తిరుమల లడ్డూ ప్రసాదం వివాదంపై సినీ నటుడు ప్రకాశ్ రాజ్ సోషల్ మీడియాలో మరోసారి స్పందించారు. తాజాగా సుప్రీం కోర్టులో ఈ అంశంపై విచారణ జరిగింది. దేశ ప్రజలు ఎంతో పవిత్రంగా భావించే శ్రీవారి లడ్డూ ప్రసాదంపై ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలను సుప్రీం కోర్టు తీవ్రంగా పరిగణించింది. లడ్డూలో కల్తీ నెయ్యి వాడినట్లు ఆధారాలున్నాయా..? అంటూ కోర్టు ప్రశ్నించింది. కనీసం దేవుడినైనా రాజకీయాల నుంచి దూరంగా ఉంచాలంటూ హెచ్చరించింది.
సుప్రీం కోర్టు వ్యాఖ్యలను తెలుపుతూ ప్రకాశ్ రాజ్ రియాక్ట్ అయ్యారు. సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫోటోలు షేర్ చేస్తూ.. ‘దేవుణ్ణి రాజకీయాల్లోకి లాగకండి.. జస్ట్ ఆస్కింగ్’ అంటూ ఒక పోస్ట్ చేశారు. లడ్డూ ప్రసాదం వివాదం గురించి ఇప్పటికే పవన్ కల్యాణ్‌పై ప్రకాశ్ రాజ్ పలుమార్లు కౌంటర్ ఇచ్చిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఏకంగా సుప్రీం కోర్టు.. ఏపీ ప్రభుత్వాన్ని తప్పుపడుతూ పలు ప్రశ్నలు సంధించడంతో ప్రకాశ్ రాజ్ కూడా రియాక్ట్ అయ్యారు.