తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్, మహిళా కమిషన్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నాగచైతన్య, శోభితల విడాకులపై జోస్యం చెప్పినందుకు వేణు స్వామిపై ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్ మహిళా కమిషన్‌కి ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఈ ఫిర్యాదుపై మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈ నోటీసులను సవాల్ చేస్తూ వేణు స్వామి హైకోర్టులో పిటిషన్ వేశారు. ఆగస్టు 28న పిటిషన్‌పై విచారణ జరిపిన హైకోర్టు, మహిళా కమిషన్ జారీ చేసిన నోటీసులు చెల్లవంటూ తీర్పు ఇచ్చింది. “నాగచైతన్య, శోభితలకు లేని సమస్య మీకెందుకు?” అంటూ ఫిలిం జర్నలిస్టు అసోసియేషన్, మహిళా కమిషన్‌కి హైకోర్టు హెచ్చరికలు చేసింది.
నాగచైతన్య, శోభిత నిశ్చితార్థం జరిగిన రోజు వేణు స్వామి రంగంలోకి దిగి, మూడేళ్లలో ఈ జంట విడిపోతారని జోస్యం చెప్పారు. 2027లో మరో మహిళ ప్రమేయం కారణంగా వీరిద్దరూ విడిపోతారని ఆయన అంచనా వేశారు. ఈ విషయంపై చేసిన జాతక విశ్లేషణ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది.
దీని తరువాత, తెలుగు ఫిలిం జర్నలిస్ట్ అసోసియేషన్ మహిళా కమిషన్‌కు ఫిర్యాదు చేయగా, మహిళా కమిషన్ వేణు స్వామికి నోటీసులు పంపింది. ఈ నోటీసులపై వేణు స్వామి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.