
హిందూ ధర్మంలో జపమాలకు ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది. 108 పూసలున్న జపమాలతో మంత్రాలు, స్తోత్రాలు జపించడం వల్ల ఆధ్యాత్మిక ప్రయోజనాలు లభిస్తాయని నమ్ముతారు. ఈ కథనంలో జపమాల విశిష్టత, జపం చేసే విధానం గురించి తెలుసుకుందాం.
Key Points
108 పూసల జపమాలకు ఆధ్యాత్మిక, జ్యోతిష్య ప్రాముఖ్యత.
జపమాలతో జపం చేయడం వల్ల లభించే ప్రయోజనాలు.
వివిధ రకాల జపమాలలు మరియు వాటి ప్రభావం.
జపమాల తయారీ, ఉపయోగం గురించి సూచనలు.
జపమాల యొక్క ఆధ్యాత్మిక ప్రాముఖ్యత
హిందూ ధర్మంలో పూజల సమయంలో, శ్లోకాలు, మంత్రాలు చదివేటప్పుడు ఉపయోగించే పవిత్రమాల జపమాల. 108 పూసలుండే జపమాలలో అనేక అంశాలు ఇమిడి ఉన్నాయి. 108ని అదృష్ట సంఖ్యగా భావిస్తారు. హిందూ ధర్మశాస్త్ర ప్రకారం 108 సార్లు ఏదైనా స్తోత్రాన్ని చదవాలని చెబుతారు. 108 సార్లు కొలిస్తే దేవుడి కరుణ ఉంటుందని అంటారు. దానికి అనుగుణంగా 108 పూసలను నిర్ధారించారని ప్రచారంలో ఉందని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒక వ్యక్తి 24 గంటలలో 21,600 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే 12 గంటల్లో 10,800 సార్లు శ్వాస తీసుకుంటాడు. అంటే ఒక మనిషి దేవుడి స్మరణలో జపమాల చేసేటప్పుడు 10,800 సార్లు చేయడం కష్టం, కాబట్టి చివరి రెండు సున్నాలను తీసేసి 108గా నిర్ధారించారని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మొత్తం 12 రాశులున్నాయి. వీటితో తొమ్మిది గ్రహాలున్నాయి. రాశుల సంఖ్యను గ్రహాల తో గుణిస్తే వచ్చేది 108. అందుకే జపమాలలో 108 పూసలను నిర్ధారించారట. ఈ 108 పూసలు మొత్తం విశ్వానికి ప్రాతినిధ్యం వహిస్తాయట. జ్యోతిష్య శాస్త్రంలో 27 నక్షత్రాలుంటాయి. ఒక్కో నక్షత్రానికి 4 పాదాలుంటాయి. అంటే 27 నక్షత్రాలకు కలిపి మొత్తం 108 పాదాలవుతాయి. జపమాలలోని ఒక్కో పూస ఒక్కో పాదానికి ప్రాతినిధ్యం వహిస్తుందట అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒక మంత్రాన్ని జపించేందుకు జపమాల ముఖ్యం. జపమాల ఉపయోగించడం వలన మనం చేసే జప సంఖ్య తెలుస్తుంది. జపసంఖ్య తెలియకుండా చేసే జపము వ్యర్థము. దాని ఫలితం రాక్షసులకు పోతుందంటారు. జపమాలను హృదయమాల అని కూడా అంటారు. జపమాల రక్షణకు, సిద్ధికి ముఖ్యము. జపమాల లేకుండా ఎనికోట్ల సార్లు జపం చేసినా వ్యర్థము. 108 లెక్కకు వచ్చే మాల పూర్ణమాల, 54 లెక్కకు వచ్చేది అర్ధమాల, 27 లెక్కకు వచ్చేది అధమమాల అని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
మధ్యన ముల్లు లేని దారంతో మూడు మడతలతో పీని యజ్ఞోపవీతమునకు పురి వేసినట్లు, మూడు పేటలలో వేసిన దారమునకే ఇచ్చినది మంచిది. లేదంటే స్వయంగా చేసుకోవచ్చు. మాలకు మణులను గుచ్చేటప్పుడు, తాను ఏ మంత్రము జపించవలెనని అనుకుంటున్నాడో, దానినే పలుకుతూ ఆ మణులను బంధించవలెను. దీనిని శ్రీచక్రం పైన గాని, గాయత్రి వద్ద ఉంచి గాని, ప్రాణ ప్రతిష్ఠ 108 సార్లు చేసి, గురువుకి ఇచ్చి 108 సార్లు వారు జపం చేసి ఇచ్చిన తరువాత తాను వాడవలెను. దీని వలన సర్వసిద్ధి కలుగుతుంది.
జపమాలను దేహమునందు ధరించక, క్రింద ఉంచక, దేవత వద్దనే ఉంచవలెను. దీనిని జపము చేయునప్పుడు ‘గోములము’ వంటి సంచిలో ఉంచుకుని, చేతికి తగిలించుకుని, హృదయమునకు ఆనించుకుని, మాల లోపలికి చుట్టి వస్తున్నట్లుగా జపించవలెను. జపించు సమయంలో మాలను చూచే వారికి జప ఫలితం దక్కును. కాబట్టి జపము చేసే సందర్భంలో మాలపై గోముఖం లేదా వస్త్రమును కప్పివేయవలెను. జపమాల లోపల తిరిగినచో జప ఫలితం తనకే వస్తుంది, బయట తిరిగినచో ఆ మాలను చూసిన వారికి ఫలితం దక్కుతుందని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
జపము చేయునప్పుడు ఏ వ్రేళ్లకు ఏమి ఫలమో ఆ విధంగా చేయాలి. ఉంగరపు వ్రేళ్లు బొటన వ్రేలితో కలిసి మాలను పుచ్చుకుని జపించవలెను. ఇతర వ్రేళ్లకు సంబంధం ఉండకూడదు. ఉత్తమకర్మ సిద్ధి అగును. బొటనవ్రేలు, మధ్యవ్రేలు మంత్రసిద్ధి. చూపుడు వ్రేలు ఉచ్ఛారణ కొరకు కనిష్ఠం, అంగుష్టము మరణము. చూపుడు వ్రేలు శత్రు నాశనము. మధ్యవ్రేలు రోగహరి. ఉంగరపు వ్రేలు పుష్టి. కనిష్ఠం రక్షణ. అంగుష్టము మోక్షమును ఇస్తుంది.
జపం చేసే సరైన విధానం
జపము చేయడానికి సూర్యోదయం నుంచి తిరిగి సూర్యోదయం వరకు అహోరాత్రిని 6 భాగాలుగా చేయాలి. 24 గంటలలో ఒక భాగం 4 గంటలు. వీటిని ఋతువులు అంటారు. ఏ కర్మ చేయాలనుకుంటే, ఆ కర్మకి సంబంధించిన ఋతువులోనే జపము చేయాలి. మంచి విషయాల కోసం సదా జపము చేయవచ్చునని ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, పంచాంగకర్త బ్రహ్మశ్రీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు. కొన్ని క్రియలకు సంబంధించిన జప సమయమూ, జప పద్ధతీ రహస్యంగా ఉంచవలెనని చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ తెలిపారు.
ఒక్కొక్క మాల, ఒక్కొక్క ఫలితం:
రుద్రాక్షమాల: ధర్మార్థ, కామ, మోక్షములను ఇస్తుంది.
పద్మమాలిక: సర్వాభీష్ట సిద్ధి.
పుత్రజీవి మాల: (ఎరుపు దారం ఉండాలి) సంతానం.
ఊరిక గింజల మాల: జ్వరశాంతి.
పసుపు కొమ్ముల మాల: బగళా మంత్రం, నవదుర్గాది జపించినప్పుడు స్తంభన ఆగుతుంది.
వివిధ రకాల జపమాలలు మరియు వాటి ప్రయోజనాలు
దుంబర మూలికామాల: సర్వసిద్ధి.
తాని మాల: దారిద్ర్య నివారణ, శత్రువులు పారిపోవడానికి 10 వేల జపం చేయాలి.
హృదయమాల: శీఘ్ర మంత్రసిద్ధి, మణులతో చేసిన మాల సామ్రాజ్యాన్ని ఇస్తుంది.
స్పటిక మాల : సర్వకోరికలు నెరవేరుట.
పద్మబీజముల మాల: లక్ష్మీకరం, కీర్తికరం.
రక్తచందన మాల: వశీకరణం, భోగం కలుగజేస్తుంది.
జపమాలతో సక్రమంగా జపం చేయడం వల్ల ఆధ్యాత్మిక ప్రగతి, మానసిక శాంతి లభిస్తాయి. శ్రద్ధ, భక్తితో చేసే జపం ఎంతో ఫలవంతమవుతుంది.


