
📌 Key Points
- రాష్ట్రంలో పెరిగిన ఎండలు, వడగాలుల తీవ్రత దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిక.
- ఉత్తర కోస్తాలో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ సూచన.
- విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 అందుబాటులో ఉన్నాయి.
- గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో వడగాలులు తీవ్రంగా ఉంటాయి.
ఆంధ్రప్రదేశ్‌లో ఎండలు తీవ్రంగా ఉన్నాయి. వడగాలుల తీవ్రత పెరిగింది. ఉత్తర కోస్తా ప్రాంతానికి వర్ష సూచన జారీ చేయబడింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉంది.
రాష్ట్రంలో తీవ్రమైన ఎండలు, వడగాలులు
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి. ఉదయం 10 గంటలు దాటితే చాలు… భానుడి భగభగలు మొదలవుతున్నాయి. మధ్యాహ్నం వేళలో బయటికి వెళ్లలేకపోతున్నారు. మార్చి మాసంలోనే ఎండల తీవ్రత ఉండగా… రాబోయే రోజుల్లో ఉష్ణోగ్రతల తీవ్రత అధికంగా ఉండే సూచనలున్నాయి.
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో వేడి, ఉక్కపోత కొనసాగుతుంది. మరో మూడు నాలుగు రోజులు కూడా ఇదే మాదిరి పరిస్థితులు ఉంటాయని అమరావతి వాతావరణ కేంద్రం పేర్కొంది. రాయలసీమలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 3 డిగ్రీలు పెరుగుతాయని అంచనా వేసింది. ఇవాళ దక్షిణ కోస్తాలో శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు, ప్రకాశం, బాపట్ల, గుంటూరు, కృష్ణా జిల్లాల్లో వడగాలులు వీచే అవకాశం ఉంది. శనివారం కర్నూలులో 39.4 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది.
మరోవైపు ఒడిశా పరిసరాల్లో ఉపరితల ఆవర్తన ద్రోణి కొనసాగుతోంది. ఛత్తీస్‌గఢ్, తెలంగాణ మీదుగా కర్ణాటక వరకు వ్యాపించింది. ఈ ద్రోణి ప్రభావంతో ఇవాళ, రేపు ఉత్తర కోస్తాలో అక్కడక్కడ వర్షాలు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మిగతా చోట్ల మాత్రమే వడగాలులు, ఎండల తీవ్రత ఉండే అవకాశం ఉంది.
ఉత్తర కోస్తాకు వర్ష సూచన
ఈ ఏడాది కూడా ఏప్రిల్, మే నెలలతోపాటు మార్చి నుంచే ఎండల తీవ్రత క్రమేపీ పెరగనుంది. దీంతోపాటు వడగాలుల ప్రభావం కూడా అధికంగా ఉంటుందని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ పేర్కొంది.
మార్చి నుంచి మే నెల వరకు చూసుకుంటే శ్రీకాకుళం, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి, అన్నమయ్య, కడప, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు మినహా మిగతా చోట్ల సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు నమోదు కానున్నాయి. అలాగే గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, మార్కాపురం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచే అవకాశం ఉంది.
ప్రజలకు విపత్తుల సంస్థ హెచ్చరిక
ఎండల సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో ఉండే విపత్తుల సంస్థ స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు 112, 1070, 18004250101 సంప్రదించవచ్చు. మరోవైపు ఎండలతో పాటు క్యుములోనింబస్ మేఘాల వలన ఆకస్మికంగా భారీవర్షాలు, పిడుగులు పడే సూచనలు ఉన్నందున్న… అలాంటి సమయంలో చెట్ల క్రింద ఉండకుండా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.
ఎండల తీవ్రత ఎక్కువగా ఉండటంతో…. మధ్యాహ్న సమయంలో బయటికి వెళ్లాలంటే తప్పకుండా గొడుగులు వెంట తీసుకెళ్లాలి. తెలుపు రంగు, పలుచటి కాటన్ వస్త్రాలు ధరించడం, కర్చీఫ్ కట్టుకోవడం , టోపి పెట్టుకోవడం, కళ్ళ రక్షణ కోసం నాణ్యమైన సన్ గ్లాసెస్ ఉపయోగించడం వంటి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకోవాలి. ద్విచక్ర వాహనదారులు తప్పకుండా హెల్మెట్ ధరించాలన్నారు. డీహైడ్రేట్ కాకుండా ఉండటానికి ORS (ఓరల్ రీహైడ్రేషన్ సొల్యూషన్), ఇంట్లో తయారుచేసిన పానీయాలైన లస్సీ, నిమ్మకాయ నీరు, మజ్జిగ, కొబ్బరి నీరు మొదలైనవి తీసుకుోవాలి.
రాష్ట్రంలో వాతావరణ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. ప్రజలు అప్రమత్తంగా ఉండి, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఎప్పటికప్పుడు వాతావరణ శాఖ హెచ్చరికలను గమనించాలి.


