దశాబ్దానికి పైగా తనను, తన కుటుంబాన్ని కొందరు అవమానించారని, నీచంగా మాట్లాడారని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. అయినప్పటికీ ఒక్క మాట మాట్లాడలేదని, అధికారం వచ్చినా సరే తాను ప్రతీకార రాజకీయాలు చేయాలనుకోలేదని చెప్పారు. తిరుపతి వారాహి డిక్లరేషన్ సభలో పవన్ మాట్లాడారు.
ఇవాళ నిర్వహిస్తున్న వారాహి సభ చాలా ప్రత్యేకమైనదని, వంద రోజులు దాటిందని చెప్పారు. ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడ్డ ఈ 100 రోజుల్లో ఎప్పుడూ రోడ్డు మీదకు రాలేదని చెప్పారు. అభివృద్ధి, సంక్షేమం అంటూ ప్రజలకు ఇచ్చిన హామీలు ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించామని తెలిపారు.
ఆర్థిక వ్యవస్థ దెబ్బతిందని, దానిని ఎలా నిలబెట్టాలని ఆలోచించినట్లు చెప్పారు. అందరికీ అర్థం కావాలని ఇవాళ తాను ఇంగ్లిష్‌లోనూ మాట్లాడాల్సి వస్తుందని అన్నారు. ఇస్లాం సమాజాన్ని చూసి కొందరు నేర్చుకోవాలని చెప్పారు. ఓ హిందువుగా, సగటు భారతీయుడిగా తాను ప్రజల ముందుకు వచ్చానని పవన్ కల్యాణ్ తెలిపారు.
‘ఇవాళ నాకు అన్యాయం జరిగిందని నేను రాలేదు, ధర్మానికి అవమానం జరిగింది.. అన్ని ధర్మాలను గౌరవించే సనాతన ధర్మంపై దాడులు చేస్తుంటే వచ్చాను. తిరుమల ప్రసాదాన్ని కల్తీ చేసే పరిస్థితిని వైసీపీ తీసుకొచ్చింది. గతంలో కూడా నేను తిరుపతి వారాహి సభలో చెప్పాను తప్పు జరుగుతుంది, సరిదిద్దుకోండి అని అయినా వైసీపీ వారు వినలేదు. ఇవాళ నేను ఉప ముఖ్యమంత్రి గానో, జనసేన పార్టీ అధ్యక్షుడిగా మీ ముందుకు రాలేదు, నేను సగటు హిందువుగా, సనాతన ధర్మం పాటించే వ్యక్తిగా, భారతీయుడిగా మీ ముందుకు వచ్చాను. నేను హిందూ మతాన్ని అనుసరిస్తాను, నేను ఇస్లాం, క్రిస్టియానిటి, సిక్, ఇతర అన్ని మతాలను గౌరవిస్తాను’ అని చెప్పారు.
‘నేను నా ధర్మానికి అన్యాయం, అవమానం జరుగుతుంటే నన్ను మాట్లాడవద్దు, రాజకీయం చేయవద్దు అంటారు, నా తిరుమల శ్రీవారి ప్రసాదం అపవిత్రం అయితే నేను మాట్లాడకూడదా? ఇదేనా సూడో సెక్యులరిజం ముసుగులో మాట్లాడే మేధావులకు చెబుతున్నా, నేను నిజమైన సనాతనవాదిని, నేను సనాతన హిందువును, నేను అన్ని మతాలను గౌరవిస్తాను, హిందూ మతాన్ని పాటిస్తాను’ అని పవన్ కల్యాణ్ అన్నారు.
యావత్ దేశం శ్రీరాముడ్ని పూజిస్తుందని అన్నారు. కానీ శ్రీరాముడ్ని పాదరక్షలతో కొట్టి ఊరేగిస్తుంటే మనం చూస్తూ ఊరుకుందామా? గదుల్లో కూర్చుని ఏడుద్దామా? అని ప్రశ్నించారు.
రామతీర్థంలో రాముడి తలనరికేస్తే ఏం చేశాం?… లోలోపలే తిట్టుకున్నాం… ఎందుకంటే, మన మాటలు ఎవరన్నా వింటే మనల్ని మతోన్మాదులు అనుకుంటారని భయం… అంటూ తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు.
రాముడు ఉత్తరాది దేవుడు, ఆర్యుడు అనే తప్పుడు సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళుతుంటారు… మనం భయంతో మాట్లాడం… ఈ దేశ మూల సంస్కృతికి వెన్నెముక శ్రీరాముడు. రాముడు ఉత్తరాది దేవుడా? మనందరి దేవుడు కాదా? రాముడు ఏ ఛాయలో ఉంటాడు… నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కృష్ణుడు నీలమేఘచ్ఛాయలో ఉంటాడు, కాళికాదేవి నల్లని రంగులో ఉంటుంది అని పవన్ వివరించారు.
“సనాతన ధర్మానికి వర్ణ వివక్ష లేదు. ఇవన్నీ మెకాలే తీసుకువచ్చిన రంగులు. కుహనా లౌకికవాదులకు ఒకటే చెబుతున్నా… మీ సిద్ధాంతాలను మాపై రుద్దకండి. అయోధ్య రామ జన్మభూమిలో శ్రీరాముడి ప్రతిష్ఠాకార్యక్రమం జరుగుతుంటే దేశ ప్రతిపక్ష నేత ‘నాచ్ గానా’ కార్యక్రమం అని అవమానించారు… దీనిని ఏ హిందువు కూడా ప్రశ్నించరా? మన రాముడిపై వాళ్లు జోకులు వేస్తుంటే చూస్తూ కూర్చోవాలా? రామాయణం కల్పవృక్షం అంటే… కాదు, అది విషవృక్షం అన్నారు… మరి మాకు కోపాలు రావా?” అంటూ పవన్ ఆవేశపూరితంగా ప్రసంగించారు.