📌 Key Points
- వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ‘కొరియన్ కనకరాజు’ టీజర్ విడుదల.
- మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రం కామెడీతో కూడిన హారర్.
- ఈ సినిమాలో వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.
- సత్య కీలక పాత్రలో, రితికా నాయక్ హీరోయిన్ గా నటిస్తున్నారు.
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కొత్త సినిమా ‘కొరియన్ కనకరాజు’ టీజర్ విడుదలైంది. మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం కామెడీ మరియు హారర్ అంశాలతో రూపొందుతోంది. వరుణ్ తేజ్ మాస్ లుక్ లో కనిపించనున్నారు.
కొరియన్ కనకరాజు టీజర్ విడుదల
Korean Kanakaraju Teaser:మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ (Varun tej) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ముఖ్యంగా మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన ఈయన విభిన్నమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ను సొంతం చేసుకున్నారు. అయితే గత చిత్రాలతో వరుసగా డిజాస్టర్ ను చవిచూస్తున్న వరుణ్ తేజ్.. చివరిగా 2024లో ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేదు. దీంతో అప్పటినుంచి ఇండస్ట్రీలో కనిపించడమే మానేశాడు.ముఖ్యంగా తన భార్య లావణ్య త్రిపాఠి (Lavanya tripathi) తో పాటు తన కొడుకు వాయువ్ తేజ్ తో సమయాన్ని గడుపుతూ వచ్చిన ఈయన తాజాగా హారర్ సినిమాలో నటిస్తున్నట్లు గతంలోనే ప్రకటించిన విషయం తెలిసిందే. ఇకపోతే ఈరోజు వరుణ్ తేజ్ పుట్టిన రోజు కావడంతో ఈ సందర్భంగా ఆ చిత్ర టైటిల్ గ్లింప్స్ తో పాటు టీజర్ కూడా రిలీజ్ చేశారు మేకర్స్.
ఇదివరకే వెంకటాద్రి ఎక్స్ప్రెస్, ఎక్స్ప్రెస్ రాజా వంటి కామెడీ చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న మేర్లపాక గాంధీ దర్శకత్వంలో వస్తున్న ఈ చిత్రానికి ‘కొరియన్ కనకరాజు’ అనే టైటిల్ ఫిక్స్ చేస్తూ టైటిల్ గ్లింప్స్ తో పాటూ టీజర్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చాలా సింపుల్ గా, కామెడీగా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇందులో సత్య కీలక పాత్ర పోషిస్తుండగా.. మిరాయ్ సినిమాతో సంచలనం సృష్టించి అందరి దృష్టిని ఆకట్టుకున్న రితికా నాయక్ ఇందులో హీరోయిన్ గా నటిస్తోంది.
మాస్ లుక్ లో వరుణ్ తేజ్ అదరగొట్టారు
ఇకపోతే తాజాగా విడుదల చేసిన టీజర్ విషయానికి వస్తే.. కొరియన్ పోలీస్ స్టేషన్ లో సత్యను కట్టేసి ఉంటారు. ఇక కొరియన్ భాషలో కనకరాజు ఎక్కడ ఉన్నాడో చెప్పాలి అని సత్య ను పోలీసులు కొడుతూ ఉంటారు. అయితే భాష అర్థం కాక పక్కనే ఉన్న రితిక నాయక్ తో వాళ్ళేమి చెప్తున్నారు అని అడగ్గా.. కనకరాజు ఎక్కడ ఉన్నారో చెప్పమని వాళ్ళు అడుగుతున్నారు అని చెబుతుంది. సత్య మాట్లాడుతూ.. మనం ఇక్కడ ఉంటే కనకరాజు ఎక్కడున్నాడో మనకు ఎలా తెలుస్తుంది అంటూ కౌంటర్ వేస్తాడు. ఇక తర్వాత కనకరాజు ఎంట్రీ.. చేతిలో కత్తి పట్టుకొని పోలీసులను చంపేస్తాడు. కట్ చేస్తే అతడిని ఒక దెయ్యం ఆవహించి ఉంటుంది. ఆ దెయ్యం ఎవరు? అసలు కొరియాలో వీళ్ళు ఏం చేస్తున్నారనేది? తెలియాలంటే మూవీ చూడాల్సిందే. ఇక ఈ ఏడాది వేసవిలో థియేటర్లలోకి రాబోతోంది.
ఇక ఈ టీజర్ లో వరుణ్ తేజ్ మరోసారి మాస్ లుక్ లో అదరగొట్టేసాడని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈయన గెటప్ చూసిన చాలామంది అభిమానులు గద్దలకొండ గణేష్ లుక్కు గుర్తుకొస్తోంది అంటూ కామెంట్ లు చేస్తూ ఉండడం గమనార్హం. మొత్తానికైతే సరైన సక్సెస్ కోసం భారీ అంచనాల మధ్య తన కెరియర్ లో తొలిసారి హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో సినిమా చేస్తున్నారు వరుణ్ తేజ్. ప్రస్తుతానికి ఈయన బర్తడే సందర్భంగా రిలీజ్ అయిన ఈ టీజర్ ఆకట్టుకుంటుంది. మరి విడుదలయ్యాక ఈయనకు ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూడాలి.
సత్య, రితికా నాయక్ కీలక పాత్రలు
మొత్తానికి ‘కొరియన్ కనకరాజు’ టీజర్ ఆసక్తికరంగా ఉంది. వరుణ్ తేజ్ మాస్ లుక్ ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంది. ఈ సినిమా వేసవిలో విడుదల కానుంది. చూడాలి మరి ఎలా ఉంటుందో!


