
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య రెవెన్యూ షేరింగ్ విషయంలో పెద్ద ఎత్తున వివాదం నడుస్తున్న విషయం తెలిసిందే. నిన్న ఎస్‌వీసీ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వం టికెట్ ధరలను పెంచుకునేందుకు అనుమతి ఇచ్చినా కూడా తాము సింగిల్ స్క్రీన్ థియేటర్లలో టికెట్ ధరలను పెంచబోమని స్పష్టం చేశారు. దీనిపై మైత్రి రవిశంకర్ స్పందిస్తూ.. గతంలో వార్ 2, అఖండ 2, కూలీ వంటి భారీ సినిమాలు వచ్చినప్పుడు ఎగ్జిబిటర్ల కష్టాల గురించి ఎందుకు ఆలోచించలేదని ప్రశ్నించారు.
ఇప్పుడు వారి చేతిలో పెద్ద సినిమాలు లేకపోవడంతోనే సడన్‌గా ఈ అంశాన్ని ముందుకు తెస్తున్నారని అన్నారు. అలాగే సింగిల్ స్క్రీన్ థియేటర్లను అద్భుతంగా అభివృద్ధి చేస్తే ప్రేక్షకులు తప్పకుండా థియేటర్లకు వస్తారని చెప్పారు. మొదట విమల్ థియేటర్‌కు పెద్దగా ప్రేక్షకులు వచ్చేవారు కాదని, కానీ కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఆ థియేటర్‌ను డెవలప్ చేసిన తర్వాత ఇప్పుడు భారీగా జనాలు వస్తున్నారని వివరించారు. ఇక ఈ సమావేశంలో నాగ వంశీ కూడా గట్టిగానే స్పందించారు. ప్రస్తుతం ఇండస్ట్రీ చాలా కష్టాల్లో ఉందని, సంక్రాంతి సీజన్ తర్వాత పెద్దగా ఏ సినిమాకు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదని అన్నారు.
త్వరలో విడుదల కాబోతున్న పెద్ది సినిమాకు మంచి కలెక్షన్లు రావాలని ఇండస్ట్రీ మొత్తం కోరుకుంటోందని తెలిపారు. అలాగే ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడానికి ప్రధాన కారణం టికెట్ ధరలు 50 లేదా 100 రూపాయలు పెరగడం కాదని, పాప్కార్న్ మరియు కూల్ డ్రింక్స్ ధరలు అధికంగా ఉండటమేనని నాగ వంశీ వ్యాఖ్యానించారు. వాటి ధరలను తగ్గిస్తే సాధారణ ప్రేక్షకులు మళ్లీ థియేటర్లకు వస్తారని చెప్పారు. మొత్తంగా ప్రస్తుతం తెలుగు సినిమా పరిశ్రమలో నిర్మాతలు మరియు ఎగ్జిబిటర్ల మధ్య వివాదం తీవ్ర స్థాయిలో కొనసాగుతోంది.


