
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరి హర వీరమల్లు సినిమా బెంగళూరులో వివాదాస్పదంగా మారింది. కన్నడ కార్యకర్తలు సినిమా పోస్టర్లను చింపేయడంతో థియేటర్ వద్ద ఉద్రిక్తత ఏర్పడింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
Key Points
బెంగళూరులోని థియేటర్ వద్ద హరి హర వీరమల్లు సినిమా పోస్టర్లను కన్నడ కార్యకర్తలు చింపేశారు.
పవన్ కల్యాణ్ ఫొటోతో ఉన్న భారీ బ్యానర్‌ను పీకేశారు.
కన్నడ భాష లేకపోవడంతో కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
పవన్ కల్యాణ్ అభిమానులతో కన్నడ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది.
కన్నడ కార్యకర్తల ఆగ్రహం
పవర్ స్టార్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ సినిమా హరి హర వీరమల్లు. క్రిష్ జాగర్లమూడి, ఏఎమ్ జ్యోతి కృష్ణ దర్శకత్వం వహించిన హరి హర వీరమల్లు ఇవాళ (జూలై 24) వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అయింది.
ఇండియాలోని అనేక రాష్ట్రాల్లో హరి హర వీరమల్లు సినిమాను ప్రదర్శిస్తున్నారు. అయితే, బెంగళూరులోని ఓ థియేటర్‌లోకి చొరబడిన కన్నడ కార్యకర్తలు హరి హర వీరమల్లు సినిమా పోస్టర్లను చింపేశారు. పవన్ కల్యాణ్ ఫొటోతో ఉన్న భారీ బ్యానర్‌ను కన్నడ కార్యకర్తలు పీకేశారు.
సభాస్థలిలో ప్రదర్శించిన ప్రచార సామగ్రిపై కన్నడ భాష లేకపోవడంతో వారు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. కర్ణాటకలో సినిమాను రిలీజ్ చేస్తూ కన్నడ భాష లేకపోవడం ఏంటీ అని ఆగ్రహించారు. అక్కడే ఉన్న పవన్ కల్యాణ్ అభిమానులతో కన్నడ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో ఆ థియేటర్ వద్ద ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.
థియేటర్ వద్ద ఉద్రిక్తత
ఆ థియేటర్‌లో పవన్ కల్యాణ్ అభిమానులు భారీ ఫ్లెక్సీలు, బ్యానర్స్, పోస్టర్స్ ఏర్పాటు చేశారు. కర్ణాటకలో, ముఖ్యంగా బెంగళూరులో అన్ని సినిమా పోస్టర్లలో కన్నడను చేర్చడం తప్పనిసరి అని ఉద్యమకారులు వాదించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఆ వీడియోలో ‘ఈ నగరంలో పోస్టర్లు వేయాలంటే కన్నడను తప్పనిసరిగా చేర్చాలి’ అని కన్నడ ఉద్యమకారులు స్పష్టం చేశారు. దీంతో భాషపై మరోసారి చర్చ మొదలైంది. కర్ణాటకలో కన్నడకు ప్రాధాన్యమివ్వాలని ఆన్‌లైన్‌లో కొందరు యూజర్స్ ఉద్యమకారులకు మద్దతు పలికారు.
వైరల్ వీడియో
‘కార్యకర్తలు మంచి పని చేశారు. కర్ణాటకలో కన్నడ పోస్టర్లు వేయాలి. బెంగళూరులో తెలుగు ప్రభావం పెరుగుతోందని, ఆంధ్రా, తెలంగాణకు చెందిన చాలా మంది కన్నడ నేర్చుకోవడానికి కూడా ఆసక్తి చూపడం లేదని ఓ నెటిజన్ కామెంట్ చేశారు. అయితే, కార్యకర్తలు అనవసర విభజన సృష్టిస్తున్నారని ఆరోపిస్తూ మరికొందరు కామెంట్స్ చేశారు.
థియేటర్‌లో ఉన్నానని చెప్పుకున్న ఓ వ్యక్తి ‘నేను కన్నడిగుడిని. నేను అక్కడ ఉన్నాను. దాదాపు 95 శాతం బ్యానర్లలో కన్నడ వచనం ఉంది. ఇలాంటి సున్నితమైన అంశాలను రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకోవడం మానుకోండి. ఇది ఆగ్రహానికి ఆజ్యం పోస్తుంది. ఉద్యమకారులు ఈ సినిమాపై అభ్యంతరం వ్యక్తం చేయడం లేదని, కొన్ని పోస్టర్లలో కన్నడ లేకపోవడంమే’ అని రాసుకొచ్చాడు.
హరి హర వీరమల్లు సినిమా రిలీజ్ తో భాషా వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. కన్నడ కార్యకర్తల ఆందోళన, అభిమానుల మధ్య ఘర్షణ సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది.


