|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

షాకింగ్! తెలుగు పాటల్లో డబుల్ మీనింగ్ దందా నడుస్తుందా?

Published: 10-01-2026, 7:00 AM
  • పాటల్లో ద్వందార్థ పదాల వినియోగంపై తీవ్ర విమర్శలు!
  • యువతరం ట్రెండ్ పేరుతో దిగజారుడు పదాలను ప్రోత్సహిస్తోందా?
  • రచయితలు, సంగీత దర్శకులు బాధ్యతగా మెలగాలని సూచన!
  • కుటుంబంతో కలిసి వినే పాటలు కరువయ్యే పరిస్థితి!

తెలుగు సినిమా పాటల గురించి ఒక సంచలన వార్త! పాటల్లో ద్వందార్థ పదాలు ఎక్కువైపోయాయని విమర్శలు వస్తున్నాయి. దీనిపై ప్రజలు ఏమనుకుంటున్నారో చూద్దాం. అసలు ఈ పాటలు మన సంస్కృతిని దిగజారుస్తున్నాయా?

పాటల్లో శృతి మించుతున్న ద్వందార్థాలు!

ఇ టీవల మన తెలుగు సినిమా పాటలు వినేప్పుడు ఒక ప్రశ్న సహజంగా తలెత్తుతోంది. ఈ పదాలు నిజంగా మనకు నచ్చుతున్నాయా? లేదా అలవాటైపోయాయా? లేదూ అలవాటు అయ్యాయని నచ్చేలా చేసుకుంటున్నామా!? లేక నచ్చినట్టు వినపడుతున్నందువలన అలవాటుగా వినేస్తున్నామా!? ద్వందార్థ పదాల వినియోగం సినిమా పాటల్లో కొత్త కాకపోయినా ఇప్పుడు మాత్రం చాలా సహజంగా , సాధారణంగా రొటీన్ రోతగా మారిపోయింది. పాట పదే పదే వినిపించాలంటే, రీల్స్‌లో తిరగాలంటే పదం కొంచెం దిగజారాల్సిందే అన్న భావన ఒక రూల్‌లా స్థిరపడుతున్నట్టుంది.

ద్వందార్థం తప్పు కాకపోవచ్చు, కానీ అది ఎలా వాడుతున్నాము!? ఎందరి మధ్యలో ప్రయోగిస్తున్నాము!? వయోభేదం లేకుండా వినే పాటల విషయంలో ఈ ద్వందార్థ పద ప్రయోగాలు అంత భారీగా, అత్యంత సహజంగా ఎలా వాడగలుగుతున్నాం!? అనేదే ప్రశ్న. పాత పాటల్లోనూ, జానపద సాహిత్యంలోనూ సంకేత భాష ఉంది. కానీ అక్కడ ద్వందార్థం శ్రోతను ఆలోచనలోకి తీసుకెళ్లేది.

ట్రెండ్ పేరుతో దిగజారుతున్న సాహిత్యం!

నేటి పాటల్లో మాత్రం పదం వినగానే అర్థం తేలిపోతుంది. చెవుల్లోకి ఎక్కిన పదం కళ్లముందు కదలాడటానికి అర క్షణమూ ఆలస్యం జరగడం లేదు. ఆలోచించాల్సిన చోట వినియోగం మాత్రమే మిగులుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది? రచయితల తప్పా? మార్కెట్ ఒత్తిడా? లేదా శ్రోతల అభిరుచులా? పాటలు మార్కెట్‌లో నిలవాలంటే ట్రెండ్‌ను అనుసరించాలి అన్న వాదన వినిపిస్తుంది. కానీ సున్నితమైన పదాలతో, శుభ్రమైన భావాలతో వచ్చిన పాటలు కూడా ప్రజాదరణ పొందుతున్నాయి. అంటే సమస్య ప్రేక్షకుడిలో కాదు ఎంచుకునే దారిలో ఉందా?

యువతకు ప్రశ్న: ఈ మీరు పాటలను ఆస్వాదిస్తున్నారా, లేక అలవాటుగా వినేస్తున్నారా? ద్వందార్థ పదాలే లేకపోతే పాట బోరుగా అనిపిస్తుందా? ఒక పాటను కుటుంబంతో కలిసి వినేటప్పుడు అసౌకర్యంగా అనిపించకపోతేనే అది మంచి పాట కాదా? ఇవి సాంస్కృతిక ఆత్మపరిశీలన ప్రశ్నలు. పదే పదే వినిపించే ద్వందార్థ పదాలు సాధారణంగా మారిపోతాయి. అప్పుడు భాషలోని సంయమనం, సిగ్గు, గౌరవం మెల్లగా మాయమవుతాయి. ఇది ఒక్కరోజులో జరిగే మార్పు కాదు; నెమ్మదిగా జరుగే మార్పు. మనం గమనించేలోపే “ఇదీ సాధారణమే” అనిపిస్తుంది.

సంగీత దర్శకుల బాధ్యత లేదా?

రచయిత తన పదాల్ని సరిచూసుకోవాలి, తనని తాను ప్రశ్నించుకోవాలి, అనంతమైన పదాలు కలిగిన తెలుగు భాషలో నుంచీ అవసరమైతే ప్రత్యమ్యాయ పదాలవైపు వెళ్ళగలగాలి. సంగీత దర్శకుడు తన ఎంపికను ఆలోచించాలి, భాష పట్ల ఎంతో కొంత అవగాహన, పదాల సొబగు గురించే కాకుండా అర్థాల గురించిన ఆలోచనా కలిగి వుండాలి. సన్నివేశానికి, పాటలకు, పదాలకు మధ్య అన్వయాన్ని పునః పరిశీలించుకోగలగాలి. శ్రోత తన అభిరుచిని ఒకసారి తిరిగి చూసుకోవాలి, చెవులకు ఇంపుగా మాత్రమే కాకుండా మనసుకు కూడా పాట హాయిని ఇవ్వగలగాలి. నలుగురి మధ్యలో అయినా, నాలుగువేల మంది మధ్యలో అయినా నిస్సంకోచంగా, గొంతెత్తి హాయిగా ఇష్టపడ్డ పాటను పాడుకోగలుగుతున్నామా లేదా అని తరచిచూసుకోవాలి.

మనకు కావలసిన పాటలు ఇవేనా? మన భాషను, మన అభిరుచిని ఇవే ప్రతిబింబిస్తున్నాయా? లేక మనమే తక్కువతో సరిపెట్టుకుంటున్నామా? ఈ ప్రశ్నలే చర్చకు ఆరంభం. ఉన్న అన్ని పదాలనూ ద్వందార్థ పదాలుగా మార్చేసుకున్నాక, అన్నిటికీ ఒక బూతు రంగు పూసేసుకున్నాక ఇప్పటికిప్పుడు కొత్త పదాలను అదీ కొన్ని వందల వేల లక్షల పద సంపదను సృష్టించడం అంత సులభం కాదు. అందుకే ఉన్న పదాలను రక్షించుకోవాలి.

పాటల్లోని పదాల గురించి ఇప్పుడు జరుగుతున్న చర్చ ఒక మంచి పరిణామం. ఇలాంటి మార్పు వస్తే బాగుంటుంది. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూ ఉండండి.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.