|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

జిల్లాలకు రింగు రోడ్లు, ప్రభుత్వానికి ఈవీల కొనుగోలు: సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు!

Published: 11-03-2026, 8:35 PM
జిల్లాలకు రింగు రోడ్లు, ప్రభుత్వానికి ఈవీల కొనుగోలు: సీఎం రేవంత్ సంచలన నిర్ణయాలు!
  • జిల్లాల్లో రింగు రోడ్ల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం
  • ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని ప్రభుత్వ శాఖలకు ఆదేశాలు
  • రవాణా శాఖ కార్యకలాపాలన్నీ ఆన్‌లైన్‌లోనే జరగాలని సూచన
  • ఆర్టీవో కార్యాలయాలకు సొంత భవనాలు ఏర్పాటు చేయాలని ఆదేశం

తెలంగాణలోని జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అంతేకాకుండా ప్రభుత్వ శాఖలన్నీ ఎలక్ట్రిక్ వాహనాలనే కొనాలని, రవాణా శాఖలో అన్ని కార్యకలాపాలు ఆన్‌లైన్‌లోనే జరగాలని ఆయన సూచించారు.

జిల్లా కేంద్రాలకు రింగు రోడ్లు

తెలంగాణలోని ప్ర‌ధాన జిల్లా కేంద్రాలన్నింటి చుట్టూ రింగు రోడ్లు నిర్మించేందుకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్య‌మంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రాల్లోకి భారీ వాహ‌నాలు వెళ్ల‌కుండా నియంత్రించడంతో పాటు స‌ర‌కు ర‌వాణా వాహ‌నాలు వేగంగా వెళ్లేందుకు రింగు రోడ్లు ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌ని చెప్పారు.

రోడ్లు – భవనాల శాఖ పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం సమీక్షించారు. ఈ సమావేశంలో సంబంధిత శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డితో పాటు ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఇప్ప‌టికే ఆయా జిల్లా కేంద్రాల‌కు స‌మీపంలో రోడ్లు ఉంటే వాటిని అనుసంధానించి రింగ్ రోడ్లు ఏర్పాటు చేయాల‌ని చెప్పారు.

జాతీయ ర‌హ‌దారుల‌కు రింగు రోడ్ల‌ను అనుసంధానించే అంశంపై అధ్య‌య‌నం చేయాల‌ని అధికారులను ఆదేశించారు. హైద‌రాబాద్‌ – విజ‌య‌వాడ ఎక్స్‌ప్రెస్ వే నుంచి నాగార్జునసాగ‌ర్ చేరేందుకు గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణంపై అధ్య‌య‌నం చేయాల‌ని చెప్పారు.

ప్రభుత్వ శాఖల్లో ఈవీల కొనుగోలు

ఇప్ప‌టికే నిర్మాణంలో ఉన్న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలు త్వ‌ర‌గా పూర్తి చేయాల‌ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అవ‌స‌ర‌మైన నూత‌న ఆర్వోబీలు, ఆర్‌యూబీల నిర్మాణాలకు ప్ర‌తిపాద‌న‌లు సిద్ధం చేయాల‌ని సూచించారు. బోధ‌నాసుప‌త్రులు, ఇత‌ర పెద్దాసుప‌త్రుల నిర్మాణ‌ల‌ను త్వ‌రగా పూర్తి చేయాల‌ని దిశానిర్దేశం చేశారు.

ప్రభుత్వ శాఖలు ఇకనుంచి తప్పనిసరిగా ఎలక్ట్రిక్ వాహనాలను (EV) మాత్రమే కొనుగోలు చేయాలని సీఎం రేవంత్ అధికారులను ఆదేశించారు. కాలుష్య రహిత రవాణా వ్యవస్థ లక్ష్యంగా పని చేయాలని చెప్పారు.

కోర్ అర్బన్ ఏరియా పరిధిలోని ప్ర‌భుత్వ శాఖ‌లు అద్దెకు తీసుకునే వాహ‌నాలు సైతం ఈవీలే ఉండాల‌ని తెలిపారు. ర‌వాణా శాఖ‌లోని మాన్యువ‌ల్ విధానాలకు స్వ‌స్తి చెప్పాల‌ని, మొత్తం ఆన్‌లైన్‌లోనే కార్య‌క‌లాపాలు కొన‌సాగించాల‌ని ఆదేశించారు.

రవాణా శాఖలో ఆన్‌లైన్ సేవలు

బుధవారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రవాణా శాఖలోని పలు అంశాలపై ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఆర్‌టీవో కార్యాల‌యాలు అద్దె భ‌వ‌నాల్లో కొన‌సాగడానికి వీల్లేద‌ని…. వెంట‌నే సొంత‌ భ‌వ‌నాల నిర్మాణాలకు ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ఆదేశించారు.

రోడ్డు ప్ర‌మాదాల‌పై అవ‌గాహ‌న పెంచాల‌ని, ప్రజల్లో చైతన్యం తేవడానికి షార్ట్ ఫిల్మ్‌లు ప్ర‌ద‌ర్శించాల‌ని సూచించారు. శంషాబాద్ స‌మీపంలో హైస్పీడ్ రైలు కారిడార్ ప్రారంభ‌మ‌య్యే ప్రాంతంలో అధునాత‌న బస్ టెర్మినల్‌కు స్థ‌లం కేటాయిస్తామ‌ని…. అందుకు త‌గిన ప్ర‌ణాళిక‌లు సిద్ధం చేయాల‌ని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు.

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయాలు తెలంగాణ రాష్ట్రంలో మౌలిక సదుపాయాల అభివృద్ధికి, పర్యావరణ పరిరక్షణకు దోహదం చేస్తాయని చెప్పవచ్చు. ప్రజలకు మరింత మెరుగైన సేవలు అందించడమే ప్రభుత్వ ధ్యేయం అని ఆయన స్పష్టం చేశారు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.