
ప్రముఖ తమిళ నటుడు విజయ్ సేతుపతిపై తీవ్ర ఆరోపణలు వచ్చాయి. క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలను ఆయన ఖండించారు. ఓ మహిళ చేసిన ఆరోపణల తర్వాత ఆయన టీమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Key Points
తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతిపై క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలు.
ఓ అమ్మాయి చేసిన ఆరోపణలను విజయ్ ఖండించారు.
ఆ అమ్మాయి పోస్ట్ డిలీట్ చేయడంతో వివాదం.
విజయ్ సేతుపతి టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
విజయ్ సేతుపతి ఆరోపణలను ఖండించారు
తనపై వచ్చిన క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలపై తమిళ స్టార్ హీరో విజయ్ సేతుపతి రియాక్టయ్యాడు. విజయ్ సేతుపతి తన స్నేహితురాలిని వాడుకున్నాడంటూ ఓ అమ్మాయి ఎక్స్ లో పోస్టు పెట్టడం వైరల్ గా మారింది. వెంటనే పోస్టు డిలీట్ చేసిన అది చర్చనీయాంశంగా మారింది. దీనిపై విజయ్ సేతుపతి స్పందించాడు. ఆ ఆరోపణలను ఖండించాడు.
డెక్కన్ క్రానికల్ నుంచి సుభాష్ కె ఝాతో మాట్లాడుతూ విజయ్ సేతుపతి ఈ ఆరోపణలను ఖండించాడు. “నా గురించి కొంచెం తెలిసినవాళ్లు ఎవరైనా దీనిని చూసి నవ్వుతారు. నాకు నేను తెలుసు. ఇలాంటి అసభ్యకరమైన ఆరోపణలు నన్ను కలవరపెట్టలేవు. నా కుటుంబం, సన్నిహిత స్నేహితులు బాధపడుతున్నారు. కానీ నేను వారికి ‘దీన్ని వదిలేయండి. ఈ మహిళ కావాలని ఇలా చేస్తోంది. ఆమెకు కొన్ని నిమిషాల ఫేమ్ కావాలి, ఆనందించనివ్వండి’ అని చెప్పా” అని విజయ్ తెలిపాడు.
క్యాస్టింగ్ కౌచ్ ఆరోపణలను చాలా కాలంగా వింటున్నానని, ఇలాంటివి తననేం చేయలేవని విజయ్ సేతుపతి అన్నారు. ఈ ఆరోపణలపై తన టీమ్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసిందని తెలిపాడు. “మేము సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేసాము. నేను ఏడేళ్లుగా అన్ని రకాల గుసగుసలను ఎదుర్కొన్నాను. ఇలా టార్గెట్ చేసుకోవడం నాపై ఇప్పటికీ ఎలాంటి ప్రభావం చూపలేదు. ఇలాంటిది ఎప్పటికీ నన్నేం చేయలేదు’’ అని విజయ్ సేతుపతి పేర్కొన్నాడు.
సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు
రమ్య మోహన్ అనే మహిళ తన ఎక్స్ ఖాతాలో విజయ్ సేతుపతిపై ఆరోపణలు చేసింది. తన స్నేహితురాలిని వాడుకున్నాడని పోస్టు చేసింది. కానీ ఆ తర్వాత ఆ అమ్మాయి ప్రైవసీ కోసమని పోస్టు తొలగించింది. ఇది సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారింది.
“విజయ్ సేతుపతి ‘క్యారవాన్ ఫేవర్స్’ కోసం రూ. 2 లక్షలు, ‘డ్రైవ్స్’ కోసం రూ. 50 వేలు ఆఫర్ చేశాడు. సోషల్ మీడియాలో సాధువులా నటిస్తున్నాడు” అని ఆ పోస్టులో పేర్కొంది.
సోషల్ మీడియాలో వైరల్ గా మారిన పోస్ట్
“కొంతమంది సున్నితత్వం లేని వ్యక్తులు మూలాన్ని ప్రశ్నించడం లేదా బాధితురాలిని నిందించడంపై దృష్టి పెట్టడం కంటే నిజం తెలుసుకోవడంపై దృష్టి పెట్టకపోవడం చాలా దారుణం. ఇది ఆమె జీవితం, ఆమె బాధ” అని పోస్టు చేసింది.
విజయ్ సేతుపతి జాతీయ అవార్డు గెలుచుకున్న నటుడు. అతను ప్రధానంగా తమిళ చిత్రాలలో నటిస్తాడు. షారుఖ్ ఖాన్ నటించిన జవాన్, కత్రినా కైఫ్ నటించిన మెర్రీ క్రిస్మస్ చిత్రాలతో బాలీవుడ్ లోనూ సత్తాచాటాడు. తెలుగులోనూ సినిమాలు చేశాడు. రీసెంట్ గా నీత్యా మీనన్ తో కలిసి తలైవన్ తలైవి సినిమా చేశాడు.
విజయ్ సేతుపతి ఈ ఆరోపణలను తీవ్రంగా ఖండించి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడం విషయంపై స్పష్టతను తెచ్చింది. ఈ ఘటన సినీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచింది.


