ఉత్సవం మూవీ రివ్యూ: భావోద్వేగాలకు, ప్రేమకు కొత్త అర్థం
నటీనటులు: దిలీప్ ప్రకాష్, రెజీనా కసాండ్రా, రాజేంద్రప్రసాద్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, అలీ, నాజర్ తదితరులు.
దర్శకుడు: అర్జున్ సాయి
నిర్మాత : సురేష్ పాటిల్
సంగీత దర్శకుడు: అనూప్ రూబెన్స్
సినిమాటోగ్రఫీ: రసూల్ ఎల్లోర్
ఎడిటర్ : కోటగిరి వెంకటేశ్వరరావు
తెరపై మనసుకు హత్తుకునే కథను చూపించే చిత్రాలు మాత్రమే ప్రేక్షకుల గుండెల్లో నిలుస్తాయి. అటువంటి చిత్రాల్లో ఒకటే ఉత్సవం. ఏడాది విరామం తర్వాత రెజీనా కాసాండ్రా ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాగా, ఈ చిత్రంలో లీడ్ రోల్‌లో దిలీప్ ప్రకాష్ నటించాడు. అర్జున్ సాయి దర్శకత్వం వహించిన ఈ సినిమా ప్రేమకథతో పాటు, రంగస్థల కళకు సంబంధించిన సమకాలీన సమస్యలను కూడా తెరపై ఆవిష్కరించింది. మరి, ఈ కథ ప్రేక్షకుల మన్ననలు పొందిందా? లేదా? అనేది తెలుసుకుందాం.
కథా నేపథ్యం:
కథలో ప్రధాన పాత్రధారి అభిమన్యు నారాయణ (ప్రకాష్ రాజ్), ఒక ప్రసిద్ధ రంగస్థల కళాకారుడు. ఎన్నో అవార్డులు గెలుచుకున్న ఆయన, ఈ రంగానికి మహా ప్రాముఖ్యతను ఇస్తాడు. తన కుమారుడు కృష్ణ (దిలీప్ ప్రకాష్) కూడా తన సంతోషం కోసం ఇంజినీరింగ్ పూర్తిచేసి ఉద్యోగం చేయకుండా, తన మనసు నాటక రంగంపైనే పెట్టి, ఈ కళను తిరిగి పునరుద్ధరించడానికి ప్రయత్నిస్తాడు.
కృష్ణ మరియు రమ (రెజీనా) ఇద్దరు చిన్నతనంలో పరిచయమైనప్పటికీ, వారి ప్రేమ పెళ్లి దశకు చేరినప్పుడు, అర్ధాంతరంగా వీరు అదృశ్యమవుతారు. పెళ్లి కుదరడానికి కొద్ది గంటల ముందు రమ, కృష్ణ ఇద్దరూ కనబడకపోవడం, వారి ప్రేమకథలో ఏం జరిగింది? అన్నదే కథా ప్రధాన అంశం.
రంగస్థల కళలో ప్రేమ:
తెలుగు సినిమాల్లో నాటక రంగం ప్రధానంగా తీసుకున్న చిత్రాలు చాలా తక్కువ. “ఉత్సవం” ఈ విభాగంలో కొంత కొత్తదనాన్ని తీసుకువచ్చింది. నాటక రంగం ఒకప్పటి వైభవాన్ని తిరిగి తెచ్చేందుకు కృషి చేసే నాయికా నాయికలు, వారి మధ్య ప్రేమ, ప్రేమలో ఎదురు బాదులు, వివాహానికి ముందు వారి మధ్య వచ్చిన సమస్యలను కథలో అల్లుకుని తెరపై చూపించడం ఆసక్తికరంగా మారింది.
రంగస్థల కళా ప్రాముఖ్యత:
నాటక రంగం అనేది ఎప్పటినుండో ఒక కళాగొప్పతనం. కానీ ఈ రంగంలో పనిచేసేవారు ఎలాంటి కష్టాలు అనుభవిస్తున్నారు, ఈ కళా రూపాన్ని బతికించేందుకు వారి ప్రయత్నాలు ఎలాంటి అవస్థలకు గురవుతున్నాయి అనే విషయాలను చిత్రంలో చూపించడం ఎంతో హృదయాన్ని తాకుతుంది. కృష్ణ, అతని తండ్రి అభిమన్యు మధ్య ఉన్న విభేదాలు, నాటక రంగానికి తండ్రి-కొడుకులు చేసిన త్యాగాలు సినిమా ప్రాముఖ్యతను మరింత పెంచాయి.
దర్శకత్వం & కథనంలో లోపాలు/మైనస్ పాయింట్స్:
దర్శకుడు అర్జున్ సాయి సినిమాను నాటక రంగం, ప్రేమకథ మధ్య సమతౌల్యంగా తీర్చిదిద్దాడు. నాటక రంగం నేపథ్యం, ఈ రంగాన్ని పునరుద్ధరించడానికి కృష్ణ చేసిన ప్రయత్నాలు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా చూపించినా, కథలో కొన్ని ఎపిసోడ్స్ సహజంగా కనిపించవు. ముఖ్యంగా ప్రేమకథలోని కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించవచ్చు. నాటక రంగంపై వచ్చిన ఎపిసోడ్స్ కథతో అంత సంబంధం లేకుండా స్క్రీన్‌పై వచ్చాయి. కొంత వాస్తవాలకు దూరంగా కథను నడిపించినట్లు అనిపించినప్పటికీ, మొత్తం కథా సారాంశం హృదయాన్ని తాకుతుంది.
- నాటకాలు మరియు సాగదీసిన సన్నివేశాలు: సినిమాలో చాలా భాగం నాటకాలు, ముఖ్యంగా దక్ష యజ్ఞం నాటకం చుట్టూ తిరగడంతో కథనం నెమ్మదిగా అనిపిస్తుంది. నాటకాల్లోని డైలాగ్స్ మీద అధికంగా ఆధారపడటం వల్ల ప్రేక్షకులకు ఇంట్రెస్ట్ మిస్సవుతుంది. ఈ సన్నివేశాలు కొంచెం సాగదీసినట్లు అనిపించడంతో, కధ ముందుకు సాగడంలో అనవసరమైన ఆలస్యం కలిగింది.
- కమర్షియల్ అంశాల లోపం: ఉత్సవం సినిమా కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ లేకపోవడం కూడా మైనస్ పాయింట్‌గా నిలిచింది. ప్రేక్షకులు సర్దుకోవాలసిన అంశం ఏమిటంటే, సున్నితమైన ప్రేమ కథ, భావోద్వేగ సన్నివేశాలతో సినిమా కొన్ని చోట్ల ఆకట్టుకున్నప్పటికీ, వాణిజ్య అంశాలు పెద్దగా లేకపోవడం కథకు పెద్ద హాండ్‌గా మారింది.
- స్లో స్క్రీన్‌ప్లే: స్క్రీన్‌ప్లే చాలా స్లోగా అనిపించడం కూడా కథనానికి మైనస్. కథలోని సంఘటనలు, ముఖ్యంగా ఫస్ట్ హాఫ్, ఇంకా ఆసక్తికరంగా ఉంటే సినిమా మరింత రసవత్తరంగా ఉండేదని చెప్పవచ్చు. కీలక సన్నివేశాల్లో గ్రిప్పింగ్ లేకపోవడం కథను మరింత బలహీనతగా మార్చింది.
- మెలోడ్రామా ఫీలింగ్: ప్రధాన పాత్రల మధ్య ఎమోషన్స్ బాగా ఎస్టాబ్లిష్ చేసినా, కొన్ని చోట్ల మెలోడ్రామా ఎక్కువగా అనిపించడం కథలో సహజత్వాన్ని తగ్గించింది. కథకి కొత్త నేపథ్యం ఉన్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు రొటీన్‌గా అనిపించాయి.
- క్లిషే సన్నివేశాలు: హీరో – హీరోయిన్ ఒకరినొకరు తెలియకుండా ప్రేమలో పడటం, పెళ్లి విషయం తెలియకుండా కలిసి తిరగడం వంటి సన్నివేశాలు రొటీన్‌గా అనిపించాయి. ఈ సన్నివేశాలను మరింత బలంగా, కొత్తదనం తో చూపించి ఉంటే, కథ మరింత ప్రభావవంతంగా ఉండేదని అనిపిస్తుంది.
నటీనటులు:
సినిమాలోని ముఖ్యమైన బలం సీనియర్ నటుల పర్ఫార్మెన్స్. ప్రకాష్ రాజ్, నాజర్, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్ వంటి సీనియర్ నటులు తమ పాత్రలను పూల్లెవెల్‌లోనే చిత్రించారు. రంగస్థల సన్నివేశాల్లో వారి ప్రదర్శన నిజంగా ఆకట్టుకుంటుంది. దిలీప్ ప్రకాష్, కృష్ణ పాత్రలో మంచి ఎమోషనల్ ప్రదర్శన ఇచ్చాడు. అతని పాత్రలో ఉన్న భావోద్వేగ సన్నివేశాలు అతని యాక్టింగ్‌ను మరింతగా బలోపేతం చేశాయి. రమ పాత్రలో రెజీనా తన పాత్రకు పర్ఫెక్ట్‌గా ఒదిగిపోయింది. ఈమె ప్రదర్శన కూడా చాలా సహజంగా అనిపిస్తుంది.
సాంకేతిక బలం:
సాంకేతికంగా సినిమా మంచి విలువలను అందించింది. రసూల్ ఎల్లోర్ సినిమాటోగ్రఫీ చిత్రానికి అత్యంత కీలకమైన అంశం. నాటక రంగం సన్నివేశాలు, ఆర్టిస్టుల ఎమోషన్స్, న్యాచురల్ లొకేషన్లను అద్భుతంగా ఫ్రేమ్ చేశాడు. అలాగే, అనూప్ రూబెన్స్ సంగీతం కూడా ప్రేక్షకుల మనసును హత్తుకునే విధంగా ఉంటుంది. నేపథ్య సంగీతం కథను మరింత బలోపేతం చేస్తుంది.
మూవీ మెసేజ్:
ఉత్సవం చిత్రంలో దర్శకుడు అర్జున్ సాయి, నాటక కళను కాపాడుకోవడానికి, ఇంతటి మహా కళాప్రపంచం ఏమిటి, కళాకారులు ఎలాంటి కష్టాలను అనుభవిస్తున్నారు అనే అంశాలను కవర్ చేసినప్పటికీ, చిన్న చిన్న లోపాలు మాత్రం ఉన్నాయని చెప్పుకోవచ్చు. కానీ, ఈ చిత్రం చెప్పిన మెసేజ్ మాత్రం ఎంతో విలువైనదిగా, ముఖ్యమైనదిగా నిలుస్తుంది.
మొత్తం గా:
ఉత్సవం ఓ భావోద్వేగ ప్రేమకథ మాత్రమే కాదు, నాటక రంగం, కళాకారుల గొప్పతనాన్ని, వారి జీవితం మీద చూపు సారించిన చిత్రం. ఒకసారి చూసి, ఆ కళా రంగానికి మీరు గౌరవం ఇవ్వకుండా ఉండలేరు.