తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామి లడ్డూ ప్రసాదంలో జంతువుల కొవ్వును కలుపుతున్నారనే వార్తలు విని, ఓ భక్తుడిగా నేను ఎంతగానో ఆందోళనకు గురయ్యానని సీనియర్ నటుడు మోహన్‌బాబు అన్నారు. స్వామివారి దగ్గర ఇలాంటి ఘోరాలు జరగడం పాపమని, ఇది నిజమైతే నేరస్తులను కఠినంగా శిక్షించాలని ఏపీ సీఎం చంద్రబాబును కోరుతూ ఒక ప్రకటన విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా హిందువులు పూజించే కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి. ఆ స్వామివారి లడ్డూ ప్రసాదంలో ఆవు నెయ్యి బదులు జంతువుల కొవ్వును కలుపుతున్నారనే విషయం తెలిసి, భక్తుడిగా తల్లడిల్లిపోయాను. తిరుమల క్షేత్రాన్ని చూస్తూ, మోహన్‌బాబు విశ్వవిద్యాలయం నుంచి నేను మరియు ఉపాధ్యాయులు, విద్యార్థులు భక్తితో నమస్కరిస్తుంటాం. ఇలాంటి చర్యలు ఘోరం, పాపం, నికృష్టం, హేయం. ఇది నిజమైతే తప్పక నేరస్తులను శిక్షించాలని నా మిత్రుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును కోరుతున్నాను. కలియుగ దైవం శ్రీనివాసుడి ఆశీస్సులు చంద్రబాబుకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నాను.
మరోవైపు, మోహన్‌బాబు తనయుడు మంచు విష్ణుతో కలిసి ‘కన్నప్ప’ సినిమాలో నటిస్తున్నారు.