|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా: హస్మత్‌పేటలో భారీ ఆపరేషన్!

Published: 08-07-2026, 8:40 AM
రూ.750 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా: హస్మత్‌పేటలో భారీ ఆపరేషన్!

హైదరాబాద్‌ మహానగరంలో ప్రభుత్వ భూముల పరిరక్షణకు హైడ్రా సంస్థ కఠిన చర్యలు చేపట్టింది. హస్మత్‌పేటలో రూ.750 కోట్ల విలువైన 10 ఎకరాల భూమిని కబ్జాదారుల నుంచి విడిపించి, అక్రమ నిర్మాణాలను కూల్చివేసింది. ఇది ప్రభుత్వ ఆస్తుల రక్షణకు నిబద్ధతను చాటుతోంది.

Key Points

1

హైదరాబాద్‌ హస్మత్‌పేటలో రూ.750 కోట్ల విలువైన 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది.

2

108 ఎకరాల్లో ఇప్పటికే 98 ఎకరాలు కబ్జాకు గురవగా, మిగిలిన భూమిని రక్షించారు.

4

భవిష్యత్ ఆక్రమణలను నివారించేందుకు భూమి చుట్టూ ఇనుప ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు.

హైడ్రా ఆపరేషన్: రూ.750 కోట్ల భూమి రక్షణ

HYDRAA Operation Hasmathpet : హైదరాబాద్‌ మహానగర పరిధిలో చెరువులు, ప్రభుత్వ భూముల ఆక్రమణదారులపై ఉక్కుపాదం మోపుతున్న హైడ్రా (హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ) శనివారం మరో భారీ ఆపరేషన్ చేపట్టింది. మేడ్చల్ – మల్కాజగిరి జిల్లా, బాలానగర్ మండలం పరిధిలోని హస్మత్‌పేటలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమణదారుల నుంచి విడిపించింది. సర్వే నంబర్ 01లో అక్రమ నిర్మాణాలను కూల్చివేసి, సుమారు 10 ఎకరాల ప్రభుత్వ భూమిని హైడ్రా కాపాడింది. బహిరంగ మార్కెట్లో ఈ భూమి విలువ దాదాపు రూ. 750 కోట్ల వరకు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

హైడ్రా ప్రకటనలోని వివరాల ప్రకారం…… హస్మత్‌పేట సర్వే నంబర్ 01 లో మొత్తం 108 ఎకరాల ప్రభుత్వ భూమి ఉండగా, అందులో ఇప్పటికే 98 ఎకరాలు రకరకాలుగా కబ్జాకు గురైంది. కబ్జాదారులు ఎవరికి వారే గ్రూపులుగా ఏర్పడి, ఆ భూమిని వంద గజాల చొప్పున ప్లాట్లుగా మార్చి ఇతరులకు అక్రమంగా విక్రయించారు. దీంతో అక్కడ ఇప్పటికే పెద్ద ఎత్తున ఇళ్ల నిర్మాణాలు జరిగి, వందలాది కుటుంబాలు నివాసం ఉంటున్నాయి.

కబ్జాదారుల ఎత్తుగడలు, హైడ్రా ప్రతిఘటన

మానవతా దృక్పథంతో ఆలోచించిన హైడ్రా అధికారులు.. ఇప్పటికే నివాసాలు ఉంటున్న ఇళ్ల జోలికి వెళ్లకుండా, ఖాళీగా ఉండి ఆక్రమణకు గురవుతున్న భూమిపైనే ఈ ఆపరేషన్ నిర్వహించారు. స్థానిక రెవెన్యూ అధికారులు ఇచ్చిన లిఖితపూర్వక లేఖ ఆధారంగా ఈ చర్యలు చేపట్టారు. శనివారం ఉదయం రెవెన్యూ అధికారుల సమక్షంలో…. భారీ పోలీసు బందోబస్తు మధ్య హైడ్రా బృందాలు రంగంలోకి దిగి ఆక్రమణలను తొలగించాయి.

కబ్జాదారులు ఈ మిగిలిన 10 ఎకరాల భూమిని కూడా ఆక్రమించుకునేందుకు ముఠాలుగా ఏర్పడ్డారు. భూమి చుట్టూ ముందస్తుగా తయారు చేసిన ‘ప్రీకాస్ట్ ఇటుకల’తో రాత్రికి రాత్రే ప్రహరీ గోడలు నిర్మించారు. మరికొన్ని చోట్ల చిన్న చిన్న గదులు, తాత్కాలిక షెడ్లు వేసి ఆక్రమించారు. ఈ స్థలాలు తమవేనని నమ్మించేందుకు కబ్జాదారులు వారి సొంత మనుషులను అక్కడ కాపలాగా కూడా ఉంచారు. వీటిని వంద గజాల ప్లాట్ల రూపంలో అమాయక ప్రజలకు తెగనమ్మేందుకు ప్రయత్నాలు సాగుతున్న తరుణంలో హైడ్రా వీటికి గట్టి చెక్ పెట్టింది.

భవిష్యత్తులో ఆక్రమణలకు అడ్డుకట్ట

భారీ జేసీబీలతో రంగంలోకి దిగిన సిబ్బంది.. ప్రీకాస్ట్ వాల్స్‌తో పాటు తాత్కాలికంగా వేసిన షెడ్లను పూర్తిగా నేలమట్టం చేశారు. భవిష్యత్తులో మళ్లీ కబ్జాలకు ఆస్కారం లేకుండా భూమి చుట్టూ ఇనుప ఫెన్సింగ్ వేశారు. అంతేకాకుండా… అదంతా ప్రభుత్వ భూమి అని హెచ్చరిస్తూ స్పష్టమైన బోర్డులను అక్కడ ఏర్పాటు చేశారు.

హైడ్రా చేపట్టిన ఈ ఆపరేషన్ ప్రభుత్వ భూముల ఆక్రమణదారులకు గట్టి హెచ్చరిక. మానవతా దృక్పథంతో వ్యవహరిస్తూనే, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో హైడ్రా నిబద్ధత ప్రశంసనీయం. ఇలాంటి చర్యలు భవిష్యత్తులో కబ్జాలను అరికట్టగలవు.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.