
టీజీ ఈఏపీసెట్ 2026 ఇంజినీరింగ్ కోర్సుల మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ విజయవంతంగా ముగిసింది. విద్యార్థులు తమ అలాట్‌మెంట్ వివరాలను అధికారిక వెబ్‌సైట్‌లో తనిఖీ చేసుకోవచ్చు. సీటు పొందిన అభ్యర్థులు నిర్ణీత గడువులోగా రిపోర్టింగ్ పూర్తి చేయాలి, లేకపోతే సీటు రద్దవుతుంది.
Key Points
మొదటి విడతలో 79,891 మందికి సీట్ల కేటాయింపు, 8,162 సీట్లు ఖాళీగా మిగిలాయి.
విద్యార్థులు tgeapcet.nic.in లో లాగిన్ అయి తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
జూలై 14 లోపు ట్యూషన్ ఫీజు చెల్లించి, ఆన్లైన్లో సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయాలి.
రెండో విడత కౌన్సెలింగ్ జులై 17 నుండి ప్రారంభమవుతుంది, వెబ్ ఆప్షన్లు 18, 19 తేదీల్లో ఉంటాయి.
ఈఏపీసెట్ మొదటి రౌండ్ కేటాయింపు వివరాలు
TG EAPCET Seat Allotment : టీజీ ఈఏపీసెట్ – 2026 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన మొదటి విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ ముగిసింది.విద్యార్థులు తమకు ఏ కాలేజీలో సీటు వచ్చిందో తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ tgeapcet.nic.in లో లాగిన్ అయి చెక్ చేసుకోవచ్చు.
ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా జూన్ 22 నుంచి 29 వరకు అభ్యర్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ నిర్వహించారు. ఈ ప్రక్రియకు మొత్తం 89,450 మంది అభ్యర్థులు హాజరై… వెరిఫికేషన్ ప్రాసెస్ పూర్తి చేసుకున్నారు.
జూలై 5 నుంచి 7 వ తేదీ వరకు వెబ్ ఆప్షన్లను ఎంచుకున్నారు. మొత్తం 88,510 మంది అభ్యర్థులు ఈ ప్రక్రియలో పాల్గొనగా…. మొత్తంగా 55,63,270 ఆప్షన్లు నమోదు చేసుకున్నారు. అభ్యర్థులు సాధించిన ర్యాంకులు, ఎంచుకున్న వెబ్ ఆప్షన్లు ఆధారంగా…. అధికారులు సీట్లు కేటాయించారు.
అలాట్‌మెంట్ ఆర్డర్, రిపోర్టింగ్ ప్రక్రియ
రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఇంజినీరింగ్ కళాశాలల్లో అందుబాటులో ఉన్న మొత్తం 88,053 సీట్లకు గాను, తొలి విడతలో 79,891 మంది అభ్యర్థులకు సీట్లను కేటాయించారు. దీంతో మొదటి విడత ముగిసేసరికి ఇంకా 8,162 సీట్లు ఖాళీగా మిగిలాయి. ఈ మిగిలిపోయిన సీట్లను రాబోయే తదుపరి విడత (రెండో విడత) కౌన్సిలింగ్ ప్రక్రియ ద్వారా భర్తీ చేయనున్నారు.
మొదటి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు కౌన్సెలింగ్ నిబంధనల ప్రకారం నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ద్వారా ట్యూషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఫీజు చెల్లించిన అనంతరం వెబ్‌సైట్ లోనే సెల్ఫ్ రిపోర్టింగ్ ప్రక్రియను పూర్తి చేయాలి. అభ్యర్థులు జూలై 14వ తేదీ వరకు ఆయా కాలేజీల్లో రిపోర్టింగ్ చేయడానికి గడువు విధించారు.
ఒకవేళ నిర్ణీత గడువులోగా ఆన్‌లైన్ ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ పూర్తి చేయని పక్షంలో, సదరు అభ్యర్థికి మొదటి విడతలో వచ్చిన సీటు కేటాయింపు రద్దవుతుంది. అభ్యర్థులు https://tgeapcet.nic.in/default.aspx వెబ్ సైట్ ద్వారా తమ అలాట్‌మెంట్ ఆర్డర్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రెండో విడత కౌన్సెలింగ్ షెడ్యూల్
టీజీ ఈఏపీసెట్ – 2026 రెండో విడత కౌన్సెలింగ్ జులై 17వ తేదీ నుంచి ప్రారంభమవుతుంది. జులై 18న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ప్రక్రియ నిర్వహించనుండగా, జులై 18, 19 తేదీల్లో విద్యార్థులు రెండో విడత వెబ్ ఆప్షన్లను ఎంచుకోవాల్సి ఉంటుంది. ఈ ప్రక్రియ మొత్తాన్ని కూడా విద్యార్థులు పైన పేర్కొన్న అధికారిక వెబ్‌సైట్ ద్వారానే పూర్తి చేసుకోవాల్సి ఉంటుంది.
మొదటి విడతలో సీటు రాని లేదా మెరుగైన సీటు ఆశించే విద్యార్థులకు రెండో విడత కౌన్సెలింగ్ ఒక మంచి అవకాశం. తదుపరి ప్రక్రియ కోసం అధికారిక వెబ్‌సైట్‌ను నిరంతరం పర్యవేక్షించడం ముఖ్యం.


