
📌 Key Points
- కాగ్ రిపోర్టుతో ప్రభుత్వం ఆర్థిక విషయాలపై కళ్లు తెరవాలని హరీశ్ రావు సూచన.
- ప్రభుత్వ వైఫల్యాలను కాగ్ ఎత్తి చూపిందని హరీశ్ రావు విమర్శించారు.
- సంక్షేమం, సాగునీటి రంగాల్లో నిధుల వినియోగం సరిగా లేదని కాగ్ తప్పుపట్టింది.
- అప్పులను ఆస్తులుగా మార్చడంలో ప్రభుత్వం విఫలమైందని హరీశ్ రావు ఆరోపించారు.
మాజీ మంత్రి హరీశ్ రావు కాగ్ రిపోర్టు ఆధారంగా రేవంత్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రభుత్వం ఆర్థిక నిర్వహణలో విఫలమైందని, వెంటనే మేల్కొని తప్పులను సరిదిద్దుకోవాలని ఆయన అన్నారు. రాష్ట్రపతిని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని ఆరోపించారు.
కాగ్ రిపోర్టుపై హరీశ్ రావు విమర్శలు
కాగ్ రిపోర్టుతో రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరవాలని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. ప్రతీకార రాజకీయాలు, రాష్ట్ర పరపతిని దెబ్బతీసే విధానాలకు స్వస్తి పలకాలని చెప్పారు. రెండేళ్ల మూడు నెలల కాంగ్రెస్ పాలనలో ఆర్థిక క్రమశిక్షణ గాడి తప్పిందని కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ నివేదిక స్పష్టం చేసిందన్నారు. కాగ్ రిపోర్టు రేవంత్ సర్కారుకు చెంప పెట్టు లాంటిదన్నారు.
తాము ఈ ప్రభుత్వ పని తీరుపై నిలదీస్తున్న అంశాలనే కాగ్ ప్రస్తావించిందని హరీశ్ రావు అన్నారు. సంక్షేమ రంగానికి, సాగునీటి రంగానికి ప్రభుత్వం బడ్జెట్ పత్రాల్లో భారీగా నిధులు పెట్టి ఖర్చు పెట్టడంలో ఘోరంగా వైఫల్యం చెందిన విషయాన్ని కాగ్ తప్పుపట్టిందన్నారు. అంకెల్లో గోల్ మాల్ ఆచరణలో అంతకన్నా గోల్ మాల్ ఉందని కాగ్ నివేదిక కుండబద్దలు కొట్టిందన్నారు.
ప్రభుత్వ ఆర్థిక విధానాలపై కాగ్ అక్షింతలు
తెచ్చిన అప్పులను రాష్ట్రానికి ఆస్తులుగా మలచడంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని కాగ్ తేల్చి చెప్పిందన్నారు హరీశ్ రావు. రాష్ట్రాన్ని భారీ రెవెన్యూ లోటు దిశగా తీసుకెళ్తుతున్నారని కాగ్ చెప్పకనే చెప్పిందన్నారు. మాటలు మూరెడు -చేతలు చారెడు కూడా లేవని ఈ చేవ లేని సర్కార్‌కు కాగ్ అక్షింతలు వేసిందన్నారు.
‘మేం ప్రభుత్వాన్ని తప్పుబడితే పెడబొబ్బలతో మా మీద దాడి చేస్తారు. కాగ్ రిపోర్టు తర్వాత కూడా ఇంకా అవే అబద్దాలను కొనసాగిస్తారా? 2024-25 ఆర్థిక సంవత్సరానికి విడుదల చేసిన రిపోర్టులోనే కాగ్ అనేక ప్రభుత్వ లోపాల్ని తప్పు పట్టింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో ఈ ప్రభుత్వం లెక్కలేనన్ని తప్పులు చేసింది. పాలన అంటే డొల్ల. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశ పెట్టే బడ్జెట్లు కూడా డొల్ల అని కాగ్ రిపోర్టు 2024-25 కుండబద్దలు కొట్టింది.’ అని హరీశ్ రావు అన్నారు. ఈ ప్రభుత్వానికి ఆర్థిక క్రమశిక్షణ లేదు అని చెప్పడానికి కాగ్ రిపోర్టు నిదర్శనమన్నారు.
సంక్షేమ పథకాల అమలులో వైఫల్యం
కాగ్ రిపోర్టు ప్రభుత్వానికి ఒక హెచ్చరికలాంటిదని, దీని ఆధారంగా ప్రభుత్వం తన విధానాలను సరిదిద్దుకోవాలని హరీశ్ రావు సూచించారు. ఆర్థిక క్రమశిక్షణ పాటించాలని కోరారు.


