
📌 Key Points
- ఖమేనీ మరణంతో ఇరాన్ బలహీనపడింది.
- ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యా సహాయం చేయలేకపోతోంది.
- అమెరికా ఆంక్షల భయంతో చైనా వెనుకడుగు వేసింది.
- ఇజ్రాయెల్ దాడులను ఆపేందుకు సిద్ధంగా లేదు.
ఇరాన్ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటోంది. అమెరికా, ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ కోలుకోలేని స్థితికి చేరుకుంది. ఈ సమయంలో మిత్ర దేశాలు అండగా నిలబడకపోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఇరాన్ ఒంటరి పోరాటానికి కారణం?
దశాబ్దాల పాటు పశ్చిమ దేశాల కళ్లలో కారం కొడుతూ.. మధ్య ప్రాచ్యంలో ఒక తిరుగులేని శక్తిగా ఎదిగిన ఇరాన్ నేడు ఉనికి కోసం పోరాడుతున్నది. మొదటినుంచి అంతర్జాతీయ రాజకీయాల్లో ఇరాన్ రెండు అంశాలపై ఆధారపడింది. ఒకటి తన వద్ద ఉన్నఅపార మైన క్షిపణి సంపత్తి.. రెండోది అగ్రరాజ్యాలైన రష్యా, చైనాల వెన్నుదన్ను..
కానీ, ఎవరూ ఊహించని విధంగా అమెరికా, ఇజ్రాయెల్ దాడి చేయడం.. సుప్రీం లీడర్ ఖమేనీ నేలకొరగడంతో ఇరాన్ కోలుకోలేని విధంగా దెబ్బతింది. ఆ దేశంపై వైమానిక దాడులు జరుగుతున్నా.. ఇరాన్ మిత్ర దేశాలు మౌనంగా ఉండటం.. ఇరాన్ ప్రజలనే కాదు ప్రపంచాన్నే ఆశ్చర్యపరుస్తోంది. రష్యా, చైనాతో పాటు మిత్ర దేశమైన భారత్ కూడా మౌనంగా ఉండటానికి కారణాలు ఏంటి?
ఉక్రెయిన్ యుద్ధంలో చిక్కుకున్న రష్యాకు ఇరాన్ డ్రోన్లు, క్షిపణులు సరఫరా చేసిన మాట వాస్తవం. ఇప్పుడు ఇరాన్ కష్టాల్లో ఉన్నా.. రష్యా నేరుగా రంగంలోకి దిగడం లేదు. దీనికి ప్రధాన కారణం, ఇజ్రాయెల్‌తో రష్యాకు ఉన్న రహస్య దౌత్య సంబంధాలు.. సిరియాలో రష్యా ప్రయోజనాలు దెబ్బతినకుండా ఉండాలంటే ఇజ్రాయెల్ మద్దతు అవసరం. అందుకే పుతిన్ ‘మధ్యవర్తి’ పాత్ర పోషిస్తున్నారే తప్ప, ఇరాన్ తరపున యుద్ధం చేయడం లేదు. యుద్ధం మొదటిరోజు చేసిన గంభీర ప్రకటనలు కాస్తా మూడు, నాలుగు రోజులకు మధ్యవర్తి పాత్రకు పరిమితమయ్యాయి. రష్యా అధ్యక్షుడు పుతిన్, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యూహుతో యుద్ధం వల్ల జరుగుతున్న నష్టాలపై వివరించినా.. ఇజ్రాయెల్ మాత్రం ఇరాన్‌లో చివరి క్షిపణిని ధ్వంసం చేయడంతో పాటు హౌతి, హెజ్బొల్లాలను నిర్వీర్యం చేసే వరకు దాడులు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. దీంతో ఈ యుద్ధం ఏప్రిల్ నెల మధ్య వరకు ఆగేలా లేదు.
రష్యా వ్యూహం ఏమిటి?
చైనాకు ఇరాన్ ఒక చౌక చమురు వనరు మాత్రమే.. ఇరాన్‌తో 25 ఏళ్ల ఒప్పందం చేసుకున్నప్పటికీ, అమెరికా తో నేరుగా సైనిక ఘర్షణకు దిగడం చైనాకు ఇష్టం లేదు.. చైనా ఆర్థిక వ్యవస్థ ప్రస్తుతం ఒడిదుడుకుల్లో ఉంది. అమెరికా ఆంక్షలకు భయపడి, చైనా బ్యాంకులు ఇరాన్‌తో లావాదేవీలను నిలిపివేస్తున్నాయి. చైనా ఇరాన్ విషయంలో ఒక్క అడుగు ముందుకు వేసినా.. ప్రపంచవ్యాప్తంగా చైనా ఆస్తులను సీజ్ చేసేందుకు అమెరికాకు తాళం ఇచ్చినట్టు అవుతుంది. ఇరాన్ సార్వభౌమాధికారాన్ని, దేశ భద్రతకు భంగం కలిగించడాన్ని తాము సహించమని మొదటిరోజు చేసిన తీవ్రమైన ప్రకటన కాస్తా మూడు, నాలుగు రోజులకే చల్లబడింది. అయితే, అమెరికా మాత్రం చైనా రంగంలోకి దిగితే ఎక్కడ పరిస్థితి మారుతుందోనన్న భయంతో అఫ్గాన్ – పాక్ యుద్ధానికి తెర లేపింది. ఎందుకంటే చైనా ఇరాన్ సరిహద్దుల మధ్య అఫ్గాన్, పాక్ దేశాలు ఉంటాయి. ఆయుధాలు, ఇతర సామగ్రి సరఫరా చేసేందుకు సముద్ర జలాలు అంత సురక్షితం కాకపోవడంతో రోడ్డు మార్గాన చేరే వేసే అవకాశం ఉంటుంది. అందుకే అమెరికా ఇరాన్ యుద్ధానికి ముందు అఫ్గాన్, పాక్ మధ్య ఘర్షణ వాతా వరణం సృష్టించింది.
భారత్‌కు అటు ఇజ్రాయెల్ అత్యంత సన్నిహిత రక్షణ మిత్రుడు, ఇటు ఇరాన్ చారిత్రక.. వ్యూహాత్మక భాగస్వామి. ఉగ్రవాద వ్యతిరేక పోరాటంతో పాటు సాంకేతిక పరిజ్ఞానం విషయంలో భారత్ ఇజ్రాయెల్‌కు మద్దతుగా ఉంటుంది. మరోవైపు ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవు భారత్‌కు ఇరాన్ ద్వారా ఆఫ్ఘనిస్తాన్, రష్యాకు దారిని ఇస్తుంది. అందుకే భారత్ ఇరాన్ యుద్ధం విషయంలో వ్యూహాత్మక మౌనాన్ని పాటిస్తున్నది. ఇప్పుడు భారత్‌కు అన్నింటికంటే ముఖ్యమైనది.. ఇండియా మిడిల్ ఈస్ట్, యూరప్ ఎకనామిక్ కారిడార్ (ఐఎంఈసీ). ఇది భారత్ కలల ప్రాజెక్టు.. ఇది పూర్తయితే మిడిల్ ఈస్ట్ దేశాలతో పాటు యూరప్ వరకు భారత్ తన వ్యాపారాన్ని విస్తరిస్తుంది. ఇది ఇజ్రాయెల్ మీదుగా కొనసాగుతుండటంతో ఆ దేశం పూర్తి మద్దతు అవసరం ఉన్నది. అందుకే భారత్ ఇప్పటివరకు ఏ పక్షం వహించకుండా, ‘చర్చల ద్వారానే పరిష్కారం’ అని చెప్తూ వస్తున్నది. యుద్ధం వల్ల సమీకరణాలు మారితే ఈ ప్రాజెక్ట్ ఆగిపోయే ప్రమాదం ఉంది. ఈ కారిడార్‌ను కాపాడుకోవడానికి అమెరికా, సౌదీ అరేబియాతో భారత్ కలిసి పని చేయాల్సి ఉంటుంది.
చైనా ఎందుకు మౌనంగా ఉంది?
మరోవైపు యుద్ధం తర్వాత ఇరాన్‌లో పాలన గాడితప్పి.. చైనాపై ఆ దేశం ఆధారపడినా భారత్ కలలకు గండిపడే అవకాశం ఉన్నది. అందుకే ఈ వ్యవహారాన్ని భారత్ అత్యంత సున్నితమైన అంశంగా భావిస్తున్నది. మార్చి మూడో వారంలో లేదా ఏప్రిల్ మొదటి వారంలో భారత్ ఇజ్రాయెల్, ఇరాన్ మధ్య మధ్యవర్తి పాత్ర పోషించే అవ కాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అందుకే గురువారం ఇరాన్ హార్ముజ్ జలసంధి నుంచి భారత్, చైనాలకు చమురు సరఫరాకు అంగీకరించింది. ఇరాన్ విషయంలో భారత్ మిత్ర ధర్మం పాటించక పోవడానికి మరో ముఖ్యమైన కారణం.. అరబ్ దేశాల్లో ప్రవాస భారతీయులు. వీరు దాదాపు 90 లక్షల మంది ఉన్నారు. యుద్ధంలో ఒకవైపు నిలబడితే వారందరి జీవనోపాధిని ఫణంగా పెట్టడమే అవుతుంది. ఒక్క రాజకీయ నిర్ణయం కోటి మంది కుటుంబాల్లో కల్లోలం రేపే ప్రమాదం ఉన్నది.
భారత్‌కు మిత్రదేశం ఏది? అని దేశంలో ఎవరిని అడిగినా ముందుగా రష్యా అనే చెప్తారు. కానీ, ఇదంతా ఒకప్పటి మాట.. ఇప్పుడు ఏ దేశమైనా సొంత కాళ్లపై నిలబడాల్సిందే.. సొంత కండబలంతో శత్రువుకు బుద్ధి చెప్పా ల్సిందే. కష్టకాలంలో ఎవరో వస్తారని ఎదురు చూసే రోజు లు ఇప్పుడు కావని అర్థం చేసుకోవాలి. అగ్రరాజ్యాల నీడలో ఎదిగే శక్తులు, తుఫాను వచ్చినప్పుడు ఆ నీడ మాయమ వుతుందని గ్రహించాలి. ఇరాన్ యుద్ధం ముగింపు ఎలా ఉన్నా, ‘అంతర్జాతీయ స్నేహం’ అనే మాటకు ఇప్పుడు అర్థం పూర్తిగా మారిపోయింది. మూడో ప్రపంచ దేశాలన్నీ ఈ పరిమాణాలను ఓ గుణపాఠంలా తీసుకోవాలి.
మిత్ర దేశాల మౌనం ఇరాన్‌ను మరింత బలహీనపరిచే అవకాశం ఉంది. అయితే, భవిష్యత్తులో పరిస్థితులు ఎలా మారుతాయో వేచి చూడాలి. ప్రస్తుతానికి ఇరాన్ ఒంటరి పోరాటం చేస్తుంది.


