
📌 Key Points
- షో రద్దు సమాచారం ఇవ్వనందుకు బుక్ మై షోకు భారీ జరిమానా విధించిన కోర్టు.
- బాధితుడికి రూ.10 వేల నష్టపరిహారం, కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లింపు.
- కొత్త సంవత్సరం రోజున కుటుంబంతో సినిమా ప్లాన్ బెడిసికొట్టడంతో వినియోగదారుడికి తీవ్ర మనస్తాపం.
- కమిషన్ బుక్ మై షో వాదనలను తోసిపుచ్చి థియేటర్, ప్లాట్‌ఫామ్ బాధ్యతను స్పష్టం చేసింది.
సినిమా ప్రియులకు షాకింగ్ న్యూస్! బుక్ మై షోకు కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఒక వినియోగదారుడికి అన్యాయం చేసినందుకు భారీ జరిమానా విధించబడింది. అసలు ఏం జరిగిందో, ఎందుకు ఈ తీర్పు వచ్చిందో తెలుసుకోవాలంటే ఈ వార్తను పూర్తిగా చదవండి!
న్యూ ఇయర్ ప్లాన్ అడ్డంకులు.. అసలేం జరిగింది?
ఆన్‌లైన్‌లో సినిమా టికెట్లు బుక్ చేసుకున్న కస్టమర్లకు.. షో రద్దయిన సమాచారాన్ని ముందుగా చెప్పకుండా ఇబ్బందులకు గురిచేసిన ప్రముఖ ఆన్‌లైన్ టికెట్ బుకింగ్ ప్లాట్‌ఫామ్ బుక్ మై షో కు కోర్టులో గట్టి చుక్కెదురైంది. కస్టమర్లకు కనీస సమాచారం ఇవ్వకుండా, వారి సమయాన్ని వృథా చేస్తూ మానసిక వేదనకు గురిచేసినందుకు గాను బుక్ మై షో లైవ్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థకు హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్ భారీ జరిమానా విధించింది. బాధితుడికి రూ.10 వేల నష్టపరిహారంతో పాటు, కోర్టు ఖర్చుల కింద మరో రూ.2 వేలు చెల్లించాలని తీర్పు వెలువరించింది.
కూకట్‌పల్లికి చెందిన నారాయణన్ కుట్టిగోపాల కృష్ణన్ అనే వ్యక్తి.. 2025 జనవరి 1న కొత్త సంవత్సరం రోజున కుటుంబంతో కలిసి సినిమా చూడాలని ప్లాన్ చేసుకున్నారు. అందుకోసం కూకట్‌పల్లి పరిధిలోని లులు మాల్‌లో ఉన్న సినీపోలిస్ థియేటర్‌లో ఉదయం 10:50 గంటల షోకు బారోజ్ అనే సినిమా టికెట్‌ను బుక్ మై షో యాప్ ద్వారా కొనుగోలు చేశారు. ఎంతో ఉత్సాహంగా ఆయన థియేటర్‌కు వెళ్లేసరికి, అక్కడ సీన్ రివర్స్ అయింది. తాను బుక్ చేసుకున్న బారోజ్ సినిమా షో రద్దయిందని, ఆ స్థానంలో వేరే సినిమా నడుస్తోందని తెలిసి అవాక్కయ్యారు. కనీసం షో రద్దయినట్లు బుక్ మై షో యాప్ నుంచి గానీ, థియేటర్ యాజమాన్యం నుంచి గానీ తనకు ఎలాంటి ముందస్తు సమాచారం రాలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త సంవత్సరం రోజున తన సమయాన్ని వృథా చేయడంతో పాటు, తీవ్ర మానసిక వేదనకు గురిచేశారని పేర్కొంటూ బాధితుడు నేరుగా వినియోగదారుల కమిషన్‌ను ఆశ్రయించారు.
బుక్ మై షో వాదనలు.. కోర్టు తీర్పు!
ఈ కేసు విచారణ సందర్భంగా బుక్ మై షో సంస్థ కోర్టులో తన వాదనలు వినిపిస్తూ.. తప్పంతా థియేటర్ యాజమాన్యానిదే అన్నట్లుగా కుంటిసాకులు చెప్పే ప్రయత్నం చేసింది. తాము కేవలం వినియోగదారుడికి, థియేటర్‌కు మధ్య ఒక ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌గా మాత్రమే ఉంటామని తెలిపింది. షోలు నడపడం, టైమింగ్స్ మార్చడం, రద్దు చేయడం వంటివన్నీ థియేటర్ యాజమాన్యం చేతుల్లోనే ఉంటాయని పేర్కొంది. అంతేకాకుండా, కస్టమర్ ఫిర్యాదు చేసిన మరుసటి రోజే ఆయన కొనుగోలు చేసిన టికెట్ ధర రూ.207.14 మొత్తాన్ని పూర్తిగా వారి ఖాతాలో రీఫండ్ చేశామని కోర్టుకు వివరించింది.
వినియోగదారుడికి న్యాయం.. ప్లాట్‌ఫామ్‌కు బుద్ధి!
ఇరుపక్షాల వాదనలు విన్న హైదరాబాద్ జిల్లా వినియోగదారుల కమిషన్.. బుక్ మై షో వాదనలను తోసిపుచ్చింది. టికెట్ బుక్ చేసుకున్న తర్వాత ఒకవేళ అనివార్య కారణాల వల్ల షో రద్దయితే, ఆ సమాచారాన్ని కస్టమర్‌కు చేరవేయాల్సిన కనీస బాధ్యత బుక్ మై షో ప్లాట్‌ఫామ్‌పైనే ఉంటుందని స్పష్టం చేసింది. ముందే సమాచారం ఇవ్వకుండా కస్టమర్‌ను థియేటర్ వరకు వచ్చేలా చేయడం ముమ్మాటికీ బుక్ మై షో వైపు ఉన్న సేవాలోపమేనని కమిషన్ తీవ్రంగా తప్పుపట్టింది. తాము మధ్యవర్తులం మాత్రమే అని చెప్పి తప్పించుకోలేరని తేల్చిచెప్పింది. కేవలం టికెట్ డబ్బులు వెనక్కి ఇచ్చినంత మాత్రాన సరిపోదని, వినియోగదారుడి సమయాన్ని వృథా చేసి అతనికి కలిగించిన మానసిక వేదనకు సంస్థ కచ్చితంగా బాధ్యత వహించాల్సిందేనని పేర్కొంటూ బుక్ మై షోకు జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించింది.
ఈ తీర్పు వినియోగదారులకు భరోసా నిచ్చింది. బుక్ మై షో వంటి ప్లాట్‌ఫామ్‌లు తమ బాధ్యతలను సీరియస్‌గా తీసుకోవాలి. సినిమా ప్రపంచంలో ఇలాంటి సంచలన అప్‌డేట్స్ కోసం వేచి ఉండండి!

