బాలకృష్ణ 50 ఏళ్ల వేడుక (హైదరాబాద్): తాను ‘ఇంద్ర’ మూవీ చేయడానికి బాలకృష్ణ (Balakrishna) చేసిన ‘సమరసింహారెడ్డి’ సినిమా ఆదర్శమని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. బాలకృష్ణతో కలిసి ఒక ఫ్యాక్షన్ మూవీ చేయాలని ఉందని తన మనసులో మాటను బయటపెట్టారు. అగ్ర కథానాయకుడు నందమూరి బాలకృష్ణ చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా తెలుగు సినీ పరిశ్రమ నందమూరి బాలకృష్ణ సినీ స్వర్ణోత్సవ (NBK 50 Years Celebrations) కార్యక్రమం అట్టహాసంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు తరలివచ్చి, బాలకృష్ణ నట జీవితాన్ని, ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, “బాలయ్య బాబు 50 సంవత్సరాల వేడుకలో పాలు పంచుకోవడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇది బాలకృష్ణ గారికి మాత్రమే కాదు, తెలుగు చలన చిత్రానికి ఒక వేడుక. అరుదైన రికార్డు బాలయ్య సొంతం చేసుకున్నందుకు సంతోషం. ఎన్టీఆర్ గారికి ప్రజల మదిలో ప్రత్యేక స్థానం ఉంది. ఆయన కుమారుడిగా బాలకృష్ణ తండ్రి చేసిన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను మెప్పించడం మామూలు విషయం కాదు. తండ్రికి తగ్గ తనయుడిగా ఆయన తన ప్రత్యేకత చాటుకున్నారు.”
“ఫ్యాన్స్ గొడవలు పడుతుంటారు. హీరోల మధ్య ఎటువంటి మంచి బంధం ఉంటుందో తెలియడం కోసం కొన్ని వేడుకలు చేసుకునేవాళ్లం. అందుకే మా అభిమానులు కూడా కలిసి కట్టుగా ఉంటారు. మా ఇంట్లో ఎటువంటి శుభకార్యం జరిగినా బాలయ్య వస్తారు. మాతో కలిసి డ్యాన్స్ కూడా చేస్తారు. 50 సంవత్సరాల ఈ ప్రయాణం ఇంకా హీరోగా నటించే ఘనత బాలయ్య కే సొంతం. భగవంతుడు ఆయనకు ఇదే శక్తిని ఇస్తూ 100 ఏళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని భగవంతుడిని కోరుకుంటున్నాను. రాజకీయ, వైద్య రంగాలలో ఇలా సేవ చేయడం న భూతో న భవిష్యత్. మేమంతా ఒక కుటుంబంలాంటి వాళ్లం, ఫ్యాన్స్ ఈ విషయాన్ని అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నా,” అని అన్నారు.
- మోహన్ బాబు: “బాల్యం నుంచీ నటుడిగా విభిన్నమైన పాత్రలు పోషిస్తూ వచ్చారు బాలయ్య. 500 రోజులకుపైగా సినిమా ప్రదర్శితమవడమనే ఘనత ఆయనదే. హిందూపురం ఎమ్మెల్యేగా మూడు సార్లు గెలవడం సంతోషం.”
- వెంకటేశ్: “ఎన్టీఆర్ కుటుంబం నుంచి వచ్చి తనకంటూ ఒక ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు బాలకృష్ణ. ఆయనకు ఒక ప్రత్యేకత ఉంది. 50 సంవత్సరాల మీ ప్రయాణం ఎంతో మంది కొత్తవారికి ఆదర్శం.”
- శివ రాజ్‌కుమార్: “బాలకృష్ణ నాకు సోదరుడిలాంటివారు. ఆయనతో కలిసి ఓ సినిమాలో నటించినందుకు ఆనందంగా ఉంది. ఒకప్పుడు మేమంతా చెన్నైలో కలిసి ఉండేవాళ్లం. మీరు ఇలాగే 100 ఏళ్ల వేడుకలూ చేసుకోవాలి.”
- కమల్ హాసన్: “సంస్కారం వల్ల అందరూ గుర్తు పెట్టుకునే వ్యక్తి బాలయ్య. ఆయనకు తండ్రి, దైవం, గురువు ఎన్టీఆర్. బాలయ్య అంటే స్వచ్ఛమైన మనసు, స్వేచ్ఛగా ఉండే తత్వం. ఆయన నిండు నూరేళ్లు ఆరోగ్యంతో, ఐశ్వర్యంతో బాగుండాలి.”
- మంచు విష్ణు: “మీ గురించి చెప్పాలంటే సమయం సరిపోదు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నానంటే అది నాన్న గారు (మోహన్ బాబు), బాలయ్య అంకుల్ వల్లే. బాలకృష్ణ చాలా అల్లరి చేస్తారు. ఆయన హృదయం స్వచ్ఛమైనది. వైద్య రంగంలో ఆయన చేసినంత సేవ ఇంకెవరూ చేయలేనిది.”
- రానా: “బాలకృష్ణ నటించిన ఓ సినిమా విడుదలైన రోజు పుట్టా అందుకే ఇలా అల్లరి చేస్తుంటా.”
- నాని: “బాలకృష్ణ ను కలవడమే కాదు ఆయన్ను దగ్గరగా చూసినా ఇష్టపడతాం. సర్, మీరు ఇలాగే మరో 100 చిత్రాలు చేయాలి.”
- విజయ్ దేవరకొండ: “బాలయ్య నటన, ఆయన చేస్తున్న సేవ చూస్తూనే పెరిగా. నాకు తెలిసిన చాలా మంది ఆయన నిర్వహిస్తున్న ఆస్పత్రిలో చికిత్స పొందారు. నా లైగర్ సినిమా షూటింగ్ లో ఆయన్ను తొలిసారి కలిశా.”
- కందుల దుర్గేశ్, ఏపీ సినిమాటోగ్రఫీ మంత్రి: “సుదీర్ఘకాలం పాటు నటిస్తూ తెలుగు వారి కోసం సినిమాలు తీసిన బాలకృష్ణ కు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరుపున శుభాకాంక్షలు. ఈరోజు ఇలా ఆయనతో ఈ కార్యక్రమంలో పాలుపంచుకోవడం సంతోషం. ఆయన కీర్తి 100 ఏళ్ల పాటు ఇలాగే ఉండాలని ప్రార్థిస్తున్నాను. బాలకృష్ణ గారు సినీ, వైద్య, రాజకీయ రంగంలో ఇలాగే కొనసాగాలని కోరుకుంటున్నాను.”
- అనిల్ రావిపూడి: “బాలయ్య బాబు గారి గురించి మాట్లాడటం అదృష్టం అనుకోవాలి. ఆయన గురించి డైలాగ్స్ రాయాలంటే బాలయ్య గారి నుంచే పుట్టేస్తాయ్, బాడీ లాంగ్వేజ్ నుంచి వచ్చేస్తాయి. నటుడు, రాజకీయ నాయకుడు, మానవత్వం ఉన్న మనిషి ఇలా అనేక రూపాల్లో ఉండటం ఆయనకే సాధ్యం.”
- బుచ్చిబాబు: “ఈరోజు ఇంతకంటే మంచి మాట, గొప్ప మాట ఇంకొకటి ఉండదు. జై బాలయ్య.”
- సిద్ధు జొన్నలగడ్డ: “కలిసిన 5-6 సార్లు కూడా నేను చూసింది ఏంటంటే బాలయ్య గారు ఎవరినైనా నిజాయితీగా ఉంటే కచ్చితంగా ఇష్టపడతారు. మీ అనుభవం అంతా లేదు నా వయసు. మీరు నాకు స్ఫూర్తి.”
- అల్లరి నరేశ్: “బాలకృష్ణ గారు చాలా సరదా మనిషి. 50 ఏళ్ల వేడుకలు జరుపుకోవడం సంతోషం.”
- అడవి శేష్: “చిన్నప్పుడు మీ పాటలకు డ్యాన్స్ చేసే వాళ్లం. ఈరోజు మీ గురించి ఇలా మీ గురించి మాట్లాడటం చాల సంతోషం.”
ఎంపీ భరత్: “బాలయ్య గారు 50 ఏళ్లు సినిమాలు చేసినా, ఈ వయసులోనూ దూకుడుగా ఉన్నారు. ఆయన మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచి చూపించారు. నట, సేవ, రాజకీయం మూడు బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం. కానీ ఆయన చేస్తున్నారు. 50 సంవత్సరాలు బాలయ్య గారిని అభిమానులు గుండెల్లో పెట్టుకున్నారు. ఆయన ప్రతి రంగంలో మరింత బాగా రాణించాలని, ఆయనకు అల్లుడు అయినందుకు అదృష్టంగా ఫీల్ అవుతున్నాను.”
- పెమ్మసాని చంద్రశేఖర్, కేంద్ర మంత్రి: “రికార్డులు బద్దలు కొడుతూ 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న బాలయ్య గారికి శుభాకాంక్షలు. మిమ్మల్ని చూస్తూ పెరిగాం, మీరు మా స్ఫూర్తి. కుటుంబంతో ప్రేమగా మెలగడంలో, వయసు పెరుగుతున్న కూడా తరానికి తగ్గట్లు మారడంలో మీరు మాకు ఒక ఆదర్శం.”
- సుమలత, నటి: “నేను బాలయ్య గారితో రెండు సినిమాలలో నటించాను. బాలయ్య నాకు తెలిసినంత వరకూ చాలా సింపుల్. మనస్ఫూర్తిగా మాట్లాడతారు. ఆయన ప్రయాణం ఆదర్శనీయం. బాలయ్య గారు సినీ, రాజకీయ రంగాలలో ఇలాగే కొనసాగాలి అని కోరుకుంటున్నాను.”