|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కీలక ప్రకటన చేసిన సీబీటీ!

Published: 02-03-2026, 8:05 AM
పీఎఫ్ ఖాతాదారులకు శుభవార్త! ఈపీఎఫ్ఓ వడ్డీ రేటుపై కీలక ప్రకటన చేసిన సీబీటీ!
  • 2025-26 ఆర్థిక సంవత్సరానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు 8.25%గా నిర్ణయం
  • వరుసగా రెండో ఏడాది వడ్డీ రేటును యథాతథంగా కొనసాగించిన సీబీటీ
  • ఈ నిర్ణయం ద్వారా దేశవ్యాప్తంగా 7 కోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు లబ్ధి
  • గత పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (CBT) ఈపీఎఫ్ వడ్డీ రేట్లపై కీలక నిర్ణయం తీసుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీ రేటును 8.25 శాతంగానే ఉంచాలని నిర్ణయించారు. దీని ద్వారా కోట్లాది మంది పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది.

2025-26 సంవత్సరానికి వడ్డీ రేటు నిర్ణయం

ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ పై ఏడాదికి ఇచ్చే వడ్డీరేట్లపై సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీలు (CBT) కీలక నిర్ణయం తీసుకున్నారు. కేంద్ర కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ నేతృత్వంలో జరిగిన 239వ సమావేశంలో ఈపీఎఫ్ వడ్డీరేట్లను నిర్ణయించారు. 2025-26 ఆర్థిక సంవత్సరానికి వడ్డీరేట్లను 8.25 శాతంగానే ఉంచాలని డిసైడ్ అయ్యారు. ఉద్యోగుల భవిష్య నిధి (EPF) డిపాజిట్లపై వడ్డీ రేటును 8.25 శాతంగా ఖరారు చేస్తూ మార్చి 2, 2026న ప్రకటన విడుదల చేసింది. గత ఆర్థిక సంవత్సరం (2024-25)లో కూడా వడ్డీ రేటు ఇదే స్థాయిలో ఉండటంతో.. వరుసగా రెండో ఏడాది కూడా వడ్డీ రేటులో ఎటువంటి మార్పు చేయకుండా యథాతథంగా కొనసాగించింది.

ఖాతాదారులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయం

ఏప్రిల్ 1, 2025 నుండి మార్చి 31, 2026 మధ్య చేసిన కంట్రిబ్యూషన్లకు ఈ 8.25% వడ్డీ వర్తిస్తుంది. దీనివల్ల దేశవ్యాప్తంగా ఉన్న సుమారు 7 కోట్ల మందికి పైగా పీఎఫ్ ఖాతాదారులకు ప్రయోజనం చేకూరనుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (CBT) తీసుకున్న ఈ నిర్ణయాన్ని త్వరలోనే కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం దీనిని ఆమోదించిన వెంటనే, వడ్డీ మొత్తాన్ని ఖాతాల్లో జమ చేస్తారు.

గత పదేళ్లలో ఈపీఎఫ్ వడ్డీ రేట్ల పరిస్థితి

గత పదేళ్ల గణాంకాలను పరిశీలిస్తే.. ఈపీఎఫ్ వడ్డీ రేట్లు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. 2015-16లో 8.8 శాతంగా ఉన్న వడ్డీ రేటు, ప్రస్తుతానికి 8.25 శాతానికి చేరుకుంది. అంటే ఈ దశాబ్ద కాలంలో వడ్డీ రేటు 0.55 శాతం తగ్గింది. 2021-22లో ప్రకటించిన 8.10 శాతం వడ్డీ రేటు.. 1977-78 తర్వాత నమోదైన అత్యంత తక్కువ రేటు కావడం గమనార్హం. ఆ ఏడాది వడ్డీరేటు కేవలం 8 శాతంగానే ఉంచారు. గత ఏడాదితో పోలిస్తే వడ్డీ పెరగకపోయినా, స్థిరంగా కొనసాగడంపై ఖాతాదారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు.

మొత్తానికి ఈపీఎఫ్ వడ్డీ రేటు స్థిరంగా కొనసాగడం పట్ల ఖాతాదారులు మిశ్రమంగా స్పందిస్తున్నారు. ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన వెలువడనుంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.