
నేను ఇటీవలే చూసిన త్రిభాషా చిత్రాల్లో 8 వసంతాలు చిత్రం నాకు చాలా నచ్చింది. సామాన్య అమ్మాయి జీవితం, ఆమె ఆత్మస్థైర్యం, ప్రేమ ఈ చిత్రంలో చక్కగా చూపించారు. అనంతిక నటన కూడా అద్భుతంగా ఉంది.
Key Points
అనంతిక సనీల్ కుమార్ అద్భుతమైన నటన
ప్రేమ, ఆత్మస్థైర్యం, మార్షల్ ఆర్ట్స్‌తో కూడిన కథ
గుండెను తాకే డైలాగ్స్
కథానాయిక ప్రాధాన్యం
8 వసంతాలు.. ఈ మధ్యకాలంలో చూసిన త్రిభాష సినిమాల్లో చాలా నచ్చిన సినిమా. అప్పట్లో గీతాంజలి, ప్రేమ, మజ్ను, అభినందన, నీరాజనం లాంటి అద్భుతమైన ప్రేమ చిత్రాలు వచ్చాయి. పూర్తిగా అలాంటిదే కాకపోయినప్పటికీ ప్రేమ భావాన్ని చాలా హృద్యంగా చిత్రీకరించిన చిత్రంగా చెప్పొచ్చు.
కథ విషయానికి వస్తే ప్రేమ చుట్టూనే కథంతా తిరుగుతుంది. కానీ ఆ ప్రేమ ఒక అమ్మాయి ప్రేమ, అది కూడా ఒక ఆత్మస్థైర్యం నిండుగా గల అమ్మాయి కి అంతే మెండుగా భావవ్యక్తీకరణ మనసు ఉంటే ఎలా ఉంటుంది అనేది దర్శకుడు ఈ చిత్రంలో చాలా చక్కగా చూపించాడు.
కథనం, పాత్రలు తీసుకుంటే హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్ అంటే కథానాయిక ప్రాధాన్యం ఉన్న చిత్రాలు అని అంటుంటాం కదా, కథానాయిక ప్రాధాన్యం అంటే హీరోయిన్ కి ఏదో పెద్ద ఫ్లాష్ బ్యాక్ ఉండి ప్రస్తుతం ఏదో అద్భుతాలు చేసే చిత్రాలుగా ఇప్పటివరకు చాలా వచ్చాయి.
కానీ ఒక సామాన్యమైన అమ్మాయి, తన సాధారణ జీవితంలో జరిగేటువంటి సంఘటనలను తీసుకొని దానికి ఆత్మస్థైర్యాన్ని జోడించి, ఆత్మస్థైర్యాన్ని ఎలివేట్ చేయడానికి మార్షల్ ఆర్ట్స్ లో ప్రావీణ్యం ఉన్న అమ్మాయిగా చూపించి చిత్రీకరించిన తీరు చాలా గొప్పగా ఉంది.
కథానాయక సిద్ధి అయోధ్య పాత్రలో అనంతిక సనీల్ కుమార్ చక్కని నటన ప్రదర్శించింది. ఆమెను రెండో చిత్రం లో చూస్తున్నా. మొదటిది MAD చిత్రం, దాంట్లో కూడా చాలా బాగా చేసింది.
ఇదివరకు డైలాగులు అంటే త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, బొమ్మరిల్లు భాస్కర్ లాంటి వాళ్లని చూశాను కానీ, ఈ చిత్రంలో మాటల రచయిత పెద్దగా పరిచయం ఉన్న వ్యక్తి అయి ఉండడు కానీ, “అతనికి మనుషులతో, మనసులతో ఈ సమాజంలో బాగా పరిచయం ఉన్న అనుభవం కనిపించింది”.
ఆకట్టుకునే నటన
ప్రతి ఒక్క డైలాగ్ గుండె లోతుల్లోంచి వచ్చినట్టుగా ఉంటాయి. చాలామంది మనసు పొరల్లో గట్టిగానే స్పృశిస్తాయి (ఎమోషనల్ ఫూల్స్ ని అయితే ఏడిపిస్తుంది). సినిమా మొదటినుంచి చివరిదాకా “ముఖ్యంగా సిద్ధి పలికే మాటలు ఒక్కొక్కటి ఒక్కో ఆణిముత్యాలు తోస్తాయి”. చివర్లో కథానాయకుడి చేత కూడా చెప్పించిన డైలాగ్స్ నిజంగానే కదిలిస్తాయి.
నటులు వాళ్ల వాళ్ల స్వభావాలు అలా ఎందుకు ఉన్నాయని గట్టిగా చెప్పడానికి వాళ్ల గతాన్ని చాలా బాగా సపోర్టివ్ గా చూపించారు. మిలిటరీలో పనిచేస్తున్న తండ్రి తన చిన్న వయసులోనే చనిపోవడంతో మనోవేదనకు గురై తనలోని ఒక రచయితను బయటకు తెచ్చి, తనను తాను ఓదార్చుకున్న తీరు, మలుచుకున్న తీరు ఒక పుస్తకంగా రాస్తే పదిమందికి ఉపయోగపడుతుందని, తనలాంటి వాళ్ళకి మేలు చేస్తుందనే ఆలోచన నన్ను బాగా కనెక్ట్ చేస్తుంది.
మొదటిసారి తను ప్రేమలో పడటం ఆ తర్వాత ఆ హీరో ఇంట్లో పరిస్థితి వల్ల మోసపోవడం మామూలుగానే అనిపించినప్పటికీ ఆ వీడ్కోలులో తనతో చెప్పించిన డైలాగులు చాలా వాస్తవికంగా తోస్తాయి. మళ్లీ తనను తాను సర్ది చెప్పుకొని, ఓదార్చుకొని మామూలుగా బతుకుతున్న సమయంలో మరొక రచయితతో పరిచయం ప్రేమగా మారినప్పుడు అక్కడ మళ్ళీ పరిస్థితులు ఆ సన్నివేశాలు చాలా మెచ్యూర్ గా అర్ధవంతంగా తోస్తాయి. అసలు ప్రతి పాత్రకి మనసుపెట్టి మాట్లాడించినట్టుగా అనిపిస్తుంది,
ఒక సీన్ తప్ప. హీరోయిన్ మెంటల్ గానే కాదు ఫిజికల్ గా కూడా స్ట్రాంగ్ అని మెసేజ్ ఇవ్వడం కోసం కాశీలో పెట్టిన పోరాట సన్నివేశంలో మాత్రం నాకు కొంత అస్పష్టత మిగిలింది. ఎందుకంటే అక్కడ కాశీలో ఒక బ్రాహ్మణుడు కబేలాల్లోకి అత్యాచారం కోసం తీసుకు వెళ్లినట్టుగా చూపించడం, అత్యాచార యత్నం చేసిన వాళ్ళని దాదాపుగా చంపేసినట్టుగా చూపించి (చంపకుండా చితక్కొట్టి ఉంటే బాగుండు), మళ్ళీ ఉదయాన్నే తన పని తాను చేసుకోవడం అనేది మళ్లీ ఈ మధ్యకాలంలో వచ్చే బోయపాటి, వంగా, అట్లీ యాక్షన్ సన్నివేశం లాగా తోచింది (వివాదాస్పదం చేయడానికి కొందరికి అవకాశం కూడా).
తల్లికి, చనిపోయిన తన తండ్రికి, విద్య నేర్పిన గురువుకి, తనతో ఉన్న స్నేహితులకి తన మనసుకు నచ్చిన వాడికి కథనాయిక ఇచ్చే గౌరవం, విలువ ప్రాధాన్యం మన నిజ జీవితంలో ఎలా ఉండాలి అనేదానికి దర్పణంలా తోస్తుంది. చివర్లో 8 వసంతాలు ఎందుకు పెట్టాల్సి వచ్చిందో సంజయ్ ద్వారా చెప్పించిన తీరు అతని పాత్రను మలచిన తీరు కూడా బాగుంటుంది.
ప్రభావవంతమైన డైలాగ్స్
అక్షరం విలువను మాత్రం అందనంత ఎత్తుకు పెంచాడు “చదివే పాటకుడికి ప్రేరణ ఇవ్వనప్పుడు మన అక్షరాలు ఎందుకండీ” అనే మాట ఒక రచయితగా నాకు బాగా తట్టింది. చిత్రంలో ప్రతీ పాత్రని చాలా బాగా మలిచారు. నటులు కూడా తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు.
చిత్రీకరణ గీతాంజలి సినిమాలో లాగా ఊటీ కాఫీ తోటల్లో, కశ్మీర్ లో అందమైన లొకేషన్లు, దానికి తగ్గట్టుగా ప్రతి నటుల కాస్ట్యూమ్స్ ముఖ్యంగా హీరోయిన్ వి చాలా సెలెక్టివ్ గా హుందాగా ఉన్నాయి. అలానే సంగీతం, పాటలు రెండే ఉన్నప్పటికీ బాగున్నాయి. బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా సన్నివేశాలకు బాగా సింక్ అయింది.
మొత్తానికి ఒక మాంచి ఫీల్ గుడ్ మూవీ ఫ్యామిలీతో కలిసి చూసేలాగా ముఖ్యంగా ఆడపిల్లలకి ధైర్యాన్ని, ఆత్మస్థైర్యాన్ని ఇచ్చేలాగా చాలా చక్కగా తీశారు. చిన్న నటులతో ఒక రోటీన్ కథతో అద్భుత చిత్రాన్ని తీయొచ్చు అనేది ఈ కొత్త దర్శకుడు ఫణీంద్ర నర్సెట్టి మరోసారి నిరూపించారు.
మనసుకు హత్తుకునేలా తీస్తే ఏ చిత్రమైన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయి ఎన్నటికీ ఆదరిస్తారని మళ్ళీ నిరూపితమైన ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ 4.5/5
✍🏻 డా. విజయ్ కుమార్ చల్లూరి
8 వసంతాలు చిత్రం ప్రేమ, ఆత్మస్థైర్యం, మానవ సంబంధాలను అద్భుతంగా చిత్రీకరించింది. అనంతిక నటన, డైలాగ్స్ చాలా గుర్తుండిపోతాయి. తప్పక చూడదగిన చిత్రం ఇది.


