కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం ‘ది గోట్’. వెంకట్ ప్రభు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా భారీ అంచనాల మధ్య సెప్టెంబర్ 5న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో విజయ్ సరసన ‘గుంటూరు కారం’ ఫేమ్ మీనాక్షి చౌదరి కథానాయికగా నటించింది. ఈ సినిమాలో విజయ్ ద్విపాత్రాభినయం చేశారు. భారీ బడ్జెట్ సినిమా కావడంతో గోట్ అభిమానుల్లో మరింత ఆసక్తిని రేపింది. టికెట్‌ల అడ్వాన్స్ బుకింగ్స్‌లో ఈ సినిమా ‘ఇండియన్ 2’ రికార్డును అధిగమించి రిలీజ్‌కు ముందే రికార్డు సృష్టించింది.
అంచనాలను నిజం చేస్తూ, తొలిరోజే గోట్ బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్లింది. స్పై థ్రిల్లర్‌గా ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ చిత్రం, భారత్‌లో రూ.55 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ సాధించగా, నెట్ వసూళ్లు రూ.43 కోట్లుగా ఉన్నాయి. ఇందులో తమిళంలో రూ.38.3 కోట్లు, తెలుగులో రూ.3 కోట్లు, హిందీలో రూ.1.7 కోట్లు వసూలు చేసింది. మొదటి రోజు థియేటర్లలో 76.23 శాతం ఆక్యుపెన్సీని నమోదు చేసింది. ప్రపంచవ్యాప్తంగా చూస్తే, ఈ చిత్రం రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించే అవకాశం ఉంది. ఓవర్‌సీస్ కలెక్షన్లకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.
రాబోయే రోజుల్లోనూ గోట్ ఇదే జోరును కొనసాగిస్తే, మరిన్ని రికార్డులు బద్దలు కొట్టనుంది. అయితే తొలిరోజు విజయ్ నటించిన ‘లియో’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రూ.148.5 కోట్ల వసూళ్లు సాధించిన రికార్డును ‘గోట్’ అధిగమించలేకపోయింది. ఈ సినిమాను ఏజీఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై దాదాపు రూ.380 కోట్ల బడ్జెట్‌తో నిర్మించారు. ఈ విషయాన్ని నిర్మాత అర్చన కల్పతి ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, స్నేహ, జయరామ్, లైలా, అజ్మల్ అమీర్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు.