పవన్ కల్యాణ్ రాజకీయాలతో బిజీ కావడంతో, ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉన్న ఆయన మూడు సినిమాల కోసం అభిమానులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’, ‘ఓజీ’, ‘హరిహర వీరమల్లు’ ఈ మూడు చిత్రాలు కొంతమేర చిత్రీకరణ పూర్తి చేసుకున్నావే.
తాజాగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ మూవీపై నిర్మాత రవిశంకర్ క్రేజీ అప్‌డేట్ ఇచ్చారు. ఆయన తాజాగా ‘మత్తు వదలరా-2’ మూవీ టీజర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమా గురించి తలెత్తిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు.
రవిశంకర్ మాట్లాడుతూ… “ఇటీవలే మేము పవన్ కల్యాణ్‌ను కలిశాం. ‘ఉస్తాద్ భగత్‌సింగ్’ షూట్ కొన్ని వారాల్లోనే మొదలు కానుంది. చిత్రం తాలూకు మొత్తం షూటింగ్ జనవరి 2025 వరకు పూర్తి చేసేయాలని నిర్ణయించాం. సెప్టెంబర్ 2న పవన్ పుట్టినరోజు సందర్భంగా ఇప్పటికే షూటింగ్ పూర్తైన పార్ట్ నుంచి ఏదో ఒక స్పెషల్ సర్‌ప్రైజ్ అభిమానులకు ఇస్తాం. అప్పటివరకు వేచి ఉండండి” అని చెప్పుకొచ్చారు.
దీంతో రవిశంకర్ మాట్లాడిన ఈ వీడియోను పవన్ అభిమానులు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. త్వరలో మా హీరో బరిలోకి దిగబోతున్నాడంటూ మురిసిపోతున్నారు.