|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

దీపిక తొలగింపు.. పరేష్‌ రావల్‌ కంపు… ఈ బాలీవుడ్‌కేమైంది?

Published: 29-05-2025, 8:14 AM
దీపిక తొలగింపు.. పరేష్‌ రావల్‌ కంపు... ఈ బాలీవుడ్‌కేమైంది?

బాలీవుడ్‌లో తాజాగా జరిగిన రెండు సంఘటనలు పరిశ్రమలో సంచలనం సృష్టించాయి. ‘హేరా ఫేరి 3’ నుండి పరేష్ రావల్ తప్పుకోవడం, ‘స్పిరిట్’ చిత్రం నుండి దీపిక పదుకొనే తొలగింపు బాలీవుడ్‌కు ఏమి సూచిస్తున్నాయో చూద్దాం.

Key Points

1

పరేష్ రావల్ 'హేరా ఫేరి 3' నుంచి తప్పుకున్నారు.

2

దీపిక పదుకొనే 'స్పిరిట్' చిత్రం నుంచి తొలగించబడ్డారు.

4

పారితోషికం, డిమాండ్లు ప్రధాన కారణాలుగా కనిపిస్తున్నాయి.

‘హేరా ఫేరి 3’ నుంచి పరేష్ రావల్ తప్పుకోవడం

బాలీవుడ్‌ అంటే దేశంలోని అన్ని వుడ్‌లకూ గాడ్‌ లాంటిది అనలేకపోయినా కనీసం పెద్దన్న లాంటిది అనొచ్చేమో… దేశవ్యాప్తంగా నటీనటులందరిపైనా, అన్ని భాషా చిత్ర పరిశ్రమలపైనా ప్రత్యక్షంగానో, పరోక్షంగానో బాలీవుడ్‌ ప్రభావం ఉంటుంది. అలాంటి బాలీవుడ్‌కి అకస్మాత్తుగా ఏమైంది? గత కొంత కాలంగా హిందీ చిత్ర పరిశ్రమ విజయాలు తక్కువ వివాదాలెక్కువ అన్నట్టుగా తయారైంది. ఒకప్పుడు నటీనటుల వివాహేతర సంబంధాలు, తెరవెనుక అలవాట్లు…వంటివి మాత్రమే ఎక్కువగా చర్చనీయాంశమయ్యేవి. అవన్నీ వ్యక్తిగతం అంటూ బాలీవుడ్‌ పెద్దలు సమర్ధించుకునేవారు. కానీ ఇప్పుడు వస్తున్న వివాదాలు వ్యక్తిగతమైనవి కావు…వ్యవస్థాగతమైనవే. అవి కూడా చిన్నా చితకా స్టార్స్‌కు సంబంధించినవి కావు.. బాలీవుడ్‌ని ఓ రకంగా ఏలుతున్న నటీనటులకు సంబంధించినవి కావడం గమనార్హం.

బాలీవుడ్‌లో వినోదాత్మక చిత్రాభిమానులను అలరిస్తుందనే భారీ అంచనాల మధ్య రూపొందుతున్న చిత్ర ‘హేరా ఫేరి 3‘(Hera Pheri 3) . ఈ సినిమాలో బాలీవుడ్‌ అగ్ర  కధానాయకుడు అక్షయ్‌ కుమార్‌ నటిస్తున్నాడు. అలాంటి సినిమా నుంచి అనూహ్యంగా మరో ప్రముఖ నటుడు  పరేష్‌ రావల్‌ (శంకర్‌ దాదా ఎంబిబిఎస్‌ ఫేం) తప్పుకోవడం బాలీవుడ్‌ పరిశ్రమను, ప్రేక్షకుల్ని తీవ్ర ఆశ్చర్యానికి గురి చేసింది.  పరేష్‌ రావల్‌(Paresh Rawal) ఆకస్మిక నిర్ణయం తర్వాత, సహనటుడు అక్షయ్‌ కుమార్‌ తో పాటు ఆ సినిమా నిర్మాతలు పరేష్‌ రావల్‌పై చట్టపరమైన చర్యలు ప్రారంభించారు. దాంతో పరేష్‌ రావల్‌ తన సంతకం చేసి ముందస్తుగా స్వీకరించిన  రూ.11 లక్షలను 15% వడ్డీతో తిరిగి చెల్లించాల్సి వచ్చింది. అతని మొత్తం పారితోషికం రూ.15 కోట్లు అని సమాచారం.

‘స్పిరిట్’ చిత్రం నుంచి దీపిక పదుకొనే తొలగింపు

మరోవైపు బాలీవుడ్‌ టాప్‌ హీరోయిన్‌ దీపికా పదుకొనే(Deepika Padukone ), ప్రభాస్‌తో కలిసి నటించాల్సిన ‘స్పిరిట్‌‘(Spirit) చిత్రం నుంచి అకస్మాత్తుగా తప్పుకున్నారు. అత్యధిక రెమ్యునరేషన్‌ డిమాండ్‌ కి తలొగ్గినా కూడా దీపిక ఒకదాని తర్వాత ఒకటిగా రకరకాల డిమాండ్లు పెడుతుండడంతో విసుగు చెందిన స్పిరిట్‌ దర్శకుడు సందీప్‌రెడ్డి వంగా ఆమెను తన ప్రాజెక్ట్‌ నుంచి తప్పించారు. అయితే ఈ నిర్ణయం తర్వాత కూడా వీరిద్దరి మధ్యా మాటల తూటాలు పేలుతున్నాయి.  దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా సోషల్‌ మీడియాలో డర్టీ పీఆర్‌ గేమ్స్‌ అంటూ దీపికాపై పరోక్ష విమర్శలు చేశారు. దీనికి ప్రతిగా  తనకు అనుకూలమైన వాతావరణం ఉన్నచోట మాత్రమే తాను పనిచేయాలనుకుంటున్నట్లు దీపిక వ్యాఖ్యానించారు. మొత్తం మీద బాలీవుడ్‌లో వరుసగా చోటు చేసుకున్న ఈ రెండు సంఘటనలూ…బాలీవుడ్‌ ప్రతిష్టను మసకబార్చేలా ఉన్నాయని సినీ  పండితులు వ్యాఖ్యానిస్తున్నారు.

బాలీవుడ్‌లో పెరుగుతున్న వివాదాలు

అయితే సినిమాల నుంచి నటీనటులు మధ్యలో తప్పుకోవడం ఇదే మొదటి సారి కాదని గతంలోనూ పలు మార్లు ఇలాంటివి జరిగాయని పలువురు గుర్తు చేస్తున్నారు.గత 2013లో’రేస్‌ 2’ చిత్రం షూటింగ్‌ ప్రారంభమైన తర్వాత, దీపికా పదుకునే అకస్మాత్తుగా ప్రాజెక్ట్‌ను వదిలివేశారు. దీంతో నిర్మాత రమేష్‌ తౌరానీ  దీపిక   అనుచితంగా వ్యవహరించారని ఆరోపించారు. ఈ వివాదం బాలీవుడ్‌లో పెద్ద చర్చకు దారి తీసింది. అలాగే గత 2018లో  సల్మాన్‌ ఖాన్   తో కలిసి ’భారత్‌’ చిత్రంలో నటించాల్సి ఉన్న  ప్రియాంక చోప్రా  షూటింగ్‌ ప్రారంభానికి కొద్ది రోజుల ముందు ప్రాజెక్ట్‌ను వదిలివేశారు. దీంతో సల్మాన్‌ ఖాన్, ఆమెపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత, కత్రినా కైఫ్‌ ఈ పాత్రను స్వీకరించారు. అలాగే ఇంకా ముందుకు వెళితే..2000లో కహో నా ప్యార్‌ హై సినిమా నుంచి కరీనాకపూర్‌ , 2003లో చల్తే చల్తే చిత్రం నుంచి సల్మాన్‌ఖాన్‌ గందరగోళం  కారణంగా ఐశ్వర్యరాయ్‌ లు తప్పుకున్నారు. గత 2015లో ఊపిరి సినిమాలో  నటించాల్సి ఉన్న శృతిహాసన్‌ మధ్యలో వదిలేయడంతో చిత్ర నిర్మాతలు ఆమెపై కోర్టుకెక్కారు. అయితే ఈ ఘటనలన్నీ కూడా సంవత్సరాల వ్యవధిలో జరుగగా… ఇప్పుడు వరుసగా బాలీవుడ్‌లో జరుగుతుండడమే చర్చనీయాంశంగా మారింది.

బాలీవుడ్‌లో ప్రముఖ నటులు, నటీమణుల తొలగింపులు, వివాదాలు పరిశ్రమలో సంక్షోభాన్ని సూచిస్తున్నాయి. పారితోషికాలు, డిమాండ్లతో సంబంధిత వివాదాలు భవిష్యత్తులో మరిన్ని సమస్యలను తెచ్చిపెట్టే అవకాశం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.