|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి

Published: 19-04-2026, 8:35 AM
బాణసంచా ఫ్యాక్టరీలో భారీ పేలుడు.. 18 మంది కార్మికులు మృతి

తమిళనాడులోని విరుదునగర్ జిల్లాలో పెను విషాదం చోటుచేసుకుంది. బాణసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించి, దాదాపు 18 మంది కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. మరో 9 మంది కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే.. విరుదునగర్ జిల్లాలోని సాత్తూరు సమీపంలో ఉన్న ఒక బాణసంచా ఫ్యాక్టరీలో కార్మికులు బాణసంచా తయారీలో నిమగ్నమై ఉండగా ఈ ప్రమాదం జరిగింది. రసాయనాలను మిక్స్ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా మంటలు చెలరేగడం వల్ల వరుస పేలుళ్లు సంభవించినట్లు ప్రాథమిక సమాచారం. పేలుడు ధాటికి ఫ్యాక్టరీలోని సుమారు 10కి పైగా గదులు పూర్తిగా ధ్వంసమయ్యాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేసే ప్రయత్నం చేశారు. మరణించిన వారిలో మహిళా కార్మికులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని వెంటనే చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వీరిలో కొందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.

ఈ ఘోర ప్రమాదంపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మరణించిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు, తీవ్రంగా గాయపడిన వారికి ఎక్స్‌గ్రేషియా ప్రకటించారు. అధికారులు ఈ ఘటనపై విచారణకు ఆదేశించారు. బాణసంచా పరిశ్రమకు కేంద్రమైన విరుదునగర్, శివకాశి ప్రాంతాల్లో భద్రతా ప్రమాణాలు పాటించకపోవడం వల్ల ఇలాంటి ప్రమాదాలు తరచూ జరుగుతూనే ఉన్నాయి. నిబంధనలు ఉల్లంఘించే ఫ్యాక్టరీలపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.