
ఆంధ్రప్రదేశ్‌లో వాతావరణ ద్రోణి ప్రభావంతో భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరికలు జారీ అయ్యాయి. రాబోయే రెండు రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Key Points
ఏపీలో వాతావరణ ద్రోణి ప్రభావంతో రెండు రోజుల పాటు భారీ వర్షాలు.
కాకినాడ, కోనసీమ, ప్రకాశం సహా పలు జిల్లాలకు పిడుగుల హెచ్చరికలు.
గంటకు 30-40 కి.మీ. వేగంతో ఈదురు గాలులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.
రైతులు, పశువుల కాపరులు సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని సూచన.
రాష్ట్రంలో ద్రోణి ప్రభావం: భారీ వర్షాలకు అవకాశం
AP Weather Updates 2026 : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. రాష్ట్రంలో ఏర్పడిన వాతావరణ ద్రోణి ప్రభావంతో రాబోయే రెండు రోజుల పాటు పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది. కొన్ని ప్రాంతాల్లో పిడుగులు పడే ప్రమాదం కూడా ఎక్కువగా ఉందని…. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ద్రోణి ప్రభావంతో శనివారం(జూన్ 27) ఉత్తరాంధ్ర పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, మార్కాపురం, ప్రకాశం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉంది. ఈ జిల్లాలతో పాటు రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో కూడా అక్కడక్కడ చల్లటి గాలులతో కూడిన తేలికపాటి జల్లులు కురుసే సూచనలున్నాయి.
పిడుగులు, ఈదురు గాలులు: ప్రజలకు హెచ్చరికలు
ఆదివారం నాటికి వర్షాల ప్రభావం మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతో పాటు పిడుగులు పడే ఛాన్స్ ఉంది. ఈ జిల్లాల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీస్తూ మోస్తరు వర్షాలు కురుస్తాయని విపత్తుల నిర్వహణ సంస్థ స్పష్టం చేసింది.
వర్షాలు , ఈదురు గాలులు వచ్చే సమయంలో ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని అధికారులు సూచించారు. ఉరుములు, మెరుపులు వచ్చేటప్పుడు ఎట్టి పరిస్థితుల్లోనూ చెట్ల కింద, హోర్డింగ్స్ (ప్రకటనల బోర్డులు), పాత గోడల కింద నిలబడకూడదని హెచ్చరించారు. ముఖ్యంగా పొలాల్లో ఉండే రైతులు, పశువులను మేపే కాపరులు పిడుగుల బారిన పడకుండా ఉండటానికి ఉరుములు రాగానే సురక్షితమైన శాశ్వత కట్టడాల లోపలికి వెళ్లాలని సూచించారు. రోడ్లపై తెగిపడిన విద్యుత్ వైర్లు ఉంటే వాటికి దూరంగా ఉండాలని…. వెంటనే సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రమాదకర జిల్లాల జాబితా: తీసుకోవాల్సిన జాగ్రత్తలు
వాతావరణ శాఖ బులెటిన్ ప్రకారం.. నిన్నటి వరకు ఆగ్నేయ మధ్యప్రదేశ్ మరియు దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఉపరితల ఆవర్తనం ఇప్పుడు మరింత బలపడింది. ఇది ప్రస్తుతం ఉత్తర తెలంగాణ , దాని పరిసర ప్రాంతాలపై సగటు సముద్ర మట్టానికి 3.1 కిలోమీటర్ల నుండి 5.8 కిలోమీటర్ల ఎత్తులో విస్తరించి ఉంది. ఈ ఆవర్తనం ఎత్తుకు వెళ్లేకొద్దీ దక్షిణ వైపునకు వంగి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వివరించింది. దీని ప్రభావంతో తెలంగాణవ్యాప్తంగా ఆకాశం మేఘావృతమై…… పలు జిల్లాల్లో మోస్తరు వర్షాలు కురిసేందుకు అనుకూల వాతావరణం ఏర్పడింది.
మొత్తంగా, ఏపీలో వాతావరణ మార్పులతో అప్రమత్తత అవసరం. ప్రజలు, ముఖ్యంగా రైతులు, పిడుగుల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. అధికార యంత్రాంగం సూచనలను పాటించడం క్షేమం.


