘చుట్టమల్లే సాంగ్’ అభిమానులను ఊపేస్తున్నాయి. ఈ పాటలకు వచ్చిన విశేష స్పందనతో ‘దేవర’ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. సినిమా విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో, మూవీ యూనిట్ ప్రమోషన్స్‌ను వేగవంతం చేసింది. ఈ ప్రచారంలో భాగంగానే ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్ విడుదల తేదీని ప్రకటించాడు. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవి కూతురు జాన్వీ కపూర్ నటిస్తున్న సంగతి తెలిసిందే.