
📌 Key Points
- ఎల్ నినో ప్రభావం 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం.
- 2027 వర్షాకాలంపై తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం.
- సముద్ర ఉష్ణోగ్రతలు పెరిగి, చేపల దిగుబడి తగ్గుతుందని అంచనా.
- తీరప్రాంతాల్లో కోత, వరదలు, తుపానుల ముప్పు అధికం.
భారతదేశంలో నైరుతి రుతుపవనాల ఆలస్యానికి కారణమైన ఎల్ నినో ప్రభావం 2027 వరకు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. ఈ దీర్ఘకాలిక ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థ, వ్యవసాయ రంగంపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతుందని, ప్రభుత్వాలు తక్షణమే కార్యాచరణ ప్రణాళికలు రూపొందించాలని నిపుణులు సూచిస్తున్నారు.
ఎల్ నినో ప్రభావం: 2027 వరకు పొడిగింపు
భారతదేశంలో ఈ ఏడాది నైరుతి రుతుపవనాల రాక ఆలస్యం కావడానికి, ఆశించిన స్థాయిలో వర్షాలు పడకపోవడానికి ప్రధాన కారణమైన ‘ఎల్ నినో’ (El Nino) ప్రభావం ఇప్పుడప్పుడే తగ్గేలా లేదు. పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఈ వాతావరణ మార్పు.. రాబోయే 2027 ఫిబ్రవరి వరకు కొనసాగే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.
దీనివల్ల కేవలం ఈ ఏడాది మాత్రమే కాదు, 2027 వర్షాకాలంపై కూడా తీవ్ర ప్రతికూల ప్రభావం పడే ప్రమాదం ఉంది. ఈ మేరకు హైదరాబాద్‌లోని ‘ఇండియన్ నేషనల్ సెంటర్ ఫర్ ఓషన్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్’ (ఇన్‌కాయిస్) తన మొట్టమొదటి ఎల్ నినో బులెటిన్‌లో సంచలన విషయాలను వెల్లడించింది.
2026 జూన్ నుండి 2027 ఫిబ్రవరి వరకు ఎల్ నినో తీవ్రత ఇలాగే కొనసాగడానికి 70 నుంచి 90 శాతం అవకాశాలు ఉన్నాయని ఇన్‌కాయిస్ తెలిపింది. వాతావరణం మళ్లీ సాధారణ స్థితికి రావడానికి కేవలం 10 నుంచి 30 శాతం మాత్రమే అవకాశం ఉంది.
సముద్ర పర్యావరణంపై తీవ్ర ప్రభావం
సాధారణంగా ఎల్ నినో ప్రభావం వేసవి కాలం వరకు పొడిగిస్తే, అది ఆ తర్వాత వచ్చే వర్షాకాలంపై తీవ్ర ప్రభావం చూపుతుంది. సముద్రంలో, వాతావరణంలో మార్పులు అంత తొందరగా మారవు కాబట్టి.. 2027 నాటి రుతుపవనాలు కూడా దెబ్బతినే ప్రమాదాన్ని కొట్టిపారేయలేమని వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఎల్ నినో కారణంగా ఉత్తర హిందూ మహాసముద్రంతో పాటు బంగాళాఖాతం, అరేబియా సముద్రాల్లో ఉపరితల ఉష్ణోగ్రతలు బాగా పెరుగుతాయి. దీనివల్ల సముద్రాల్లో వేడి గాలులు(మెరైన్ హీట్‌వేవ్స్) ఏర్పడి, సముద్ర పర్యావరణ వ్యవస్థ దెబ్బతింటుంది.
బంగాళాఖాతంలో ఉష్ణోగ్రతలు మారడం వల్ల రాబోయే వేట కాలంలో రెండు ముఖ్యమైన చేపల జాతుల దిగుబడి బాగా తగ్గే అవకాశం ఉంది. రాబోయే రోజుల్లో బంగాళాఖాతంలో బలమైన ఈదురు గాలులు వీచే ప్రమాదం ఉంది. తీవ్రమైన వాతావరణ మార్పుల వల్ల తీరప్రాంతాల్లో కోతకు గురికావడం, అకస్మాత్తుగా వరదలు రావడం, తుపానుల తీవ్రత పెరగడం వంటి ముప్పులు పొంచి ఉన్నాయి.
భవిష్యత్ రుతుపవనాలపై ఆందోళన
బంగాళాఖాతంలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంటే.. అరేబియా సముద్రం మాత్రం సాపేక్షంగా ప్రశాంతంగా ఉంటుందని, అక్కడ చేపల వేటకు అనుకూలమైన వాతావరణం ఉంటుందని ఇన్‌కాయిస్ పేర్కొంది. ఇన్‌కాయిస్ సంస్థ అభివృద్ధి చేసిన అత్యాధునిక ‘డీప్ లెర్నింగ్ వాతావరణ నమూనాల’ ద్వారా దాదాపు 15 నెలల ముందే ఈ అంచనాలను రూపొందించారు. రాబోయే రోజుల్లో వాతావరణం ఎలా ఉండబోతుందో వివరించడానికి ఇలాంటి మరిన్ని బులెటిన్లను విడుదల చేస్తామని సంస్థ ప్రకటించింది.
ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు.
హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు. Read More
మొత్తంగా, ఎల్ నినో ప్రభావం దీర్ఘకాలం కొనసాగడం దేశానికి పెను సవాలు. వాతావరణ మార్పుల తీవ్రతను అర్థం చేసుకుని, భవిష్యత్ తరాలకు సురక్షితమైన వాతావరణాన్ని అందించేందుకు ప్రభుత్వాలు, ప్రజలు సమన్వయంతో కృషి చేయాలి.

