
తమిళ నటి గౌరీ కిషన్ జర్నలిస్ట్ కార్తీక్ క్షమాపణను మరోసారి తిరస్కరించింది. తన బరువు గురించి అడిగిన ప్రశ్నపై జరిగిన వివాదం, బాడీ షేమింగ్ కాదన్న జర్నలిస్ట్ వ్యాఖ్యలను ఆమె తీవ్రంగా ఖండించింది. బాధ్యత లేని క్షమాపణ క్షమాపణే కాదని స్పష్టం చేసింది.
Key Points
జర్నలిస్ట్ కార్తీక్ క్షమాపణను గౌరీ కిషన్ నిరాకరించింది.
బాడీ షేమ్ చేయలేదన్న వాదనను గౌరీ తీవ్రంగా ఖండించింది.
'అదర్స్' సినిమా ప్రెస్ మీట్‌లో బరువుపై ప్రశ్నతో వివాదం మొదలైంది.
గౌరీకి మద్దతుగా నిలిచిన నెటిజన్లు, ఆ ప్రశ్నకు 'సెక్సిస్ట్' అని పేరు పెట్టారు.
క్షమాపణను తిరస్కరించిన గౌరీ కిషన్
తమిళ నటి గౌరీ కిషన్ జర్నలిస్ట్, యూట్యూబర్ పై మరోసారి మండిపడింది. అతడు చెప్పిన క్షమాపణను అంగీకరించబోనని స్పష్టం చేసింది. తాను బాడీ షేమ్ చేయలేదన్న కామెంట్స్ ను ఆమె తప్పుబట్టింది.
తమిళ నటి గౌరీ కిషన్ ఇటీవల యూట్యూబర్ కార్తీక్ పై తీవ్ర స్థాయిలో మండిపడింది. ‘అదర్స్’ సినిమా ప్రెస్ మీట్‌లో తన బరువు గురించి ఆ సినిమా సహ-నటుడు ఆదిత్య మాధవన్, దర్శకుడు అబిన్ హరిహరన్ లను ప్రశ్నించినందుకు ఆమె విమర్శలు గుప్పించింది. ఇప్పుడు ఈ ఘటనను కేవలం “అర్థం చేసుకోకపోవడం”గా కొట్టిపారేయడాన్ని ఖండిస్తూ.. ఆ యూట్యూబర్ క్షమాపణను అంగీకరించడానికి గౌరీ నిరాకరించింది.
‘జవాబుదారీతనం లేని క్షమాపణ, క్షమాపణే కాదు’
జర్నలిస్ట్ వ్యాఖ్యలపై నటి ఆగ్రహం
“జవాబుదారీతనం లేని క్షమాపణ, అసలు క్షమాపణే కాదు” అని గౌరీ సోషల్ మీడియాలో రాసింది. జర్నలిస్ట్ క్షమాపణ చెప్పి, తన వాదనను పంచుకున్న వీడియోను ఆమె రీపోస్ట్ చేస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది. గౌరీ మరింత ఘాటుగా మాట్లాడుతూ.. “ముఖ్యంగా ‘ఆమె ప్రశ్నని అర్థం చేసుకోలేదు.. అది కేవలం సరదాగా అడిగిన ప్రశ్న’ అని చెప్పి.. ఆ విషయాన్ని తేలికగా తీసిపారేసినప్పుడు.. లేదంటే అంతకంటే దారుణంగా.. ‘నేను ఎవరినీ బాడీ షేమింగ్ చేయలేదు’ అని వాదించినప్పుడు ఆ క్షమాపణకు విలువ ఉండదు.
నేను స్పష్టంగా చెబుతున్నాను. ఇలా నటనతో కూడిన పశ్చాత్తాపాన్ని లేదా పొగరు మాటలను అంగీకరించను. ఇంకాస్త బాగా చేయండి ఆర్ఎస్ కార్తీక్” అని ఆమె అనడం విశేషం. ఈ స్క్రీన్‌షాట్‌ను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో కూడా పంచుకుంది. గత శనివారం (నవంబర్ 8) ఆ యూట్యూబర్ తన ప్రశ్నను తప్పుగా అర్థం చేసుకున్నారని, గౌరీని బాధపెట్టే ఉద్దేశం తనకు లేదని పేర్కొంటూ క్షమాపణ చెప్పారు.
సోషల్ మీడియాలో గౌరీకి మద్దతు
ఆ ప్రెస్ మీట్‌లో గౌరీ ఆ ప్రశ్న అడిగిన యూట్యూబర్‌ను చూస్తూ.. “నా బరువు గురించి మీకు ఎందుకు? సినిమాతో దానికి సంబంధం ఏంటి? నా బరువు నా ఇష్టం. అది నా ప్రతిభకు సంబంధించినది కాదు. నేను నా సినిమాల ద్వారా మాత్రమే నేనేంటో చూపగలను. నేను కష్టపడుతున్నాను. నేను కెరీర్-ఓరియెంటెడ్ పాత్రలనే ఎంచుకున్నాను” అని స్పష్టంగా చెప్పింది.
ఆ జర్నలిస్టుకు నటి క్లాస్ పీకిన ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా సర్క్యులేట్ అయింది. ఆమెకు మద్దతుగా చాలా మంది ముందుకొచ్చి, ఆ యూట్యూబర్ వేసిన ప్రశ్నను ‘సెక్సిస్ట్’గా పేర్కొంటూ విమర్శించారు.
ఈ వివాదం మీడియా తీరు, సెలబ్రిటీల వ్యక్తిగత విషయాలపై ప్రశ్నల ఔచిత్యం గురించి చర్చకు దారి తీసింది. గౌరీ కిషన్ ధైర్యమైన వైఖరిని పలువురు ప్రశంసిస్తున్నారు. బాడీ షేమింగ్ పై ఆమె స్పందన ప్రాధాన్యతను సంతరించుకుంది.


