Samantha World Pickleball League హీరోయిన్ సమంత ప్రస్తుతం సినిమాలు, వెబ్ సిరీస్‌లతో బిజీ బిజీగా ఉంటున్నారు. ఈ మధ్యే మరో కొత్త ప్రయాణం కూడా ప్రారంభించారు. క్రీడలకు సంబంధించి వ్యాపార రంగంలోనూ అడుగుపెట్టారు. కొద్ది రోజుల క్రితం వరల్డ్ పికిల్ బాల్ లీగ్‌లో చెన్నై ఫ్రాంఛైజీని కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా ఇప్పుడు మరో అడుగు ముందుకేసి సామ్ తనలోని క్రీడాకారిణిని పరిచయం చేశారు. రాకెట్ చేతపట్టి పికిల్ బాల్ గేమ్ ఆడారు. అక్కడి స్టేడియంలో పలువురు ఛాంపియన్లతో కలిసి ఆమె ఈ గేమ్ ఆడారు. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియా ఇన్‌స్టా గ్రామ్ వేదికగా షేర్ చేసుకున్నారు. ఆట పూర్తైన తర్వాత డ్యాన్స్ రూపంలో సంతోషాన్ని వ్యక్తం చేశారు.
కాగా, ఆ మధ్య మయోసైటిస్‌కు గురైన సమంత దాదాపు ఏడాది పాటు నటనకు బ్రేక్ ఇచ్చారు. గతేడాది రిలైజన ‘ఖుషి’ తర్వాత మరో సినిమాలో నటించలేదు. అయితే అప్పటికే ఆమె బాలీవుడ్ హీరో వరుణ్ ధావన్‌తో కలిసి సిటడెల్: హనీ బన్నీ (Citadel : Honey Bunny) అనే వెబ్ సిరీస్ చేశారు. రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో తెరకెక్కిన ఆ వెబ్ సిరీస్ త్వరలోనే ఓటీటీ అమెజాన్ ప్రైమ్ వీడియో వేదికగా నవంబరు 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది. అలానే సామ్ ‘మా ఇంటి బంగారం’ అనే చిత్రాన్ని కూడా కొద్ది రోజుల క్రితం అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. ఈ చిత్రానికి సమంత నిర్మాతగానూ వ్యవహరిస్తున్నారు.
ఏదేమైనా సమంత మరోసారి యాక్షన్ సీక్వెన్స్‌లకు రెడీగా, ఫిట్‌గా ఉన్నట్టు తాజా వీడియో చూస్తే అర్థమవుతోంది. ఇకపోతే సమంతకు ఓ బ్లాక్ బస్టర్ హిట్ పడి చాలా కాలం అయిపోయింది. ఫ్యామిలీ మెన్ 2 సీజన్ తర్వాత ఆ రేంజ్ సక్సెస్ ఆమె ఖాతాలో పడలేదు. యశోద మూవీ పర్వాలేదనిపించింది. శాకుంతలం డిజాస్టర్‌గా నిలిచింది. ఖుషి ఓ మోస్తరుగా మెప్పించిన సంగతి తెలిసిందే. చూడాలి మరి ఆమె నటించిన కొత్త ప్రాజెక్ట్‌లు ఎలాంటి రిజల్ట్‌ను అందుకుంటాయో.