
📌 Key Points
- లోక్‌సభ స్థానాల సంఖ్యను 543 నుంచి 850కి పెంచాలని కేంద్రం నిర్ణయం.
- పెరిగిన సీట్లలో 33% మహిళా రిజర్వేషన్లు 2029 ఎన్నికల ముందు అమలు.
- జనాభా లెక్కలకు ముందే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయం.
- రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన కూడా చేపట్టనున్నారు.
దేశంలో లోక్‌సభ స్థానాల సంఖ్యను భారీగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. కొత్త జనాభా లెక్కల కోసం వేచి చూడకుండానే డీలిమిటేషన్ ప్రక్రియను చేపట్టనుంది. దీనికి సంబంధించిన ముసాయిదా బిల్లును పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనుంది.
లోక్‌సభ సీట్ల పెంపుదల: కేంద్రం నిర్ణయం
కొత్త జనాభా లెక్కలు రావడానికి ముందే డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. లోక్‌సభ సీట్లను 543 నుంచి 850 సీట్ల వరకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. ఇందులో 815 స్థానాలు రాష్ట్రాల నుంచి, 35 స్థానాలు యూటీల నుంచి ఉండనున్నాయి. లోక్‌సభలో రాష్ట్రాల ప్రాతినిధ్యం వాటాలో ఎలాంటి మార్పు లేకుండా ఈ పెరుగుదల ఉండనుంది. అన్ని రాష్ట్రాలకు సమాన శాతాల్లో లోక్‌సభ సీట్ల పెరుగుదల ఉంటుంది. అంటే ప్రతి రాష్ట్రంలో ఇదివరకున్న ఎంపీ సీట్లల్లో 50 శాతం మేరకు పెరుగుదల ఉంటుందని తెలుస్తోంది.
కాగా, పెరిగిన ఈ సీట్లకు అనుగుణంగా 33 శాతం మహిళా రిజర్వేషన్‌ను 2029 పార్లమెంటు ఎన్నికలకు ముందు నుంచే కేంద్రం అమలు చేయనుంది. లోక్‌సభతోపాటు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అసెంబ్లీ స్థానాల పునర్విభజన సైతం చేపట్టనుంది. ఆ చట్టసభల్లోనూ 33 శాతం మహిళా రిజర్వేషన్లు అమలు చేయనుంది. ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లులను సిద్ధం చేసి ఎంపీలకు అందించింది. రేపటి నుంచి మూడు రోజుల పాటు నిర్వహించనున్న పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో ఈ సవరణలను ప్రవేశపెట్టి ఆమోదించుకోనుంది.
సెన్సస్ నుంచి డీలిమిటేషన్ కేంద్రంగా..
రాజ్యాంగంలో నిబంధనలు ప్రకారం, పునర్విభజన ప్రక్రియ చేపట్టాలంటే ముందుగా జనగణన చేపట్టాలి. ఆ జనాభా లెక్కల ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన చేపట్టాలి. ఆ తర్వాత మహిళా కోటాను అమలు చేయాలి. సాధారణంగా ప్రక్రియ ఇలా జరగాలి. ఇలా ఇది వరకు జనాభా కేంద్రంగా ప్రక్రియ సాగేది. కానీ, ఈ సారి దాన్ని డీలిమిటేషన్ కేంద్రంగా మార్చినట్లు తెలుస్తోంది. జనాభా లెక్కలు పూర్తి కావడానికి ముందే గత జనాభా లెక్కల ఆధారంగా డీలిమిటేషన్ చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. 2023లో చట్టసభల్లో 33 శాతం మహిళలకు రిజర్వేషన్ కల్పించే ‘నారీ శక్తి వందన్ అధినియమ్’ చట్టాన్ని కేంద్రం తీసుకొచ్చింది.
మహిళా రిజర్వేషన్ల అమలుకు మార్గం సుగమం
తదుపరిగా జరిగే జనగణన తర్వాత అమల్లోకి తేవాలనే నిబంధన చట్టంలో పేర్కొన్నారు. ప్రస్తుతం మొదలైన జనగణన పూర్తయ్యాక డీలిమిటేషన్ చేపట్టాల్సి ఉంది. 2027లో జనగణన ప్రక్రియ పూర్తవ్వనుండగా.. గణాంకాలు ఆ తర్వాత అందుబాటులోకి రానున్నాయి. అనంతరం, డీలిమిటేషన్.. ఆ తర్వాత మహిళా కోటాను అమలు చేయాలి. అలా చేస్తే 2029 పార్లమెంటు ఎన్నికల వ్యవధి సైతం దాటే చాన్స్ ఉన్నది. అందుకే భారత ప్రజాస్వామ్యంలో మహిళా శక్తి భాగస్వామ్యాన్ని మరింత దీర్ఘకాలం వాయిదా వేయకూడదనే ఉద్దేశంతో కొత్త సవరణలు తెస్తున్నట్టు తాజా డ్రాఫ్ట్ బిల్లులో కేంద్రం తెలిపింది. ఇందుకోసం అవసరమైన రాజ్యాంగ సవరణలతో మూడు బిల్లులను సిద్ధం చేసింది.
అవాంతరాలను అధిగమించి జనగణన పూర్తికావడానికి ముందే.. అంటే గత జనాభా లెక్కల ఆధారంగానే డీలిమిటేషన్ చేపట్టి.. 2029 ఎన్నికలకు ముందే మహిళా కోటా అమలు చేయడానికి కేంద్రం మూడు రాజ్యాంగ సవరణ బిల్లులను సిద్ధం చేసింది. 131 వ రాజ్యాంగ సవరణ బిల్లు 2026, డీలిమిటేషన్ బిల్లు 2026, యూటీ చట్టాల సవరణ బిల్లు 2026ను రేపు పార్లమెంటులో కేంద్రం ప్రవేశపెట్టనుంది. ఈ బిల్లులతో 2023లో ఆమోదించిన మహిళా కోటా చట్ట అమలుకు జనగణన, డీలిమిటేషన్‌తో లంకె తెంచనుంది. డీలిమిటేషన్‌కు ప్రాతిపదికగా పార్లమెంటులో సూచించిన జనాభా లెక్కలను స్వీకరించే నిబంధన తేనుంది. డీలిమిటేషన్‌పై 2026 వరకున్న ఫ్రీజ్‌ను తొలగించి, ప్రస్తుతం గరిష్ట లోక్‌సభ సీట్ల సంఖ్యను 550 నుంచి 850 వరకు పెంచే వెసులుబాటును తీసుకురానుంది.
131వ రాజ్యాంగ సవరణతో ఆర్టికల్ 81ను సవరించి లోక్‌సభ సీట్ల సంఖ్యను 550 నుంచి 850కు కేంద్రం పెంచనుంది. 1971 జనగణనకు లోబడని లోక్‌సభ సీట్ల సంఖ్య, 2001 జనగణనకు లోబడిన అసెంబ్లీల సీట్ల సంఖ్యపై ఆర్టికల్ 81(2), (3)లతో ఫ్రీజ్ అమల్లో ఉన్నది. దీన్ని పై సవరణ తొలగిస్తుంది. ప్రతి జనగణన తర్వాత పునర్విభజన అనే పదాన్ని పునర్విభజన గా మార్చడానికి, ప్రతి జనగణన తర్వాత లోక్‌సభ నియోజకవర్గాల పునర్విభజన పదాన్ని తొలగించడానికి ఆర్టికల్ 82ను సవరిస్తున్నారు. రాష్ట్రాల అసెంబ్లీలకు, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్లకు సంబంధించి పార్లమెంటు సూచించిన జనగణన అనే పదాన్ని పై సవరణతో చేరుస్తున్నారు. మొత్తంగా ఆర్టికల్ 82, 170 సవరణలతో 2026 తర్వాత చేపట్టే జనగణన అనే తప్పనిసరి నిబంధనను తొలగిస్తూ.. గత జనగణన ఆధారంగా నియోజకవర్గాల పునర్విభజన అధికారాన్ని డీలిమిటేషన్ కమిషన్‌కు కల్పించనుంది.
సుప్రీం జడ్జీ చైర్మన్‌గా కమిషన్..
డీలిమిటేషన్ ప్రక్రియలో మార్పులు
ఈ మహా కార్యం చేపట్టడానికి బిల్లులు ప్రత్యేకంగా ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించాయి. ఇందుకోసం సుప్రీంకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన డీలిమిటేషన్ కమిషన్ ఏర్పాటవుతుంది. ఇందులో సీఈసీ, రాష్ట్రాల ఎన్నికల కమిషనర్లు సభ్యులుగా ఉంటారు. ఈ కమిషన్ సివిల్ కోర్ట్ హోదాను కలిగి ఉంటుంది. రాష్ట్రాల్లో సీట్ల కేటాయింపులు, నియోజకవర్గ పరిధుల పునర్విభజన లతోపాటు ఎస్సీ, ఎస్టీ, మహిళా రిజర్వేషన్లను నిర్ధారిస్తుంది.
ఈ చట్టం అమల్లోకి వచ్చాక పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల్లో మొత్తంగా 33 శాతం రిజర్వేషన్లు మహిళలకు అమలవుతాయి. ఎస్సీ, ఎస్టీ కోటాల్లోనూ 33 శాతం రిజర్వేషన్ ఉంటుంది. ప్రతి డీలిమిటేషన్ తర్వాత మహిళా కోటా రొటేషన్ అమలవుతుంది. మహిళా రిజర్వేషన్ 15 ఏళ్ల వరకు ఉంటుంది. ఆ తర్వాత పార్లమెంటు ద్వారా అవసరమైన మేరకు పొడిగించుకునే వెసులుబాటు ఉంటుంది. మహిళా చట్టం 2023 ప్రకారం 2026 తర్వాత చేపట్టే జనగణన లెక్కల ఆధారంగా కోటా నిర్ణయించాలి. ఇది సుదీర్ఘకాలం మహిళా కోటాను వాయిదా వేసినట్టు అవుతుందని, అందుకే ముందస్తుగా అమలు చేయడానికి సవరణలు తెచ్చినట్లు కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్‌మేఘవాల్ వివరించారు. ఈ చట్టం అమల్లోకి వచ్చాక జరిగే రాష్ట్రాల అసెంబ్లీలు, ఉపఎన్నికలకు సైతం మహిళా కోట అమలవుతుందని స్పష్టం చేశారు. అంటే 2029 లోక్‌సభ ఎన్నికలకు ముందు నుంచే మహిళా కోటా అమల్లోకి రావొచ్చని వివరించారు.
అసెంబ్లీ సీట్లు 500 దాటొద్దు
ఆర్టికల్ 333 ప్రకారం రాష్ట్రాల అసెంబ్లీ సీట్లు గరిష్టంగా 500కు మించకూడదు. అలాగే, 60కి తక్కువగా ఉండకూడదు. ఈ షరతును దృష్టిలో పెట్టుకుని రాష్ట్రాల నియోజవకర్గాల పునర్విభజన చేపట్టాల్సి ఉంటుంది. ప్రతి నియోజకవర్గానికి దాదాపుగా సమాన ప్రాతినిధ్యం ఉండేలా జాగ్రత్త వహించాలి.
కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం రాబోయే ఎన్నికల్లో రాజకీయ సమీకరణాలను మార్చే అవకాశం ఉంది. మహిళా రిజర్వేషన్ల అమలుతో రాజకీయాల్లో మహిళల ప్రాధాన్యత మరింత పెరగనుంది.


