
📌 Key Points
- ప్రైవేట్ స్లీపర్ బస్సుల భద్రతపై ఏపీ ప్రభుత్వం సమీక్ష.
- ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోనున్న ప్రభుత్వం.
- స్లీపర్ బస్సుల్లో మార్పులు చేయడం వల్ల ప్రమాదాలు జరుగుతున్నాయని గుర్తింపు.
- 300 కి.మీ పైన ప్రయాణించే బస్సుల్లో ఇద్దరు డ్రైవర్లు తప్పనిసరి.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తరచుగా జరుగుతున్న ప్రమాదాల కారణంగా ప్రైవేట్ స్లీపర్ బస్సులను నిషేధించే ఆలోచనలో ప్రభుత్వం ఉంది. ప్రమాదాల నివారణకు కఠినమైన చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిర్ణయించారు.
ప్రైవేట్ స్లీపర్ బస్సులపై నిషేధం?
ఏపీలో వరుసగా జరుగుతున్న ఘోర ప్రమాదాల నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రైవేట్ స్లీపర్ బస్సులను నిషేధించాలని యోచిస్తోంది. అధికారులు ఈ విషయాన్ని వెల్లడిస్తూ.. ప్రమాదాల నివారణకు కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు తెలిపారు.
బస్సు ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్త లపై చర్చించేందుకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఏర్పాటు చేసిన మంత్రివర్గ ఉపసంఘం ఇటీవల సమావేశమైంది. ఈ భేటీలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి, హోం మంత్రి వంగలపూడి అనిత పాల్గొన్నారు. ఈ సమావేశం తర్వాత ప్రైవేట్ స్లీపర్ బస్సుల నిషేధం చర్చ తెరపైకి వచ్చింది.
ప్రస్తుతం రోడ్లపై తిరుగుతున్న చాలా ప్రైవేట్ స్లీపర్ బస్సులు కంపెనీ నుంచి తయారైనవి కావని, సాధారణ బస్సులను స్లీపర్ కోచ్‌లుగా మార్చినవని అధికారులు కమిటీ దృష్టికి తీసుకెళ్లారు. వీటిలో అనేక సమస్యలు ఉన్నాయి. ఈ కారణంగా ప్రయాణికులు ప్రాణాలు కోల్పోవలసిన పరిస్థితి వస్తుంది. పాత వాహనాలకు మాడిఫికేషన్ చేసి రోడ్లపు చాలా బస్సులను తిప్పుతున్నారు.
ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు
మొదటి దశలో, కంపెనీలలో కాకుండా బయట మార్పులు చేసిన (Non-factory-built) స్లీపర్ బస్సు లను నిషేధించే అంశాన్ని ప్రభుత్వం పరిశీలిస్తోందని ఇటీవల మంత్రి మండిపల్లి రామప్రసాద్ రెడ్డి అన్నారు. అసురక్షిత స్లీపర్ కోచ్‌ల కార్యకలాపాలను నియంత్రించడానికి లేదా పూర్తిగా నిషేధించడానికి కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా అనుమతులు కోరుతామని స్పష్టం చేస్తున్నారు.
స్లీపర్ బస్సుల నిషేధంపై నిర్ణయం తీసుకునేలోపే, ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది. ఈ సందర్భంగా కొన్ని నిర్ణయాలు తీసుకున్నది.
బస్సు బయలుదేరే చోటు నుంచి గమ్యస్థానానికి చేరుకోవడానికి నిర్ణీత సమయాన్ని కేటాయిస్తారు. నిర్ణీత సమయం కంటే ముందే బస్సు వస్తే, అతివేగంగా నడిపినట్లు పరిగణించి ఆ బస్సును నగరంలోకి అనుమతించరు.
రెండు డ్రైవర్లు తప్పనిసరి!
300 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించే ప్రైవేట్ బస్సు ల్లో తప్పనిసరిగా ఇద్దరు డ్రైవర్లు ఉండాలి. ఎందుకంటే.. చాలా ప్రైవేట్ ట్రావెల్స్ ఖర్చు తగ్గించుకోవడానికి ఒకే డ్రైవర్ మీద ఆధారపడుతున్నాయి. అంతేకాదు సరైన అర్హతలు లేని వ్యక్తులను డ్రైవర్లుగా నియమించుకుంటున్నాయి. ఇలాంటి విషయాలు కూడా ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇప్పటికే ప్రైవేట్ ట్రావెల్స్‌లో అధికారులు తనిఖీలు చేస్తున్నారు.
ప్రభుత్వం త్వరలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. ప్రయాణికుల భద్రత కోసం ప్రభుత్వం మరిన్ని కఠినమైన చర్యలు చేపట్టే దిశగా అడుగులు వేస్తుంది. దీనిపై ప్రజల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకునే అవకాశం ఉంది.


