|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

హైదరాబాద్‌లో చెరువుల కళ: రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం!

Published: 05-03-2026, 8:35 AM
హైదరాబాద్‌లో చెరువుల కళ: రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభోత్సవం!
  • హైడ్రా ఆధ్వర్యంలో రెండు చెరువులకు పునరుజ్జీవం, త్వరలో ప్రారంభం
  • బమృకున్ – ఉద్ – దౌలా చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు
  • కూకట్‌పల్లి నల్ల చెరువు కూడా సీఎం చేతుల మీదుగా ప్రారంభం కానుంది
  • మొదటి విడతలో 6 చెరువులు, రెండో విడతలో 14 చెరువుల అభివృద్ధికి ప్రణాళికలు

హైదరాబాద్ నగరంలో మరో రెండు చెరువులకు పూర్వ వైభవం రానుంది. బమృకున్ – ఉద్ – దౌలా చెరువు, కూకట్‌పల్లి నల్ల చెరువులను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. నగరంలో చెరువుల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోంది.

బమృకున్ చెరువు పునరుద్ధరణ

మ‌రో రెండు చెరువులు హైదరాబాద్ న‌గ‌ర ప్ర‌జ‌ల‌కు అందుబాటులోకి రానున్నాయి. పాత‌బ‌స్తీలోని బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువుతో పాటు.. కూక‌ట్ ప‌ల్లిలోని న‌ల్ల చెరువు ప్రారంభానికి సిద్ధ‌మ‌య్యాయి. ఈ నెల 8వ తేదీన బ‌మృకున్ – ఉద్ – దౌలా చెరువును ముఖ్య‌మంత్రి రేవంత్‌రెడ్డి ప్రారంభించ‌నున్నారు. 9వ తేదీన కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువును కూడా సీఎం రేవంత్‌రెడ్డి చేతుల మీదుగానే ప్రారంభించి.. ప్రజలకు అందుబాటులోకి తేనున్నారు.

హైడ్రా మొద‌ట విడ‌త చేప‌ట్టిన 6 చెరువుల్లో ఇప్ప‌టికే అంబ‌ర్‌పేట‌లోని బ‌తుక‌మ్మ కుంట గ‌తేడాది సెప్టెంబ‌రు 28న‌ ప్రారంభ‌మైన విష‌యం తెలిసిందే. మ‌రో మూడు చెరువులు నిర్మాణ ద‌శ‌లో ఉన్నాయి. వీటికి తోడు రెండో విడ‌త మ‌రో 14 చెరువుల‌ను హైడ్రా అభివృద్ధి చేయ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తోంది. ఇలా న‌గ‌రంలో మురికి కూపాలుగా మారిన చెరువుల రూపురేఖ‌లు మార్చే ప‌నిలో హైడ్రా నిమ‌గ్న‌మైంది.

పాత‌బ‌స్తీలో నిజాంల నాటి చారిత్ర‌క చెరువు( చారిత్ర‌క బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువు )కు హైడ్రా ప్రాణం పోసింది. క‌బ్జాల‌ను తొల‌గించి… ఆక్ర‌మ‌ణ‌ల‌తో ఆన‌వాళ్లే కోల్పోయిన చెరువును బ‌తికించింది. చరిత్ర‌ను త‌వ్వితీసిన మాదిరి చెరువును రూపొందించి చారిత్ర‌క వైభ‌వాన్ని హైడ్రా చాటింది.

ఒక‌వైపు ఉన్న నాటి క‌ట్ట‌ను మ‌రింత ప‌టిష్టం చేసి వాకింగ్ ట్రాక్‌ను హైడ్రా నిర్మించింది. క‌ట్ట‌పై ఓపెన్ జిమ్‌ను పెట్టి అన్ని వ‌య‌సుల‌వారి ఆరోగ్యానికి బాట‌లు వేసింది. చెరువు లోప‌లి వైపు ఫెన్సింగ్ ప‌నుల‌ను పూర్తి చేసింది. చిన్నారులు ఆడుకునేందుకు ఇరువైపులా ప్లే ఏరియాలను అభివృద్ధి చేశారు. వృద్ధులు సేద దీరే విధంగా అక్క‌డ గ‌జ‌బోలు న‌లువైపులా నిర్మించారు.

కూకట్‌పల్లి నల్ల చెరువు అభివృద్ధి

చెరువుకు మూడు వైపులా ప్ర‌వేశ మార్గాల‌ను అందుబాటులోకి తెచ్చారు. నిజాంల కాలంలో ఈ చెరువుకు ఎంతో చ‌రిత్ర ఉంద‌ని.. దానిని పున‌రావృతం చేసేలా.. చుట్టూ ఔష‌ధ‌గుణాలున్న మొక్క‌ల‌తో పాటు.. చ‌ల్ల‌టి నీడనిచ్చే చెట్ల‌ను నాటారు. సీసీటీవీ కెమేరాల‌ను ఏర్పాటు చేసి.. హైడ్రా ప్ర‌ధాన కార్యాల‌యం నుంచి ప‌ర్య‌వేక్షించేలా ఏర్పాట్లు చేశారు.

రాజేంద్ర‌న‌గ‌ర్‌, ఆరాంఘ‌ర్‌, కాటేదాన్ ప్రాంతాల నుంచి వ‌చ్చే వ‌ర‌ద ఈ చెరువుకు చేరేద‌ని పలువురు చెబుతున్నారు. నిజాంల‌ కాలంలో మీరాలం ట్యాంక్‌ను రాజులు, బ‌మృకున్ – ఉద్‌- దౌలా చెరువును రాణులు స్నానాల‌కు వినియోగించేవార‌ని అంటున్నారు. ఎంతో చ‌రిత్ర ఉన్న ఈ చెరువు మ‌ళ్లీ పున‌రుద్ధ‌ర‌ణ‌కు నోచుకోవ‌డం చాలా ఆనందంగా ఉంద‌ని ప‌లువురు సంబురప‌డుతున్నారు.

కాంక్రీట్ జంగిల్‌గా మారిన ప్రాంతంలో కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువు ఆక్ర‌మ‌ణ‌ల‌కు గురై బిక్కుబిక్కుమంటున్న త‌రుణంలో హైడ్రా దృష్టి ఆ చెరువుపై ప‌డింది. మురుగు నీటితో దుర్గంధ‌భ‌రితంగా మారిన ఈ చెరువును అభివృద్ధి చేయాల‌ని హైడ్రా నిర్ణ‌యించింది. 2024 సెప్టెంబ‌రులో ఆక్ర‌మ‌ణ‌లు తొల‌గించిన‌ప్పుడు ఎన్నో అవ‌రోధాలు ఎదుర‌య్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన స‌మాచారంతో ఆక్ర‌మ‌ణ‌ల‌ను తొల‌గించే ప‌నిని హైడ్రా చేప‌ట్టింది.

హైడ్రా ప్రాజెక్టు విస్తరణ

చెరువ‌లోకి జ‌రిగి ఎఫ్‌టీఎల్ ప‌రిధిలో నిర్మించిన 16 వ్యాపార షెడ్డుల‌ను హైడ్రా తొల‌గించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్య‌ర్థాల‌తో పాటు ద‌శాబ్దాలుగా పేరుకుపోయిన పూడిక‌ను పూర్తిగా తొల‌గించ‌డ‌మే కాకుండా.. 3 మీట‌ర్లకు పైగా మ‌ట్టిని కూడా తొల‌గించింది. అప్పుడు కాని దుర్గంధం దూర‌మ‌వ్వ‌లేదు. ఇప్పుడు చెరువు విస్తీర్ణం దాదాపు రెట్టింపు అయ్యింది. 16 ఎక‌రాల‌కు కుంచించుకుపోయిన చెరువు 30 ఎక‌రాలకు విస్త‌రించుకుంది.

కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల‌చెరువును హైడ్రా అభివృద్ధి చేసిన త‌ర్వాత అక్క‌డి ప‌రిస‌రాలు ఆహ్లాదంగా మారాయి. 5 కిలోమీట‌ర్ల దూరం నుంచి ఈ చెరువు చెంత సేద దీరేందుకు, వాకింగ్‌కు, పిల్ల‌ల‌ను ఆడించేందుకు వ‌స్తున్నామ‌ని సంద‌ర్శ‌కులు చెబుతుంటే చాలా ఆనందంగా ఉంద‌ని హైడ్రా క‌మిష‌న‌ర్ రంగ‌నాథ్ తెలిపారు.

ఇటీవలే చెరువు అభివృద్ధి ప‌నుల‌ను హైడ్రా క‌మిష‌న‌ర్ క్షేత్ర‌స్థాయిలో ప‌రిశీలించారు. “కూక‌ట్‌ప‌ల్లి న‌ల్ల చెరువు చుట్టూ నివాస ప్రాంతాలున్నాయి. వ‌ర్షం ప‌డితే .. చెరువులోకి వెళ్ల‌డానికి దారి లేక వ‌ర‌దంతా నివాస ప్రాంతాల‌ను ముంచెత్తేది. ఇప్పుడు న‌ల్ల చెరువులోకి 7 ఇన్‌లెట్ల ద్వారా చేరుతోంది. చెరువు నిండితే సుల‌భంగా వెళ్లేందుకు గ‌తంలో ఉన్న ఔట్‌లెట్‌ల‌ను అభివృద్ధి చేశాం. మురుగు నీరు క‌ల‌వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐల్యాండ్స్ నిర్మించాం. బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు కిలోమీట‌రున్న‌ర పాత్ వే అందుబాటులోకి వ‌చ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్‌లా మారింది. ఆరోగ్య ప‌రంగా మంచి సౌక‌ర్యాలు క‌ల్పిస్తున్నాం. మ‌ల్టీ ప‌ర్ప‌స్‌గా దీనిని త‌యారు చేస్తున్నాం” అని క‌మిష‌న‌ర్ వివరించారు.

హైడ్రా ప్రాజెక్టు ద్వారా చెరువుల పునరుద్ధరణ నగర ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. పర్యావరణ పరిరక్షణకు, ప్రజల ఆరోగ్యానికి ఇది ఒక మంచి ముందడుగు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.