
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి ప్రెస్ రిలీజ్ ద్వారా కౌంటర్ ఇచ్చారు. సినిమా టికెట్ ధరలు పెరగడం గురించి రెండు వైపులా వాదనలు వినిపిస్తున్నాయి.
Key Points
బాలకృష్ణ అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలకు చిరంజీవి స్పందన.
చిరంజీవి తన వల్లే 'వీరసింహారెడ్డి' టికెట్ ధరలు పెరిగాయని బాలకృష్ణకు గుర్తు చేశారు.
చిరంజీవి ప్రభుత్వంతో టికెట్ ధరల పెంపు గురించి మాట్లాడటం గురించి వివరణ ఇచ్చారు.
ఈ వివాదం తెలుగు సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.
అసెంబ్లీలో బాలకృష్ణ వ్యాఖ్యలు
బాలకృష్ణ ఏపీ అసెంబ్లీలో చేసిన కామెంట్స్ కు చిరంజీవి కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏపీలో జగన్ ప్రభుత్వం ఉన్నప్పుడు సినీ పెద్దలు ఆయనను కలవడానికి వెళ్లడం, అప్పుడు తనను పిలవలేదని బాలకృష్ట అనడం, అంతేకాదు చిరంజీవి గట్టిగా అడిగితేనే జగన్ దిగివచ్చాడన్న దాంట్లో నిజం లేదని కూడా అనడంపై చిరు స్పందించాడు. తన వల్లే బాలకృష్ణ వీరసింహా రెడ్డి సినిమాకు కూడా టికెట్ల ధరలు పెరిగిన విషయాన్ని గుర్తు చేశాడు.
చిరంజీవి ప్రస్తుతం ఇండియాలో లేడు. దీంతో తాను ఇలా ఓ ప్రెస్ రిలీజ్ చేస్తున్నట్లు చెప్పాడు. అందులో చిరంజీవి చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. “సెప్టెంబర్ 25న జరిగిన ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశంలో బాలకృష్ణ స్పందిస్తూ మాట్లాడిన మాటల్లో నా పేరు ప్రస్తావనకు రావడం జరిగింది. ఆయన ఒకింత వ్యంగ్యంగా చెప్పడాన్ని నేను టీవీ ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూశాను. ఈ అంశంలో నా పేరు ప్రస్తావనకు వచ్చింది కనుక నేను ప్రజలకు వివరణ ఇవ్వదలిచాను.
రాజమౌళి, ఎన్టీఆర్‌లాంటి వాళ్లు అడిగారు
రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు తెలుగు సినీ పరిశ్రమకు చెందిన కొందరు నిర్మాతలు, దర్శకులు, ఫిలిం ఛాంబర్ ప్రతినిధులు నా వద్దకు వచ్చి సినీ నిర్మాణ వ్యయం పెరుగుతున్న దృష్ట్యా సినిమా టికెట్ల ధరల పెంపుదల గురించి రాష్ట్ర ప్రభుత్వంతో మాట్లాడితే బాగుంటుందని, అందుకు నన్ను చొరవ తీసుకోవాలని కోరారు. అప్పుడు నన్ను కలిసిన వారిలో రాజమౌళి, కొరటాల శివ, త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్, ఎన్టీ రామారావు, డివివి దానయ్య, మైత్రి మూవీస్ వారు, ఇంకా ఇద్దరు, ముగ్గురు ప్రముఖులు ఉన్నారు.
చిరంజీవి ప్రెస్ రిలీజ్
జగన్ సాదరంగా ఆహ్వానించారు
వారి సూచనల మేరకు నేను అప్పటి రాష్ట్ర సినీమాటోగ్రఫీ మంత్రి పేర్ని నానితో ఫోన్ లో మాట్లాడాను. టికెట్ల ధరల విషయం మంత్రితో మాట్లాడి చెబుతానని ఆయన నాతో చెప్పారు. ఆ తర్వాత ఓ రోజు మంత్రి నాకు ఫోన్ చేసి.. ముఖ్యమంత్రి ముందు మీతో కలుస్తానని చెప్పారు. లంచ్ కి రావాలని చెప్పారంటూ డేట్ ఇచ్చారు. ఆయన ఆహ్వానం మేరకు నేను జగన్ నివాసానికి వెళ్లాను. నన్ను వారు సాదరంగా ఆహ్వానించారు. లంచ్ చేస్తున్న సమయంలోనే నేను సినీ పరిశ్రమ ఇబ్బందుల్ని వారికి వివరించాను. ఇండస్ట్రీకి మీకు మధ్య గ్యాప్ ఉందని అందరూ అనుకుంటున్నారని, సమయం ఇస్తే అందరం కలిసి వస్తామని ఆయనకు తెలిపాను.
బాలకృష్ణ అందుబాటులోకి రాలేదు
సినిమా టికెట్ల ధరల వివాదం
కొన్ని రోజుల తర్వాత మంత్రి పేర్నినాని నాకు ఫోన్ చేసి కొవిడ్ రెండో దశ కొనసాగుతున్నందున, ఐదుగురు మాత్రమే వస్తే బాగుంటుంది అని చెప్పారు. నేనప్పుడు ఓ పదిమందిమి వస్తామని చెబితే సరేనని అన్నారు. అప్పుడు నేను బాలకృష్ణని ఫోన్ ద్వారా సంప్రదించడానికి ప్రయత్నించాను. ఆయన అందుబాటులోకి రాలేదు. జెమిని కిరణ్ ని వెళ్లి బాలకృష్ణని కలవమని చెప్పాను. ఆయన మూడుసార్లు ప్రయత్నించినా బాలకృష్ణని కలవలేకపోయారు. దాంతో కొంతమందిమి వెళ్లి ముఖ్యమంత్రిని కలిసాము.
సినీ పరిశ్రమకు ప్రభుత్వ సహకారం అందించాలని కోరాను. అందుకు అక్కడున్న వారందరూ సాక్ష్యమే. నేను ఆ రకమైన చొరవ తీసుకోవడం వల్లనే అప్పుడు ప్రభుత్వం సినిమా టికెట్ల ధరల పెంపుదలకు అంగీకరించింది. ఆ నిర్ణయం వల్ల మీ వీరసింహా రెడ్డి సినిమాకైనా, నా వాల్తేరు వీరయ్య సినిమాకైనా టికెట్ రేట్స్ పెంచడానికి కారణమైంది.
తద్వారా ఇటు నిర్మాతలకు, అటు డిస్ట్రిబ్యూటర్లకు, ఎగ్జిబిటర్లకు లాభం చేకూరింది. నేను రాష్ట్ర ముఖ్యమంత్రితోనైనా, సామాన్యుడితోనైనా నా సహజ సిద్ధమైన ధోరణిలోనే గౌరవం ఇచ్చిపుచ్చుకునే విధానంలోనే మాట్లాడుతాను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను కనుక పత్రికా ప్రకటన ద్వారా జరిగిన వాస్తవాన్ని అందరికీ తెలియచేస్తున్నాను” అని చిరంజీవి సుదీర్ఘ వివరణ ఇచ్చాడు.
చిరంజీవి తన వివరణలో, ప్రభుత్వంతో సహకరించిన విషయాన్ని తెలియజేశారు. ఈ వివాదం తెలుగు సినీ రాజకీయాల్లో కొత్త చర్చను రేకెత్తించింది.


