సమంత ఇప్పుడో యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న విషయం తెలుసు కదా. గతంలో ఇదే రాజ్ అండ్ డీకేలతో కలిసి ఫ్యామిలీ మ్యాన్ 2లో ఓ బోల్డ్ క్యారెక్టర్ చేసిన సామ్.. తాజాగా సిటడెల్: హనీ బన్నీ చేసింది. అయితే మయోసైటిస్ తో బాధపడుతున్న తాను ఈ సిరీస్ లో నటించలేనని, వేరే వాళ్లను చూసుకోవాలని డైరెక్టర్లను బతిమాలినట్లు తాజాగా గలాటా ఇండియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పింది.
నా వల్ల కాదనన్నాను: సమంత
సమంత రుత్ ప్రభు మయోసైటిస్ అనే వ్యాధితో చాలా ఇబ్బందులు పడిన సంగతి తెలుసు కదా. అలాంటి పరిస్థితుల్లోనూ సిటడెల్: హనీ బన్నీలాంటి ఓ యాక్షన్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ లో ఆమె నటించింది. ఇందులో ఆమె చాలా యాక్షన్ సీన్స్ చేసినట్లు ట్రైలర్ చూస్తేనే తెలిసింది. అయితే అనారోగ్యంతో బాధపడుతూ తాను ఇలాంటి సీన్లు చేయలేనని డైరెక్టర్లకు చెప్పినట్లు గలాటా ఇండియా ఇంటర్వ్యూలో సమంత వెల్లడించింది.
“నన్ను వదిలేయాలని వాళ్లను బతిమాలుకున్నాను. అసలు నేను చేయలేను అనిపించింది. నిజంగానే అలా అనిపించింది. వేరే వాళ్ల పేర్లు కూడా సిఫారసు చేశాను. ఈ హీరోయిన్ ను చూడండి చాలా బాగుంది. ఆమె బాగా చేస్తుంది.. నా వల్ల కాదు వదిలేయండి.. అని అడిగాను. నలుగురి పేర్లు పంపించాను. అప్పట్లో నేను నిజంగానే చాలా అనారోగ్యంతో ఉన్నాను” అని సమంత చెప్పుకొచ్చింది.
ఇప్పుడు చాలా హ్యాపీగా ఉంది
అయితే సిటడెల్ వెబ్ సిరీస్ లో నటించడం తనకు చాలా హ్యాపీగా ఉందని సమంత చెప్పింది. “ఇప్పుడీ షో చూసిన తర్వాత నేను లేకుండా వాళ్లు దీనిని తీయనందుకు కృతజ్ఞురాలిని అనిపిస్తోంది. ఈ సిరీస్ చేసేందుకు అవసరమైన శక్తిని నేను సంపాదించాను. ఈ షోపై ఇంకా ప్రేక్షకుల స్పందన రాకపోయినా సరే.. నాకు నేను దీనిని చేసినందుకు మాత్రం ఆనందంగా ఉంది” అని సమంత చెప్పింది.
సిటడెల్: హనీ బన్నీ వెబ్ సిరీస్ లో వరుణ్ ధావన్ తో కలిసి సమంత నటించింది. ఇదొక స్పై థ్రిల్లర్ వెబ్ సిరీస్. 1990ల నేపథ్యంలో సాగుతుంది. ఇంగ్లిష్ లో ప్రియాంకా చోప్రా నటించిన సిటడెల్ సిరీస్ కు ఇది ప్రీక్వెల్ గా రాబోతోంది. ఈ సిరీస్ లో వరుణ్, సమంతల కూతురిగా 8 ఏళ్ల వయసున్న నదియా సింగ్ (ప్రియాంకా చోప్రా)ను చూపించారు. ఈ వెబ్ సిరీస్ నవంబర్ 7 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ కానుంది. ఈ మధ్యే ట్రైలర్ రిలీజ్ చేశారు.