స్టార్ హీరో, విలక్షణ నటుడు విక్రమ్ లేటెస్ట్ మూవీ ‘తంగలాన్’. రీసెంట్గా రిలీజైన ఈ చిత్రం మంచి సక్సెస్‌ను సాధించింది. దీంతో ఇప్పుడీ చిత్రాన్ని బాలీవుడ్‌లోనూ రిలీజ్ చేయనున్నారు. ఇప్పటికే డబ్బింగ్ పనులు కూడా పూర్తయ్యాయి. సెప్టెంబర్ 6న హిందీలో విడుదల కానుంది. ఈ సందర్భంగా విక్రమ్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని సినిమాకు సంబంధించిన విషయాలతో పాటు రాజమౌళితో సినిమా గురించి కూడా మాట్లాడారు.
కచ్చితంగా ఓకే చెబుతా – “నా సినిమాలు అపరిచితుడు, పొన్నియిన్ సెల్వన్ హిందీలో మంచి సక్సెస్‌ను అందుకున్నాయి. ఇక తంగలాన్(Thangalaan) కూడా అదే స్థాయిలో హిట్ అవుతుందని అశిస్తున్నాను. నా అభిరుచికి తగ్గట్టుగా పాత్రలు వస్తే హిందీలో కచ్చితంగా సినిమా చేస్తాను. అలాంటి స్క్రిప్ట్‌తో ఎవరైనా సంప్రదిస్తే సంతోషంగా ఓకే చెబుతాను.” అని పేర్కొన్నారు.
రాజమౌళితో సినిమా నిజమే – ఆ మధ్య రాజమౌళితో విక్రమ్ ఓ సినిమా చేస్తారనే ప్రచారం సాగింది. మహేశ్ SSMB 29లో ఉండొచ్చనే వార్తలు కూడా వచ్చాయి. అయితే ఈ తాజా ఇంటర్వ్యూలో రాజమౌళితో సినిమా గురించి కూడా మాట్లాడారు. “రాజమౌళితో చర్చలు జరిపిన విషయం నిజమే. ఆయనతో కలిసి సినిమా చేస్తాను. కానీ, దానికి ఇంకా సమయం పడుతుంది. దేశంలోని అత్యంత గొప్ప డైరెక్టర్లలో ఆయన ఒకరు. మేము సరైన స్క్రిప్ట్ కోసం వెయిట్ చేస్తున్నాం” అని అన్నారు.
అదే కష్టమైనా సినిమా – “నేను ఇప్పటివరకు చాలా చిత్రాలు చేశాను. అందులో కష్టమైనది కోబ్రా. అనుకున్నస్థాయిలో ఆడలేదు. కానీ ఒక నటుడిగా నాకు సంతృప్తినిచ్చింది. కొన్నిసార్లు సినిమాకు ప్రశంసలు వచ్చినా కలెక్షన్స్ రావు. ఏదేమైనా కోబ్రాలో నేను చేసిన ఎన్నో సీన్స్ ఛాలెంజింగ్‌గా అనిపించాయి. ఇకపోతే నాకు ఒకే రకమైన పాత్రలంటే ఆసక్తి ఉండదు. నేను అలా చేస్తే నా అభిమానులు కూడా నిరాశ పడతారు. ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది మాత్రమే భిన్నంగా ప్రయత్నిస్తుంటారు. ఇక మణిరత్నం పొన్నియిన్ సెల్వన్ మంచి సక్సెస్ సాధించడంతో పాటు 4 జాతీయ అవార్డులను అందుకుంది. అది నాకెంతో సంతోషాన్నిచ్చింది. కానీ నాకు కూడా అవార్డ్ వచ్చి ఉంటే ఇంకా బాగుండేది.” అని చెప్పుకొచ్చారు.