తిరుమల లడ్డూ వివాదంపై నటి ప్రణీత స్పందించారు. మన సంస్కృతి, సంప్రదాయాలు, విలువలను తరచూ సామాజిక మాధ్యమాల్లో పంచుకునే ప్రణీత (Pranitha) తాజాగా తిరుమల లడ్డూపై వస్తున్న వార్తలు భక్తులు ఊహించలేనివి అన్నారు. ఈ మేరకు ఆమె సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టారు. ‘శ్రీవారి లడ్డూ తయారీలో జంతు కొవ్వు వినియోగించడం దారుణం. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటారని ఆశిస్తున్నా. ఇది భక్తులు కలలో కూడా ఊహించలేనిది’ అని ప్రణీత తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
ప్రస్తుతం ఈ పోస్ట్ నెట్టింట్లో వైరల్ అవుతుండగా, పలువురు నెటిజన్లు దీనిపై స్పందిస్తున్నారు. ఈ వివాదంపై మొదటగా స్పందించినందుకు ప్రణీత (Pranitha Subhash) ను అభినందిస్తున్నారు.
మరోవైపు, తిరుమల శ్రీవారి లడ్డూ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తిరుమల, తిరుపతి దేవస్థానం మహాప్రసాదమైన లడ్డూల తయారీలో పెద్దఎత్తున కల్తీ జరిగిందని, అందులో పాలకు బదులు ఇతర కొవ్వులు (ఫారిన్ ఫ్యాట్స్) కలిసే ఉన్నాయని గుజరాత్ నేషనల్ డెయిరీ డెవలప్‌మెంట్ బోర్డు (ఎన్‌డీడీబీ) కాఫ్ లిమిటెడ్ అనుమానం వ్యక్తం చేసింది. లడ్డూ తయారీలో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, చేప నూనె వంటివి కలిసివున్నాయేమోనని పేర్కొంది.