
📌 Key Points
- సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్ చిత్రాలను వదులుకున్న ఐశ్వర్యా రాయ్.
- తమిళంలో రజనీకాంత్ `నరసింహ`, తెలుగులో వెంకటేష్ `ప్రేమంటే ఇదేరా` మిస్.
- `నరసింహ`లో నెగటివ్ షేడ్ ఉన్న నీలాంబరి పాత్రను నిరాకరించిన ఐష్.
- `ప్రేమంటే ఇదేరా`కు మొదట అంగీకరించి చివరి నిమిషంలో తప్పుకుంది.
ప్రముఖ నటి ఐశ్వర్యా రాయ్ తన కెరీర్‌లో రెండు కీలకమైన తప్పులు చేసి సౌత్‌లో రెండు ఇండస్ట్రీ హిట్ చిత్రాలను కోల్పోయింది. తమిళంలో రజనీకాంత్ నరసింహ, తెలుగులో వెంకటేష్ ప్రేమంటే ఇదేరా వంటి బిగ్ హిట్స్ ఆమె చేతిలోంచి ఎలా జారిపోయాయో ఈ కథనంలో చూద్దాం.
ఐశ్వర్యా రాయ్ కెరీర్ మలుపులు
మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్ హిందీలో తర్వాత తమిళంలోనే ఎక్కువ సినిమాలు చేసింది. ఆమె తమిళ చిత్రంతోనే హీరోయిన్‌గా మారింది. `ఇరువుర్`(ఇద్దరు)తో హీరోయిన్‌గా వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత తమిళంలో `జీన్స్`, `కండుకొండయన్ కండుకొండయన్`, `రావనన్`, `రోబో`, `పొన్నియిన్ సెల్వన్` వంటి చిత్రాల్లో నటించింది. కానీ ఐశ్వర్య రాయ్ తన కెరీర్‌లో రెండు అతిపెద్ద మిస్టేక్స్ చేసింది. రెండు ఇండస్ట్రీ హిట్లని మిస్ చేసుకుంది. అందులో ఒకటి తమిళంలో కాగా, మరోటి తెలుగులో కావడం గమనార్హం.
ఐశ్వర్య రాయ్ కి `ఇరువుర్` తర్వాత తమిళంలో మరో బంపర్ ఆఫర్ వచ్చింది. సూపర్ స్టార్ రజనీకాంత్‌తో కలిసి నటించే ఛాన్స్ ఆమెని వరించింది. కేఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన `నరసింహ`(పడయప్ప) చిత్రంలో నీలాంబరి పాత్రకి మొదట ఐశ్వర్యనే అడిగారట. కానీ ఆమె చేయలేదట. నెగటివ్ షేడ్ పాత్ర కావడంతో పెద్దగా ఆసక్తి చూపించలేదట. అప్పుడప్పుడే హీరోయిన్‌గా ఆఫర్లు వస్తుండటంతో ఇలాంటి టైమ్‌లో ఇలాంటి పాత్ర చేస్తే కెరీర్‌కి ఇబ్బంది అవుతుందని భావించిందట ఐష్. అలా ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకుంది.
రజనీకాంత్‌తో నరసింహను వదులుకున్న ఐష్
కెఎస్ రవికుమార్ దర్శకత్వంలో రజనీకాంత్ నటించిన `నరసింహ` సినిమాలో నీలాంబరి పాత్రలో రమ్యకృష్ణ చేసిన విషయం తెలిసిందే. హీరోయిన్‌గా సౌందర్య నటించింది. శివాజీ గణేషన్ ముఖ్య పాత్ర పోషించారు. ఈ మూవీ బాక్సాఫీసు వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. 1999 ఏప్రిల్ 10 ఈ సినిమా విడుదలై ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది. అప్పటి వరకు తమిళనాడులో ఉన్న అన్ని రికార్డులను ఈ సినిమా బ్రేక్ చేసింది. ఇదిలా ఉంటే నీలాంబరి పాత్ర కోసం ఐశ్వర్య రాయ్ తర్వాత నగ్మ, మీన వంటి వారిని కూడా అడిగారట. కానీ వాళ్లు కూడా రిజెక్ట్ చేశారు. ఆ ఛాన్స్ రమ్యకృష్ణకి దక్కింది. ఆమె దుమ్ములేపింది. సినిమాకి సెకండ్ హీరోగా నిలిచింది. ఈ సినిమా రమ్యకృష్ణ కెరీర్‌కి బిగ్ టర్నింగ్ పాయింట్ అయ్యిందని చెప్పొచ్చు. అలా ఐష్ ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకుంది.
దీనికి ముందే ఐశ్వర్య రాయ్ తెలుగులో మరో ఇండస్ట్రీ హిట్‌ని మిస్ చేసుకుంది. ఆమె తెలుగులో `ప్రేమంటే ఇదేరా` మూవీలో నటించే అవకాశం దక్కింది. వెంకటేష్ హీరోగా జయంత్ సీ పరాన్జీ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఇందులో ప్రీతి జింటా పాత్రకి ముందుగా ఐశ్వర్య రాయ్‌ని అనుకున్నారు. ఆమె ఓకే చెప్పింది. అంతా ఓకే అయ్యింది. కానీ చివరి నిమిషంలో హ్యాండిచ్చిందట. హిందీలో చేసిన సినిమాలు ఆడకపోవడంతో దీన్ని రిజెక్ట్ చేసింది. దీంతో ఆ స్థానంలో చాలా మంది హీరోయిన్లని అనుకున్నారు. ఫైనల్‌గా ప్రీతి జింటాని ఎంపిక చేశారు. 1998 అక్టోబర్ 30న విడుదలైన ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. వెంకటేష్ కెరీర్‌లో మరో బ్లాక్ బస్టర్‌గా నిలిచింది.
వెంకటేష్ ప్రేమంటే ఇదేరా ఛాన్స్ మిస్
ఇలా ఐశ్వర్య రాయ్ సౌత్‌లో రెండు అసలైన బ్లాక్ బస్టర్స్, ఇండస్ట్రీ హిట్స్ ని మిస్ చేసుకుంది. ఈ రెండు చిత్రాలను రిజెక్ట్ చేసి చాలా పెద్ద తప్పు చేసింది. ఈ సినిమాలు సౌత్‌లో ఆమె కెరీర్‌నే మార్చేయగలిగే మూవీస్ కావడం విశేషం. ఒకవేళ చేసి ఉంటే ఇక్కడ స్టార్ హీరోయిన్‌గా రాణించేది. కానీ ఆ అవకాశాన్ని వదులుకుంది. హిందీకే పరిమితమయ్యింది. అయితే `నరసింహ`కి రిజెక్ట్ చేసినా ఆ తర్వాత రజనీతో `రోబో` చిత్రంలో నటించిన విషయం తెలిసిందే. ఈ సినిమా సైతం ఇండస్ట్రీ హిట్‌గా నిలిచింది.
ఐశ్వర్యా రాయ్ కెరీర్‌లోని ఈ రెండు నిర్ణయాలు ఆమె సౌత్‌లో మరింత బలమైన స్థానాన్ని పొందకుండా చేశాయి. ఒకవేళ ఆ పాత్రలు చేసి ఉంటే, ఆమె సౌత్ ఫిల్మోగ్రఫీ మరింత గొప్పగా ఉండేది.


