
బెల్లంకొండ శ్రీనివాస్ మరియు అనుపమ పరమేశ్వరన్ నటించిన కిష్కింధపురి సినిమా శుక్రవారం విడుదలవుతోంది. ప్రమోషన్ల సందర్భంగా బెల్లంకొండ శ్రీనివాస్ ఓ ఆసక్తికరమైన ఛాలెంజ్ విసిరాడు. సినిమా చూస్తూ ఫోన్ వాడితే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతానని హీరో ప్రకటించాడు.
Key Points
బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాపై తనకున్న నమ్మకాన్ని వ్యక్తం చేశాడు.
సినిమా చూస్తున్నప్పుడు మొబైల్స్ వాడకూడదని ప్రేక్షకులకు ఛాలెంజ్ విసిరాడు.
మూవీ చూస్తూ ఫోన్ వాడితే ఇండస్ట్రీ వదిలి వెళ్లిపోతాడని హీరో ప్రకటించాడు.
కిష్కింధపురి సినిమాతో పాటు, తేజ సజ్జా 'మిరాయ్' సినిమా కూడా అదే రోజు రిలీజ్ అవుతోంది.
బెల్లంకొండ శ్రీనివాస్ ఛాలెంజ్
అనుపమ పరమేశ్వరన్, బెల్లంకొండ శ్రీనివాస్ నటించిన మూవీ కిష్కింధపురి. ఈ సినిమా ఈ శుక్రవారం (సెప్టెంబర్ 12) ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మూవీ ప్రమోషన్లలో టీమ్ బిజీగా ఉంది. ఇందులో భాగంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. అందులో ఒకదాంట్లో అతడు విసిరిన ఓ ఛాలెంజ్ ప్రేక్షకులను ఆకర్షించింది.
కిష్కింధపురి మూవీ ప్రమోషన్లలో భాగంగా తాజాగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ .. Gulte.com కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులోనే అతడు సినిమా గురించి ఎన్నో విషయాలు చెబుతూ.. రెండున్నర గంటలపాటు ప్రేక్షకులు అన్నీ మరచిపోయి మూవీలో లీనమయ్యేలా చేసే సత్తా ఈ కిష్కింధపురికి ఉందని అన్నాడు.
కిష్కింధపురి సినిమా రిలీజ్
మూవీ చూస్తున్నప్పుడు ప్రేక్షకులు తమ మొబైల్స్ పట్టుకోకపోతే చాలు మనం విజయం సాధించినట్లే.. ఈ సినిమా కూడా అలాంటిదే.. మూవీ పది నిమిషాల తర్వాత ఎవరైనా ప్రేక్షకులు తమ మొబైల్ బయటకు తీశారంటే నేను ఇండస్ట్రీ వదలి వెళ్లిపోతా అని శ్రీనివాస్ కామెంట్ చేయడం గమనార్హం. ఈ సినిమాపై అంత నమ్మకం తనకు ఉన్నట్లుగా అతడు చెప్పాడు.
అయితే బెల్లంకొండ శ్రీనివాస్ మాటలను ఆడియెన్స్ అంత సీరియస్ గా తీసుకుంటారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే గతంలో భైరవం రిలీజ్ సందర్భంగానూ అతడు ఇలాంటి కామెంట్సే చేశాడు. ఆ సినిమా క్లైమ్యాక్స్ కాంతార మూవీ క్లైమ్యాక్స్ కంటే కూడా బాగుంటుందని అతడు అన్నాడు. మూవీ రిలీజ్ తర్వాత క్లైమ్యాక్స్ కు ప్రశంసలు దక్కినా.. కాంతారతో పోలిక మాత్రం సరికాదని చాలా మంది భావించారు.
బాక్సాఫీస్ పోటీ
ఇక ఇప్పుడు కిష్కింధపురి మూవీపై కూడా బెల్లంకొండ భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ మూవీ కోసం టీమ్ అంతా చాలా కష్టపడిందని చెప్పాడు. ఈ ఇంటర్వ్యూలో భాగంగా సినిమాలో తాము వాడిన వస్తువులను కూడా చూపించాడు. తనకు హారర్ సినిమాలు బాగా నచ్చుతాయని, ఈ కిష్కింధపురి కూడా స్టోరీ, బీజీఎంతో అలాంటి ఫీలింగ్ ను ప్రేక్షకులకు ఇస్తాయని అతడు స్పష్టం చేశాడు.
కిష్కింధపురి మూవీని కౌశిక్ పెగళ్లపాటి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర గట్టి పోటీయే ఎదురు కానుంది. ఎందుకంటే అదే రోజు తేజ సజ్జా మరో సూపర్ హీరో మూవీ మిరాయ్ కూడా రిలీజ్ కాబోతోంది. ఈ రెండు సినిమాల మధ్య బాక్సాఫీస్ వార్ ఆసక్తి రేపుతోంది. ఇద్దరూ పెద్ద హీరోలు కాకపోయినా.. గతంలో సాధించిన సక్సెస్, ఈ సినిమాలపై ఉన్న హైప్ నేపథ్యంలో ఎవరు పైచేయి సాధిస్తారన్నది ఆసక్తిగా మారింది.
బెల్లంకొండ శ్రీనివాస్ కిష్కింధపురి సినిమాపై చూపిన నమ్మకం, అతని ఛాలెంజ్ ప్రేక్షకుల ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయాన్ని సాధిస్తుందో చూడాలి.


