తిరుమల శ్రీవారి ఆలయంలో అపచారం జరిగిందంటూ సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంపై టీటీడీ క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఎక్స్ లో పోస్ట్ చేసింది. తిరుమల శ్రీవారి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా తొలిరోజైన ధ్వజారోహణం నాడు, ధ్వజస్తంభంపై గరుడ ధ్వజ పటాన్ని ఎగురవేసే తాలూకు కొక్కి విరిగిపోయిందని, ఇది అపచారమని కొన్ని ప్రసార మాధ్యమాల్లో, సామాజిక మాధ్యమాల్లో విస్తృతంగా వదంతులు వస్తున్నాయని.. శ్రీవారి భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని కోరింది.
TTD TWEET…
సాధారణంగా బ్రహ్మోత్సవాల మునుపే ప్రతి ఒక్క వాహనాన్ని తనిఖీ చేసుకోవడం ఆనవాయితీ. ఏవైనా భిన్నమైన వస్తువులు ఉంటే వాటిని తొలగించి వాటి స్థానంలో కొత్త వాటిని అమర్చడం సంప్రదాయం అని వివరణ ఇచ్చింది. అందులో భాగంగానే భిన్నమైన ధ్వజపటం తాలూకు కొక్కిని అర్చకులు తొలగించి దాని స్థానంలో కొత్త దాన్ని ఏర్పాటు చేస్తున్నారని క్లారిటీ ఇచ్చింది.
అంతలో దీనిని అపచారం జరిగినట్లుగా కొన్ని ప్రచార మధ్యమాలు ప్రసారం చేయడం దురదృష్టకరం అని మండిపడింది. తిరుమలలో ఎటువంటి అపచారం జరగలేదని, భక్తులు ఇటువంటి వదంతులు నమ్మవద్దని టీటీడీ స్పష్టం చేసింది. అవన్నీ తప్పుడు ప్రచారాలని ఖండించింది.