|

Andhravilas.net – Breaking News & Movie Buzz Since 2002

IFFI 2025: దేశం మొత్తం మీద ఒక్క మహిళ కూడా కనిపించలేదా!

Published: 12-11-2025, 9:10 AM
IFFI 2025: దేశం మొత్తం మీద ఒక్క మహిళ కూడా కనిపించలేదా!

IFFI 2025 ఇండియన్ పనోరమా జ్యూరీ సభ్యుల ప్రకటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. ఈ ప్యానెల్‌లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు.

Key Points

1

IFFI 2025 ఇండియన్ పనోరమా జ్యూరీ సభ్యుల ప్రకటన వివాదాస్పదంగా మారింది.

2

జ్యూరీ ప్యానెల్‌లో ఒక్క మహిళకు కూడా చోటు దక్కకపోవడంపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.

4

కొంకణి షార్ట్ ఫిల్మ్ 'ఆన్సెస్సావో'ను ప్రదర్శనకు ఎంపిక చేయకపోవడంపై కూడా అభ్యంతరాలు.

IFFI 2025 ఇండియన్ పనోరమా జ్యూరీ ప్రకటన

‘ఇఫీ’ (ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ ఆఫ్‌ ఇండియా) 56వ ఎడిషన్‌ ఈ నెల 20 నుంచి 28 వరకు గోవాలో జరగనున్న సంగతి తెలిసిందే. దాదాపు 80 దేశాలకు చెందిన 240 చిత్రాలు ఈ చిత్రోత్సవాల్లో ప్రదర్శితం కానున్నాయి. ఈ వేడుకలకు ప్రముఖ ఫిల్మ్‌ మేకర్‌ శేఖర్‌ కపూర్‌ డైరెక్టర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. కాగా ‘ఇఫీ’(IFFI 2025)లోని ఇండియన్‌ పనోరమా(Indian Panorama) సెక్షన్‌ జ్యూరీ చైర్మన్‌గా దర్శక–నిర్మాత–నటుడు రాజ్‌ బుందేలా నియమితులయ్యారు.

తాజాగా ఈ విభాగానికి సంబంధించిన జ్యూరీ సభ్యులను అధికారికంగా ప్రకటించారు. కృష్ణ హెబ్బాళే, కమలేష్‌ కె. మిశ్రా, మలయ్‌ రే, సుభాష్‌ సెహ్‌గల్, అరుణ్‌ భక్షి, అసీమ్‌ సిన్హా, అశోక్‌ శరణ్, సుకుమార్‌ జతానియా, బీఎస్‌ బసవరాజు, అమరేష్‌ చక్రవర్తి, నెపోలియన్‌ థంగా, జడుమోని దత్తా జ్యూరీ సభ్యులుగా ఉన్నారు. అయితే ఈ ప్యానెల్‌లో మహిళలకు చోటు దక్కకపోవడంతో విమర్శలు వస్తున్నాయి.

మహిళలకు చోటు లేకపోవడంపై నెటిజన్ల విమర్శలు

‘జ్యూరీలో మహిళలకు చోటు లేదనే విషయం స్పష్టంగా తెలుస్తోంది’, ‘ఉమెన్‌ జ్యూరీ అంటూ ప్రత్యేకమైన పోస్ట్‌ ఏమైనా ఉందా?’ (వ్యంగ్యంగా..), ‘మహిళల కోసం మహిళలు నటించిన సినిమాలను ఎంపిక చేసేందుకు అందరూ మహిళలే ఉండేలా ప్రత్యేకమైన జ్యూరీ ఏదైనా ఉందా?’, ‘జ్యూరీలో భాగం చేయడానికి దేశం మొత్తం మీద మీకు ఒక్క మహిళ కూడా కనిపించలేదా?’ అంటూ… సోషల్‌ మీడియా వేదికగా నెటిజన్లు స్పందిస్తున్నారు.

కొంకణి చిత్రాలకు అన్యాయంపై అభ్యంతరాలు

మరోవైపు… లోకల్‌ టాలెంట్‌ని ప్రోత్సహించడం లేదంటూ కొంకణి దర్శక–రచయిత ఎస్‌. లక్ష్మీకాంత్‌ ‘ఇఫీ’ వైఖరిని తప్పుపట్టారు. పలు అవార్డులు, రివార్డులు పొందిన కొంకణి షార్ట్‌ ఫిల్మ్‌ ‘ఆన్సెస్సావో’ని ప్రదర్శనకు ఎంపిక చేయకపోవడాన్ని ఆయన విమర్శించారు. ఇక ఇండియన్‌ పనోరమా విభాగంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ (తెలుగు), ‘అమరన్‌’ (తమిళం), ‘తుడరుమ్‌’ (మలయాళం) ‘సు ఫ్రమ్‌ సో’ (కన్నడ), గ్రౌండ్‌ జీరో, తన్వి ది గ్రేట్, ఛావా, ది బెంగాలీ ఫైల్స్‌ (హిందీ)..’ వంటి చిత్రాలతో ΄ాటు పలు భాషలకు చెందిన దాదాపు ముప్పై చిత్రాలు పోటీ పడుతున్నాయి.

మొత్తంగా IFFI 2025 జ్యూరీ ఎంపిక పలు వర్గాల నుంచి తీవ్ర విమర్శలను ఎదుర్కొంటోంది. మహిళలకు ప్రాతినిధ్యం కల్పించకపోవడం, స్థానిక ప్రతిభను విస్మరించడం వంటి అంశాలపై నిర్వాహకులు స్పందించాల్సిన అవసరం ఉంది.

Related News

Plugin developed by ProSEOBlogger
Plugin developed by ProSEOBlogger. Get free Ypl themes.