
యంగ్ హీరో కిరణ్ అబ్బవరం నటించిన ‘కే ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద అనూహ్య విజయం సాధించింది. చిన్న సినిమాగా విడుదలైనప్పటికీ, దీపావళి సీజన్‌లో భారీ వసూళ్లను రాబట్టింది. ఈ యాక్షన్, కామెడీ, ఎమోషనల్ డ్రామా ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. ఇప్పుడు దీని ఓటీటీ విడుదల తేదీ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
Key Points
కిరణ్ అబ్బవరం 'కే ర్యాంప్' బాక్సాఫీస్ వద్ద చిన్న సినిమాగా ఘన విజయం సాధించింది.
అక్టోబర్ 18న విడుదలైన ఈ చిత్రం దీపావళి సీజన్‌ను బాగా వాడుకుంది, యూత్‌లో మంచి క్రేజ్ సంపాదించుకుంది.
మొదటి వారంలో రూ. 11.68 కోట్ల గ్రాస్, 9 రోజుల్లో రూ. 19.5 కోట్ల గ్రాస్ వసూలు చేసింది.
ప్రపంచవ్యాప్తంగా 9 రోజుల్లో రూ. 23 కోట్ల గ్రాస్‌ను దాటి, ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.
కే ర్యాంప్ బాక్సాఫీస్ వద్ద ఘన విజయం
టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం తాజా మూవీ కే ర్యాంప్. చిన్న సినిమాగా రిలీజ్ అయ్యి.. బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సాధించింది మూవీ. డిఫరెంట్ స్టోరీలను ఎంచుకుంటూ ప్రేక్షకుల మనసులు దోచుకుంటున్న కిరణ్ అబ్బవరం.. ఈసారి కూడా అదే కాన్సెప్ట్ తో హిట్ కొట్టాడు. అక్టోబర్ 18న విడుదలైన ఈ సినిమాతో మరోసారి తన మార్క్ చూపించారు. మొదటి రోజు నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న కే ర్యాంప్ మూవీ.. దీపావళి సీజన్ ను బాగా వాడేసుకుంది. అంతే కాదు యూత్ లో కిరణ్ కు, ఈ సినిమాకు ఉన్న క్రేజ్.. మౌత్ పబ్లిసిటీ ఈసినిమా వసూళ్లకు కారణం అయ్యింది.
యాక్షన్, కామెడీ, ఎమోషన్ డ్రామాగా తెరకెక్కిన ఈసినిమాను జైన్స్ నాని అనే యంగ్ డైరెక్టర్ తెరకెక్కించారు. మొదటి సినిమా అయినా..అతని దర్శకత్వం ప్రేక్షకులను ఆకట్టుకుంది. కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తారేజ హీరోయిన్‌గా నటించగా, నరేష్, సాయికుమార్, వెన్నెల కిషోర్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించారు. వీరి నటన సినిమాకు మరింత బలం చేకూర్చింది సినిమాకు హోమ్లీ లుక్ ను అందించింది. హాస్య మూవీస్, రుద్రాన్ష్ సెల్యూలాయిడ్స్ బ్యానర్లపై రాజేష్ దండా, బాలాజీ గుత్తా, శివాజీ బొమ్మక్ లు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు.
మొదటి వారం, వీకెండ్ కలెక్షన్ల రికార్డు
ట్రేడ్ వర్గాల సమాచారం ప్రకారం, “కే ర్యాంప్” సినిమా సుమారు 4 కోట్ల బడ్జెట్‌తో నిర్మించబడింది. ప్రీ-రిలీజ్ బిజినెస్ అద్భుతంగా జరిగింది మొత్తం థియేట్రికల్ బిజినెస్ 8.15 కోట్ల వరకు జరిగిందని సమాచారం. లాభాల్లోకి రావాలంటే కనీసం 9 కోట్ల షేర్ సుమారు రూ. 18 కోట్ల గ్రాస్ అవసరం. ఇక ఈసినిమా కలెక్షన్స్ విషయానికి వస్తే. కే ర్యాంప్ మొదటి రోజు 2.1 కోట్ల నెట్, 2.8–4.5 కోట్ల గ్రాస్ సాధించింది. రెండో రోజు 2.85 కోట్లు, మూడో రోజు 2.35 కోట్లు, నాలుగో రోజు 1.85 కోట్లు, ఐదో రోజు 1.3 కోట్లు, ఆరవ రోజు 1 కోటి, ఏడవ రోజు 88 లక్షలు వసూలు చేసింది. దీంతో తొలి వారం ఇండియా వైడ్ గ్రాస్ 11.68 కోట్లు చేరింది.
ఇక కే ర్యాంప్ సినిమాకు వీకెండ్ బాగా కలిసి వచ్చింది. ఎనిమిదో రోజు 3.32 కోట్లు, తొమ్మిదో రోజు 3.5 కోట్లు వసూలు చేసింది సినిమా. మొత్తం తొమ్మిది రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ 19.5 కోట్లు, వరల్డ్‌వైడ్‌గా 23 కోట్లు చేరినట్లు సమాచారం. ఇక 10వ రోజు వర్కింగ్ డే కావడంతో వసూళ్లు కొంత తగ్గినా, ఆ రోజు గ్రాస్ సుమారు 1 కోటి రూపాయల వసూళ్లు నమోదయ్యే అవకాశం ఉంది. ఈ లెక్కల ప్రకారం 10 రోజుల్లో ఇండియా వైడ్ గ్రాస్ 20–20.5 కోట్లు, వరల్డ్‌వైడ్ గ్రాస్ 25 కోట్లు దాటే అవకాశముందని అంచనా.
ఓటీటీ రిలీజ్ డేట్ ఎప్పుడో తెలుసా?
మరోవైపు, నిర్మాతల లెక్కల ప్రకారం “కే ర్యాంప్” కేవలం మూడు రోజుల్లోనే 17.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి బ్రేక్ ఈవెన్ సాధించిందని, ఏడు రోజుల్లోనే 28 కోట్ల వరల్డ్‌వైడ్ గ్రాస్ సాధించిందని నిర్మాతలు వెల్లడించారు. మొత్తానికి, కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమా.. ఆయన కెరీర్‌లో అత్యధిక వసూళ్లు సాధించిన మూవీగా నిలిచింది.
ఇక ఈమూవీని ఓటీటీలో చూడాలని చాలామంది అభిమానులు ఎదురు చూస్తున్నారు. అయితే కే ర్యాంప్ మూవీ ఓటీటీ డేట్ ఇంకా ఫిక్స్ అవ్వలేదు. నాలుగు వారాల తరువాతే ఈ సినిమా డిజిటల్ ప్లాట్ ఫామ్ లో సందడి చేసే అవకాశం ఉంది. అయితే ఈసినిమా ఓటీటీ ప్లాట్ ఫామ్ మాత్రం ఫిక్స్ అయినట్టు తెలుస్తోంది. ఈసినిమాను ఆహా వారు కొనుగోలు చేసినట్టు సమాచారం. నవంబర్ మూడో వారంలో ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.
మొత్తం మీద ‘కే ర్యాంప్’ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయంతో నిరూపించుకుంది. కిరణ్ అబ్బవరం కెరీర్‌లో మరో హిట్‌గా నిలిచిన ఈ సినిమా ఓటీటీలో ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో చూడాలి.


