పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ‘జానీ’, ‘బద్రి’ వంటి చిత్రాలలో పవన్ కళ్యాణ్ సరసన నటించి, అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్న రేణు, కొన్ని కారణాల వల్ల విడాకులు తీసుకుని వేరుగా ఉంటున్నారు. విడాకుల తరువాత పవన్ కళ్యాణ్ మరో పెళ్లి చేసుకుని ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉండగా, రేణు దేశాయ్ మరో పెళ్లి చేయకుండానే తమ పిల్లలు ఆద్య, అకిరా నందన్‌లను చూసుకుంటూ, సినిమాలకు దూరంగా ఉంటున్నారు. అయితే, ఆమె తాజాగా ‘టైగర్ నాగేశ్వరావు’ చిత్రంతో తన సెకెండ్ ఇన్నింగ్స్‌ను ప్రారంభించారు. రేణు దేశాయ్ నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ, పేద పిల్లలు, జంతువులకు సహాయం చేస్తూ, తన అభిమానులను కూడా విరాళాలు ఇవ్వమని ప్రోత్సహిస్తూ మంచి మానవతావాది (Great Human Being) అనిపించుకుంటున్నారు. ఆమె సోషల్ మీడియాలో చేసే పోస్టులు తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటాయి.
ఇప్పుడిలా, రేణు దేశాయ్ వినాయక చవితి పండుగపై చేసిన వ్యాఖ్యలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. ఆమె మాట్లాడుతూ, “ప్రస్తుతం ప్రతి ఒక్కరూ తమ స్థాయిని చూపించుకోవాలనే ఉద్దేశంతో పెద్ద పెద్ద విగ్రహాలు, భారీ డెకరేషన్లు చేసి సెలబ్రేషన్స్ నిర్వహిస్తున్నారు. కానీ అసలు ఆ విగ్రహాల్లో దేవుడు లేడు, కేవలం మనిషి దురాశ, అత్యాశ మాత్రమే ఉంది” అని వ్యాఖ్యానించారు.
ఆమె చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చర్చకు దారి తీసాయి. వినాయక చవితి పండుగలో దేవుని స్థాయిని దిగజార్చేలా హీరో, హీరోయిన్ల గెటప్పుల్లో విగ్రహాలను ఉంచడంపై రేణు దేశాయ్ తన అభిప్రాయాలను వ్యక్తపరచినట్లు తెలుస్తోంది.