
రెండేళ్ల తర్వాత పవన్ కళ్యాణ్ హరిహరవీరమల్లు చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ చారిత్రక నేపథ్యం కలిగిన సినిమా ఎలా ఉందో తెలుసుకుందాం. వీరమల్లుగా పవన్ కళ్యాణ్ నటన, కథ ఎలా సాగుతుందో చూద్దాం.
Key Points
పవన్ కళ్యాణ్ హిస్టారికల్ మూవీతో ప్రేక్షకుల ముందుకు
వీరమల్లు ధైర్యసాహసాలు, కోహినూర్ దొంగతనం
ఔరంగజేబు, మొఘల్ పాలన చీకటి కోణాలు
పంచమి మోసం, వీరమల్లు గతం రహస్యాలు
కథాంశం: వీరమల్లు యొక్క సాహసం
పవన్ కళ్యాణ్ సిల్వర్ స్క్రీన్‌పై కనిపించి రెండేళ్లు దాటింది. బ్రో తర్వాత పాలిటిక్స్‌తో బిజీ అయిన పవన్ కళ్యాణ్ సినిమాలకు దూరమయ్యారు. లాంగ్ గ్యాప్ తర్వాత హరిహరవీరమల్లు మూవీతో అభిమానుల ముందుకొచ్చారు. ఫస్ట్ టైమ్ పవన్ కళ్యాణ్ హిస్టారికల్ కథతో చేసిన ఈ సినిమాకు క్రిష్, ఏఎమ్ జ్యోతికృష్ణ దర్శకత్వం వహించారు.
నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటించింది. సీనియర్ ప్రొడ్యూసర్ ఏఎమ్ రత్నం ఈ సినిమాను నిర్మించారు. మూడేళ్ల పాటు షూటింగ్, నిర్మాణంలో ఎన్నో అడ్డంకులు, పలుమార్లు రిలీజ్ పోస్ట్‌పోన్‌లను దాటుకొని జూలై 24న (నేడు)ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ మూవీ ఎలా ఉందంటే?
1960 కాలంలో కొల్లూర్ ప్రాంతంలో వీరమల్లు పేరు వింటే హడల్. చోరకళలో, వీరత్వంలో అతడికి మించిన వారు ఉండరు. హైదరాబాద్ నవాబుల సంపదను దోచేస్తూ పేదలకు పంచిపెడుతుంటాడు. వీరమల్లు ధైర్యసాహసాలు విన్న స్థానిక రాజు చిన్న దొర( సచిన్ ఖేడ్కర్) గోల్కొండ నవాబుకు తాను కప్పంగా కడుతున్న వజ్రాలను దొంగిలించే పని అప్పగిస్తాడు. కానీ నాట్యకారిణి పంచమి చేసిన మోసం వల్లం గోల్కొండ నవాబుకు బంధీగా చిక్కుతాడు వీరమల్లు. వీరమల్లు ధైర్యసాహసాల గురించి విన్న గోల్కొండ నవాబు….ఢిల్లీలో ఔరంగజేబు వద్ద ఉన్న కోహినూర్ వజ్రాన్ని దొంగిలించి తీసుకురావాలని కోరుతాడు. అందుకు వీరమల్లు ఒప్పుకుంటాడు.
కోహినూర్‌ను కొట్టేయడానికి తన బలగంతో గోల్కొండ నుంచి ఢిల్లీకి బయలుదేరిన వీరమల్లుకు ఈ జర్నీలో ఎలాంటి పరిస్థితులు ఎదురయ్యాయి? ఔరంగజేబు విధించిన జిజియా పన్ను కారణంగా హిందువులు ఎలాంటి ఇబ్బందులను ఎదుర్కొన్నారు? అసలు వీరమల్లు గతం ఏమిటి? ఔరంగజేబు నుంచి కోహినూర్‌ను వీరమల్లు కొట్టేశాడా? వీరమల్లును ప్రేమించిన పంచమి అతడిని ఎందుకు మోసం చేసింది అన్నదే మిగిలిన కథ.
హరిహరవీరమల్లుతో కెరీర్‌లో ఫస్ట్ టైమ్ హిస్టారికల్ జానర్‌ను టచ్ చేశాడు పవన్ కళ్యాణ్. కంప్లీట్‌గా ఆయన ఇమేజ్ బేస్ చేసుకొని రూపొందించిన మూవీ ఇది. చరిత్రకు వీరమల్లు అనే ఫిక్షనల్ క్యారెక్టర్‌ను జోడిస్తూ దర్శకుడు క్రిష్ ఈ కథను రాసుకున్నారు. మొఘల్ రాజులు, వారి పాలన గొప్పతనాన్ని గురించే ఎక్కువగా చరిత్రకారులు చెబుతూ వచ్చారు.
నటన, దర్శకత్వం మరియు సాంకేతిక విభాగం
మొఘలుల కాలంలోని చీకటి కోణాలను చూపించిన సినిమా ఇది. హిందువులపై మొఘల్ రాజు ఔరంగజేబు సాగించిన అకృత్యాలు, జిజియా పన్ను పేరుతో బలవంతపు మత మార్పిడిలకు ఎలా పాల్పడ్డాడు అన్నది ఆవిష్కరించారు. అంతే కాకుండా కోహినూర్ వంటి విలువైన దేశ సంపదను మొఘలులు ఎలా దోచుకున్నారన్నది టచ్ చేశారు.
మొఘల్ రాజు ఔరంగజేబు అన్యాయాలు, అక్రమాలను ఎదురించడంతో పాటు సనాతన ధర్మాన్ని కాపాడటం కోసం యోధుడైన వీరమల్లు సాగించిన పోరాటమే హరిహరవీరమల్లు కథ.
అధర్మరానికి, ధర్మానికి మధ్య సాగే ఈ కథలో హీరోయిజాన్ని పండించడానికి బోలేడు స్కోప్ ఉంది.యాక్షన్, ఎలివేషన్లతో కథను అల్లుకున్నారు దర్శకద్వయం. అందుకు తగ్గట్లే సినిమా సాగుతుంది. ఫస్ట్ హాఫ్‌లో పవన్ పై వచ్చే పోర్ట్ సీన్ ఫైట్, కుస్తీ వీరులతో పాటు ఇంటర్వెల్‌కు ముందు ఛార్మినార్ వద్ద వచ్చే యాక్షన్ ఎపిసోడ్ ఫ్యాన్స్‌కు విజువల్ ఫీస్ట్‌లా ఉంటాయి. పంచమి పాత్రకు సంబంధించిన ట్విస్ట్ కూడా ఆకట్టుకుంటుంది.
ఫస్ట్ హాఫ్‌లో ఔరంగజేబు ఎంతటి క్రూరుడో పీక్స్‌లో చూపించారు. అతడి వద్దే నుంచే వీరమల్లు కోహినూర్ వజ్రం కొట్టేయడానికి ఒప్పుకునే సీన్‌తో సెకండాఫ్ కోసం ఆసక్తిగా ఎదురుచూసేలా చేశారు డైరెక్టర్లు. కానీ కీలకమైన సెకండాఫ్‌ను థ్రిల్లింగ్‌గా నడిపించడంలో తడబాటుకు లోనైనట్లుగా అనిపిస్తుంది. వజ్రం కోసం సాగాల్సిన వీరమల్లు జర్నీ దారితప్పుతుంది. సనాతన ధర్మం ట్రాక్ ఒక్కటే కాస్తగా బెటర్ అనిపిస్తుంది.
ఔరంగజేబును వీరమల్లు ఎదురించడం అయినా పూర్తిగా అయినా చూపించారా అంటే అది లేదు. ఇద్దరూ తలపడే సీన్ వరకు కథను తీసుకొచ్చి సినిమాను ఎండ్ చేయడం డిసపాయింట్ చేస్తుంది.
చివరి మాట: హిట్‌నా? ఫ్లాప్‌నా?
హిస్టారికల్ సినిమాకు వీఎఫ్ఎక్స్, సీజీ వర్క్ కీలకం. గ్రాఫిక్స్ ఎంత క్వాలిటీగా ఉంటే సినిమా విజువల్‌గా అంత బాగుంటుంది. హరిహరవీరమల్లుకు అవే మైనస్‌గా మారాయి. వీఎఫ్ఎక్స్ సీన్స్‌పై ఇంకాస్త కేర్ తీసుకుంటే బాగుండేది.
పవన్ కళ్యాణ్ ఇమేజ్, యాక్షన్ ఎపిసోడ్స్‌తో చాలా వరకు సినిమాలోని లోపాలను కవర్ చేశాయి. పవన్ కళ్యాణ్ డైలాగ్స్ కొన్ని థియేటర్లలో బాగా పేలాయి. వీరమల్లుగా పవన్ లుక్ బాగుంది. పవన్ కళ్యాణ్ సినిమా నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో అవన్నీ ఉండేలా మేకర్స్ జాగ్రత్తపడ్డారు. పవన్ ఇమేజ్‌ను మాత్రమే కాకుండా ఆయన ఐడియాలజీని టచ్ చేశారు.
పవర్ స్టార్ తర్వాత నిధి అగర్వాల్ పంచమి పాత్ర ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచింది. గ్లామర్, యాక్టింగ్‌తో అదరగొట్టింది. ఫస్ట్ హాఫ్‌లో నిధి కనిపించే సీన్స్ బాగున్నాయి. ఇంటర్వెల్ తర్వాత ఆమె క్యారెక్టర్ లెంగ్త్‌ను తగ్గిస్తూ పోయారు.
ఔరంగజేబు పాత్రకు బాలీవుడ్ నటుడు బాబీడియోల్ న్యాయం చేశారు. ఇటీవల కన్నుమూసిన సీనియర్ నటుడు కోట శ్రీనివాసరావు ఈ సినిమాలో చిన్న పాత్రలో కనిపించారు. కొల్లగొట్టినాదిరో పాటలో అనసూయ నటించింది. ఈ పాటతో పాటు తారతార పాట విజువల్‌గా బాగున్నాయి. కీరవాణి బీజీఎమ్ ఈ పీరియాడికల్ ఫీల్‌ను ఆడియెన్స్‌లో కలిగించడంలో దోహదపడింది.
హరిహరవీరమల్లు కంప్లీట్‌గా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌ను మెప్పించే మూవీ ఇది. హిస్టారికల్ క్యారెక్టర్‌లో పవన్ నటన బాగుంది. కథ, వీఎఫ్ఎక్స్ లోపాలు కారణంగా బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా ఎంత వరకు నిలబడుతుంది అన్నది చూడాల్సిందే.
మొత్తం మీద, హరిహరవీరమల్లు చిత్రం చరిత్రాత్మక నేపథ్యంతో ఆకట్టుకునే ప్రయత్నం. పవన్ కళ్యాణ్ నటన, కథనం, మరియు దర్శకత్వం ఎలా ఉందో ప్రేక్షకుల తీర్పు అవసరం.


