
📌 Key Points
- టీటీడీ టెండర్లలో పాల్గొనేందుకు సరఫరాదారులు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవాలి.
- ధ్రువీకరించబడిన సరఫరాదారుల డేటాబేస్ భవిష్యత్ కొనుగోళ్లకు ఉపయోగపడుతుంది.
- నకిలీ సరఫరాదారులను గుర్తించి తొలగించడం ద్వారా నిజమైన వారికి అవకాశాలు లభిస్తాయి.
- డిజిటల్ చెల్లింపుల ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తన కొనుగోళ్ల వ్యవస్థను ప్రక్షాళన చేస్తోంది. ఇందులో భాగంగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌ను తప్పనిసరి చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. టెండర్ల ప్రక్రియను మరింత పారదర్శకంగా మార్చేందుకు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
టీటీడీలో డిజిటల్ కొనుగోళ్ల విప్లవం
టీటీడీలో వస్తువుల కొనుగోలు ప్రక్రియను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం సిద్ధమైంది. గతంలో ఉన్న విధానాలను చెక్ పెడుతూ… ప్రక్షాళన చేసే దిశగా అడుగులు వేసే పనిలో పడింది. పూర్తి పారదర్శకంగా నాణ్యమైన సరకులను సరైన ధరలకు కొనుగోలు చేసేందుకు వీలుగా ఒక సమీకృత డిజిటల్ ప్లాట్‌ఫాంను అభివృద్ధి చేసింది.
వెండర్, ట్రేడర్ల రిజిస్ట్రేషన్ నుంచి నాణ్యత తనిఖీలు, బిల్లుల చెల్లింపు వరకూ ప్రతి ప్రక్రియనూ ఈ ప్లాట్‌ఫాం ద్వారానే నిర్వహించనున్నారు. తలనీలాలు, వస్త్రాల్లాంటి టీటీడీ విక్రయించే వస్తువులకు ప్లాట్‌ఫాంగానూ దీన్నే వినియోగిస్తారు. వస్తువులు, సేవలు సహా టీటీడీ ఏది కొనాలన్నా, విక్రయించాలన్నా ఇకపై ఈ ప్లాట్‌ఫాం ద్వారానే జరుగుతాయి.
ఇందులో భాగంగా డిజిటల్ ప్రోక్యూర్‌మెంట్, టెండర్ పోర్టల్ అభివృద్ధిపై టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి శనివారం సమీక్ష నిర్వహించారు. ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు మరియు టెండర్ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో నిర్వహించేందుకు పలు ఆధునిక సదుపాయాలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు రేడియంట్ ఇన్ఫోనెట్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూపొందించిన వెబ్ సైట్ ప్రోటోటైప్, డిజైన్ పై అధికారులతో కలిసి చర్చించారు.
• టీటీడీ టెండర్ ప్రక్రియలో పాల్గొనేందుకు ఆసక్తి చూపే సరఫరాదారులు తప్పనిసరిగా పోర్టల్‌లో ఆన్‌లైన్ ద్వారా నమోదు కావాలి.
సరఫరాదారులకు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ తప్పనిసరి
• నమోదైన సరఫరాదారుల వివరాలు, అర్హతలు మరియు నేపథ్యాన్ని పూర్తిగా పరిశీలిస్తారు. అర్హత కలిగిన సరఫరాదారులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు.
• భవిష్యత్ కొనుగోలు ప్రక్రియలకు ఉపయోగపడే విధంగా ధ్రువీకరించిన సరఫరాదారుల విశ్వసనీయ డేటాబేస్ రూపొందించబడుతుంది.
• ఈ వ్యవస్థ ద్వారా నకిలీ సరఫరాదారులు, మధ్యవర్తులను గుర్తించి తొలగించడం సాధ్యమవుతుంది. దీంతో టెండర్లలో నిజమైన సరఫరాదారులకు సమాన అవకాశాలు కల్పించబడతాయి.
• మార్కెట్ ధోరణులు, ధరల మార్పులు, సరఫరా పరిస్థితులను విశ్లేషించేందుకు ఏఐ సాంకేతికతను ఉపయోగించి మెరుగైన కొనుగోలు నిర్ణయాలు తీసుకునే అవకాశం కలుగుతుంది.
కొనుగోళ్లలో పారదర్శకతకు టీటీడీ చర్యలు
• టెండర్ ప్రక్రియ, సరఫరా నిర్వహణ, చెల్లింపుల వ్యవస్థలను ఒకే వేదికపై సమగ్రంగా అనుసంధానమవుతాయి.
• డిజిటల్ విధానంలో చెల్లింపులు వేగంగా జరిగేలా ఈ వ్యవస్థ సహకరిస్తుంది. దీని ద్వారా సరఫరాదారుల్లో విశ్వాసం పెరుగుతుంది.
• పారదర్శక వ్యవస్థ కారణంగా ఎక్కువ మంది అర్హత కలిగిన సరఫరాదారులు టెండర్లలో పాల్గొనే అవకాశం ఉంటుంది.
• ఈ పోర్టల్ ద్వారా కొనుగోలు ప్రక్రియ మరింత పారదర్శకంగా, వేగంగా, సమర్థవంతంగా నిర్వహించబడుతుంది.
టీటీడీ తీసుకున్న ఈ నిర్ణయం పారదర్శకతను పెంచడమే కాకుండా, నిజాయితీగా టెండర్లు వేసే సరఫరాదారులకు మేలు చేస్తుందని భావిస్తున్నారు. రానున్న రోజుల్లో దీని ఫలితాలు ఎలా ఉంటాయో చూడాలి.


