
📌 Key Points
- APSPDCL పరిధిలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటుకు ప్రతిపాదన.
- పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద 13kW లైట్ ఈవీ ఛార్జర్‌లతో స్టేషన్లు ఏర్పాటు.
- క్లీన్ ఎనర్జీలో భాగంగా 2,200MW సౌర సామర్థ్యం లక్ష్యంగా పెట్టుకుంది.
- చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గం నెట్-జీరో మోడల్‌గా అభివృద్ధి.
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ (APSPDCL) రాష్ట్రంలో 162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనుంది. పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద ఈ స్టేషన్లు నెలకొల్పనున్నారు. దీని ద్వారా గ్రీన్ ఎనర్జీకి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది.
162 ఈవీ ఛార్జింగ్ స్టేషన్ల ఏర్పాటు
ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(APSPDCL) తన అధికార పరిధిలోని 162 ప్రదేశాలలో ఈవీ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించింది. 13 kW లైట్ ఈవీ ఏసీ/డీసీ ఛార్జర్‌లతో కూడిన ఛార్జింగ్ స్టేషన్‌లను పీఎం-ఈ డ్రైవ్ పథకం కింద ఏర్పాటు చేయనున్నట్లు ఏపీఎస్‌పీడీసీఎల్ ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివ శంకర్ లోథేటి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం క్లీన్ మొబిలిటీ కోసం చేస్తున్న ప్రయత్నాలకు మద్దతు ఇవ్వడానికి, గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాలను తగ్గించడానికి ఈ ఛార్జింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించారు.
క్లీన్ ఎనర్జీ రోడ్‌మ్యాప్‌లో భాగంగా ఏపీఎస్‌పీడీసీఎల్ PM-KUSUM 2.0 పథకం కింద ఫీడర్-స్థాయి సోలరైజేషన్ కోసం ప్రతిష్టాత్మక లక్ష్యాలను నిర్దేశించింది. 2026–27 నుండి 2029–30 వరకు ఏటా 550 ఎండబ్ల్యూ సౌర సామర్థ్యాన్ని జోడించాలని, మొత్తం 2,200 ఎండబ్ల్యూలను జోడించాలని యోచిస్తోంది. 500 ఎండబ్ల్యూ / 1000 MWh బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్(BESS) మొదటి దశలో అమలులో ఉంది.
క్లీన్ ఎనర్జీ దిశగా APSPDCL
ఇంధన సామర్థ్య కార్యక్రమాలు, భవిష్యత్తు వ్యూహాలను సమీక్షించడానికి ఐఐటీ ఢిల్లీలో ప్రొఫెసర్, బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ మాజీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ అజయ్ మాథుర్‌తో వర్చువల్‌గా సీఎండీ శివశంకర్ ఇంటరాక్షన్ నిర్వహించారు. ఈ సమావేశంలో డైరెక్టర్లు అయూబ్ ఖాన్, గురవయ్యతోపాటు సీనియర్ అధికారులు పాల్గొన్నారు.
చిత్తూరు జిల్లాలోని కుప్పం నియోజకవర్గాన్ని భారతదేశంలోని మొట్టమొదటి నెట్-జీరో మోడల్ నియోజకవర్గంగా అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న చొరవను కూడా సీఎండీ హైలైట్ చేశారు. గ్రీన్ ఎనర్జీని పెద్ద ఎత్తున స్వీకరించడం, స్థిరమైన అభివృద్ధిపై దృష్టి సారించామన్నారు.
నెట్-జీరో మోడల్‌గా కుప్పం నియోజకవర్గం
ఈ కార్యక్రమం కింద 7,489 మంది ఎస్సీ, ఎస్టీ వినియోగదారులకు ప్రయోజనం చేకూర్చే 4.36 మెగావాట్ల సౌర విద్యుత్తు సామర్థ్యాన్ని ఏర్పాటు చేయడం, 48,000 గృహాలను కవర్ చేసే 39.75 మెగావాట్ల రూఫ్‌టాప్ సౌర వ్యవస్థలు, 50 మెగావాట్లు / 100 మెగావాట్ల బీఈఎస్ఎస్ ప్రాజెక్ట్ ఉన్నాయి.
అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను పాటించడానికి, సమర్థవంతమైన విద్యుత్ పంపిణీ సేవలను బలోపేతం చేయడానికి ఏపీఎస్‌పీడీసీఎల్.. బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియెన్సీ (BEE), ఎనర్జీ ఎఫిషియెన్సీ సర్వీసెస్ లిమిటెడ్ (EESL), రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్‌తో కూడా పనిచేస్తోంది.
ఏపీఎస్‌పీడీసీఎల్ తీసుకుంటున్న ఈ చర్యలు రాష్ట్రంలో విద్యుత్ వాహనాల వినియోగాన్ని ప్రోత్సహించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణకు కూడా తోడ్పాటునందిస్తాయి. ఇది రాష్ట్ర అభివృద్ధికి ఒక మైలురాయి కానుంది.


