
📌 Key Points
- ‘రాకాస’ చిత్రం ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధంగా ఉంది.
- దర్శకురాలు మానస శర్మ శ్రీకాకుళం నుండి వచ్చారు.
- సిరీస్ కోసం అనుకున్న కథను సినిమాగా మార్చారు.
- నిహారిక కొణిదెల ఈ సినిమా అవుట్‌పుట్‌పై నమ్మకంగా ఉన్నారు.
నిహారిక కొణిదెల నిర్మాణంలో మానస శర్మ దర్శకత్వంలో వస్తున్న చిత్రం ‘రాకాస’. ఈ సినిమా ఏప్రిల్ 3న విడుదల కానుంది. వెబ్ సిరీస్‌కు, సినిమాకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని దర్శకురాలు తెలియజేశారు.
‘రాకాస’ చిత్ర విశేషాలు
Manasa Sharma: మెగా డాటర్ నిహారిక కొణిదెల (Niharika Konidela) తన పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్‌పై జీ స్టూడియోస్ సమర్పణలో.. ఉమేష్ కుమార్ బన్సాల్‌తో కలిసి నిర్మిస్తోన్న చిత్రం ‘రాకాస’ (Rakasa). దర్శకురాలు మానస శర్మ (Manasa Sharma) తెరకెక్కించిన ఈ చిత్రంలో సంగీత్ శోభన్, నయన్ సారిక జంటగా నటించారు. ఇప్పటి వరకు రిలీజ్ చేసిన గ్లింప్స్, టీజర్, పాటలు, ప్రమోషనల్ కంటెంట్ అంతా కూడా సినిమాపై భారీగా అంచనాలను పెంచేశాయి. ఏప్రిల్ 3న విడుదలకు సిద్ధమైన ఈ చిత్ర ప్రమోషన్స్‌ని మేకర్స్ యమా జోరుగా నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో దర్శకురాలు మానస శర్మ (Director Manasa Sharma) మీడియాకు చిత్ర విశేషాలను తెలియజేశారు. ఆమె మాట్లాడుతూ..
‘‘మాది శ్రీకాకుళం. నేను మొదటగా యూట్యూబ్‌లో ‘మ్యాడ్ హౌస్’ చేశాను. ఆ తర్వాత ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’కి క్రియేటర్, రైటర్‌గా పని చేశాను. ఆ తరువాత ‘బెంచ్ లైఫ్’ సిరీస్‌ని చేశాను. ఇది నాకు నాలుగో ప్రాజెక్ట్. ఫాంటసీ, అడ్వెంచర్‌లతో ‘రాకాస’ చాలా కొత్తగా ఉండబోతుంది. ఫాంటసీ, అడ్వెంచర్‌తో పాటు కామెడీకి ఇందులో చాలా ప్రాధాన్యత ఉంటుంది. ఇప్పటికే వచ్చిన టీజర్ అందరినీ అలరించింది. త్వరలోనే ట్రైలర్‌ను విడుదల చేయబోతున్నాం. ట్రైలర్ విడుదల తర్వాత సినిమా గురించి ఇంకా చాలా క్లియర్‌గా తెలుస్తుంది. కామెడీని ప్రధాన అంశంగా, కొద్దిగా హారర్ ఎలిమెంట్స్‌తో పూర్తి ఫాంటసీ, అడ్వెంచర్‌గా ఈ మూవీని తెరకెక్కించాం. వాస్తవానికి ఈ కథని ముందుగా నెట్ ఫ్లిక్స్‌లో సిరీస్ కోసం చెప్పాను. ఆ టైంలోనే ఈ కథను సంగీత్ విన్నారు. ఆయనకి కూడా కథ బాగా నచ్చింది. అలా తను కూడా ఈ ప్రాజెక్ట్‌లో భాగమయ్యారు.
వెబ్ సిరీస్ నుండి సినిమాగా మార్పు
సిరీస్ కోసం అనుకున్న ఈ కథని సినిమాగా చేశాం. వెబ్ సిరీస్ అయినా, సినిమా అయినా ఒకే రకమైన ఛాలెంజ్ ఉంటుంది. మేకింగ్ అంతా ఒకేలా ఉంటుంది.. కాకపోతే రైటింగ్‌లోనే తేడా ఉంటుంది. షూటింగ్ పరంగా, చిత్రీకరణ సమయంలో ఎలాంటి తేడాలుండవు. ఈ సినిమా అవుట్ పుట్ నిహారికకు నచ్చాలని నేను మరింత బాధ్యతగా పని చేశాను. ఈ కథని పదిహేను నిమిషాలు నెరేట్ చేసిన తర్వాత నిహారిక చాలా కాన్ఫిడెంట్‌కి వచ్చేశారు. వెంటనే మనం సినిమా చేస్తున్నామని అన్నారు. ఆమెతో నాకు మంచి అనుబంధం ఉంది. పింక్ ఎలిఫెంట్‌లో ప్రాజెక్టులు ఎప్పుడూ ఆలస్యమవ్వవు. అన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా జరిగిపోతుంటాయి. ‘ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ’ని తొమ్మిది నెలల్లో పూర్తి చేశాం. ‘కమిటీ కుర్రోళ్లు’ ఏడాదిన్నరలో రిలీజ్ అయింది. నిహారిక మంచి నిర్మాత. ఆమె అన్నింటినీ బ్యాలెన్స్ చేస్తారు.
నిహారికతో అనుబంధం గురించి మానస
ఈ సినిమాకు ముందు నుంచీ మేం బడ్జెట్‌లోనే అంతా చేయాలని అనుకున్నాం. అయితే ఏ మూవీకి అయినా సరే కొంచెం అటూ ఇటూగానే అవుతుంది. కానీ టీం అంతా ముందే అనుకుని ఉండటంతో చాలా వరకు లిమిట్‌లోనే ఉన్నాం. ‘రాకాస’ థియేట్రికల్‌గా ఎక్స్‌పీరియెన్స్ చేయాల్సిన చిత్రం. కథ పూర్తిగా ఫిక్షన్. అన్ని పాత్రలు అందరినీ ఆకట్టుకునేలా ఉంటాయి. ఓ అందమైన చందమామ కథలా ఈ సినిమా ఉంటుందని చెప్పగలను. విజువల్‌గా, సౌండింగ్ పరంగా ఈ మూవీ అందరినీ ఆకట్టుకుంటుంది. సెకండాఫ్‌లో ఎక్కువగా వీఎఫ్ఎక్స్ ఉంటాయి. అందుకే మేం ముందుగా సెకండాఫ్ షూట్ చేశాం. ఒక పక్క వీఎఫ్ఎక్స్ వర్క్స్ జరుగుతూ ఉంటే.. ఫస్ట్ హాఫ్‌ని షూట్ చేశాం. అలా మాకు టైమ్ కలిసొచ్చింది. నయన్ సారిక టాలెంట్, యాక్టింగ్ చూసే ఈ చిత్రంలోకి తీసుకున్నాం. ఆమె పాత్రని ప్రేక్షకులంతా ఇష్టపడతారు. ప్రస్తుతం నా చేతిలో కొన్ని కథలు, ఐడియాస్ ఉన్నాయి. ‘రాకాస’ విడుదల తర్వాత వాటి గురించి ఆలోచిస్తాను’’ అని చెప్పుకొచ్చారు.
దర్శకురాలు మానస శర్మ వెబ్ సిరీస్ అనుభవం, సినిమా తీయడంలో ఉన్న ప్రత్యేకతలను వివరించారు. ఏప్రిల్ 3న విడుదల కానున్న ‘రాకాస’ చిత్రంపై అంచనాలు పెరిగాయి.


