పవన్ కల్యాణ్ సెల్ఫ్ గోల్ వేసుకున్నారా ? ఇంతకీ ఆయన కొందరివాడా ? అందరివాడా ? ఇంతకీ పవన్ నుంచి ప్రజలు ఏం కోరుకుంటున్నారు ? ఇందుకు ప్రతిఫలంగా ఆయన ఏం ఇస్తున్నారు ? ఒకే అంశం మీదే ఎక్కువగా ఫోకస్ పెట్టడం వల్ల అసలు పవన్ కల్యాణ్ ను ప్రజలు ఏమనుకుంటున్నారు ?
యువతకు ఉపాధి, రైతుల సమస్యలు , మహిళలకు భద్రత లాంటి సవాళ్లు పవన్ కోసం వేచిచూస్తున్నాయి ? మరి ఇలాంటి బోలెడన్నీ సమస్యలకు ఈ జనసేనాని తొందర్లోనే చెక్ పెట్టేస్తారా లేక ఈయన కూడా అందరి పొలిటీషియన్ల మాదిరే సాధారణం అయిపోతారా అని అభిమానులు సైతం కలవరపడుతున్నారని తెలుస్తోంది.
పవన్ కల్యాణ్. ఈ పేరు వింటే పిఠాపురం నుంచి తెలంగాణ వరకు అందరికీ పునకాలే. పైగా ఇప్పుడు డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కూడానూ. అలాంటి పవర్ ఫుల్ నేత ఏం మాట్లాడినా ఏం చేసినా తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తికరంగా ఉంటుంది మరి. ఈ స్టార్ లీడర్ కు ధైర్యం ఎక్కువ. అయితే తిరుమల శ్రీవారి లడ్డూ అపవిత్రం అయ్యిందంటూ ఏ స్టార్ లీడర్ మాట్లాడని రీతిలో ధైర్యంగా మాట్లాడారు పవన్. ఇది హిందూవులను అమితంగా ఆకట్టుకున్న అంశం.
ఒక్కదానిపైనే ఫోకస్ …
మరోవైపు ఓ అడుగు ముందుకేసి ప్రాయశ్చితం కార్యక్రమానికి సైతం ఆయన శ్రీకారం చుట్టారు. ఇంత వరకు బాగానే ఉన్నా, ఒక రాష్ట్ర మంత్రి, అదీ డిప్యూటీ సీఎంగా ఉన్న ఆయన తన ఫోకస్ అంతా ఒకే అంశంపై పెట్టినట్లుగా కనిపిస్తోందని నెట్టింట టాక్ నడుస్తోంది.
ఒక దశలో తమిళ సినీ హీరో కార్తీపైనా పవన్ రుసరుసలాడారు. తెలుగు రాష్ట్రాల్లోనూ సూర్య ఫ్యామిలీకి చెప్పుకోదగ్గ అభిమానులు ఉండటంతో వాళ్లు సైతం నొచ్చుకున్నారట. తమ హీరో భావనను తప్పుగా అర్థం చేసుకున్నారని ట్విట్టర్ వేదికగా ప్రశ్నల జల్లు కురిపిస్తున్నారు.
ఇక సనాతన ధర్మంపై ప్రకాశ్ రాజ్ అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారంటూ తెలంగాణలో బీజేపీ నేతలు ఆగ్రహంగా ఉన్నారు. ఆయన్ను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ (మా) నుంచి బహిష్కరించాలని, తక్షణమే బహిరంగ క్షమాపణలు చెప్పాలని పట్టుబడుతున్నారు.
గెలిచేముందు ఒక అవతారం, గెలిచిన తర్వాత ఇంకో అవతారం, ఇందులో ఏది నిజం అని ప్రకాశ్ రాజ్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేయడంపైనా అగ్గి రాజుకుంది. ఇది పరోక్షంగా పవన్ కల్యాణ్ ను ఉద్దేశించి పెట్టిందేనని నెటిజన్లు భావిస్తున్నారు.
ప్రజా సమస్యలకు చెక్ పెట్టాలి…
అయితే లడ్డూ కల్తీ అంశంపై అటు ప్రభుత్వ వైఖరితో పాటు తన అభిప్రాయాన్ని సైతం స్పష్టం చేసిన పవన్, ఇక ఈ అంశాన్ని సర్కారుకు అప్పగించేసి, రాష్ట్రంలో తిష్ట వేసుకున్న ఎన్నో ప్రజా సమస్యలకు చెక్ పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారట. నాకు తెలిసిన డిప్యూటీ సీఎం, తన వద్దకు ఓ సమస్య వస్తే ఆ సమస్యకు సత్వర పరిష్కారం చూపించే నేత అని సగటు పౌరుడు ఆశిస్తారని సోషల్ మీడియా ద్వారా యువత అభిప్రాయపడుతోందట.