
📌 Key Points
- బర్నౌట్ కేవలం అలసట కాదు, దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల వచ్చే తీవ్ర ఆరోగ్య సమస్య.
- సుదీర్ఘ పని, ఆర్థిక ఒత్తిడి, నిద్రలేమి బర్నౌట్‌కు ప్రధాన కారణాలు.
- కార్టిసాల్ స్థాయిలు పెరిగి, రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది.
- వ్యాయామం, సరైన నిద్ర షెడ్యూల్ బర్నౌట్‌ను నివారించడంలో కీలకం.
పురుషుల్లో పెరుగుతున్న ‘బర్నౌట్’ సమస్య తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం అలసట కాదు, మానసిక, శారీరక ఆరోగ్యాన్ని దెబ్బతీసే దీర్ఘకాలిక ఒత్తిడి. పని ఒత్తిళ్లు, నిద్రలేమి దీనికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి.
బర్నౌట్ అంటే ఏమిటి? దాని లక్షణాలు
Men mental health : ప్రస్తుత ఆధునిక కాలంలో పురుషుల్లో ‘బర్నౌట్’ అనేది ఒక తీవ్రమైన ఆరోగ్య సమస్యగా మారుతోంది! ఇది కేవలం మానసిక ప్రశాంతతను మాత్రమే కాకుండా.. శారీరక ఆరోగ్యాన్ని కూడా పూర్తిగా దెబ్బతీస్తోంది. సుదీర్ఘ పని వేళలు, ఆర్థిక ఒత్తిళ్లు, సరిగ్గా నిద్రపోకపోవడం, నిరంతర ఆందోళన, డిజిటల్ స్క్రీన్ల వాడకం వల్ల చాలా మంది పురుషులు మానసికంగా, శారీరకంగా పూర్తిగా నీరసించిపోతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం.. బర్నౌట్ అంటే కేవలం “అలసటగా అనిపించడం” కాదు. ఒత్తిడి అనేది శరీరంలో దీర్ఘకాలికంగా ఉండిపోయినప్పుడు, అది కార్టిసాల్ అనే హార్మోన్ స్థాయిలను పెంచుతుంది. ఇది నిద్రను పాడుచేసి, రోగనిరోధక శక్తిని బలహీనపరుస్తుంది. అంతేకాకుండా రక్తపోటు (బీపీ) పెరగడానికి, ఆందోళన, డిప్రెషన్, గుండె జబ్బులు, జీవక్రియ లోపాలకు దారితీస్తుంది. వీటితో పాటు కొందరిలో తలనొప్పి, కడుపునొప్పి (జీర్ణ సమస్యలు), కండరాల నొప్పులు, చిరాకు, ఎమోషనల్ నంబ్‌నెస్ (భావోద్వేగాలు లేనట్లు అనిపించడం) వంటి లక్షణాలు కనిపిస్తాయి. సమస్య ఏంటంటే.. చాలా మంది పురుషులు దీని ప్రారంభ లక్షణాలను నిర్లక్ష్యం చేస్తారు. ఆరోగ్యం, బంధాలు, రోజువారీ పనులు దెబ్బతినే వరకు ఒత్తిడిని భరిస్తూనే ఉంటారు.
దీర్ఘకాలిక ఒత్తిడి వల్ల శరీరంలోని ‘ఫైట్-ఆర్-ఫ్లైట్’ (ఫైట్ లేదా ఫ్లైట్ రెస్పాన్స్) వ్యవస్థ నిరంతరం చురుగ్గా ఉంటుంది. దీనివల్ల కార్టిసాల్, అడ్రినలిన్ వంటి ఒత్తిడి హార్మోన్లు విపరీతంగా పెరిగిపోయి, శరీరంలోని వివిధ అవయవాలపై సైలెంట్‌గా ప్రభావం చూపిస్తాయి.
నిద్రలేమి, బర్నౌట్ ఒకదానికొకటి ముడిపడి ఉన్న ఒక ప్రమాదకరమైన చక్రం లాంటివి. ఒత్తిడి వల్ల నిద్ర పట్టదు, నిద్ర లేకపోవడం వల్ల ఒత్తిడి హార్మోన్లు మరింత పెరుగుతాయి. అందుకే ఒక పక్కా నిద్ర షెడ్యూల్ పాటించడం, రాత్రిపూట మొబైల్ స్క్రీన్లు చూడటం తగ్గించడం వల్ల మానసిక, ఫిజికల్ రెసీలియన్స్ మెరుగవుతుంది.
బర్నౌట్ కు కారణాలు, శరీర ప్రభావం
మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి వ్యాయామం అత్యంత ప్రభావవంతమైన సహజ మార్గం. రెగ్యులర్ వ్యాయామం వల్ల శరీరంలో ఎండార్ఫిన్లు (ఆనందాన్నిచ్చే హార్మోన్లు) విడుదలై, రక్త ప్రసరణ మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యానికి మద్దతు ఇవ్వడమే కాకుండా కార్టిసాల్ స్థాయిలను తగ్గిస్తుంది. రోజుకు కాసేపు నడవడం, సైక్లింగ్, స్ట్రెచింగ్ లేదా వెయిట్ ట్రైనింగ్ చేయడం వల్ల మూడ్, ఎనర్జీ లెవెల్స్ పెరుగుతాయి.
చాలా మంది పురుషులు తమ మానసిక అలసటను లేదా భావోద్వేగాలను బయటకు చెప్పకుండా లోపలే అణచివేస్తుంటారు. కానీ ఇలా చేయడం వల్ల మానసిక స్థిరత్వంతో పాటు శారీరక ఆరోగ్యం కూడా క్షీణిస్తుంది. నిరంతర చిరాకు, బంధాలకు దూరం కావడం, పనిపై ఆసక్తి లేకపోవడం వంటి లక్షణాలను అస్సలు లైట్ తీసుకోవద్దు. ఈ ఒత్తిడి వల్ల కొందరు మద్యం, ధూమపానం, అతిగా తినడం లేదా ఎవరితోనూ కలవకుండా ఒంటరిగా ఉండిపోవడం వంటి అలవాట్లకు బానిసలవుతుంటారు.
అతిగా ప్రాసెస్ చేసిన ఆహారాలు, మితిమీరిన కెఫిన్ (టీ/కాఫీ), ఆల్కహాల్, వేళకాని వేళల్లో తినడం వల్ల శరీరంలో అలసట, మూడ్ స్వింగ్స్, ఇన్ఫ్లమేషన్ పెరుగుతాయి. కాబట్టి మీ డైట్‌లో ప్రోటీన్లు, తృణధాన్యాలు, పండ్లు, ఆకుకూరలు, హెల్తీ ఫ్యాట్స్ ఉండేలా చూసుకోవాలి. అలాగే శరీరానికి తగినంత నీరు అందించాలి. ఇది మెదడు పనితీరును, హార్మోన్ల సమతుల్యతను కాపాడుతుంది.
బర్నౌట్ నుండి బయటపడే మార్గాలు
విరామం లేకుండా నిరంతరం పనిచేయడం వల్ల నరాల వ్యవస్థ ఎప్పుడూ ఒత్తిడిలోనే ఉంటుంది. పని మధ్యలో చిన్న చిన్న విరామాలు తీసుకోవడం, నచ్చిన హాబీ లను అలవాటు చేసుకోవడం, స్నేహితులతో మాట్లాడటం, ప్రకృతిలో గడపడం, కొద్దిరోజుల పాటు డిజిటల్ డిటాక్స్ (సోషల్ మీడియాకు దూరం కావడం) చేయడం వల్ల మెదడు త్వరగా కోలుకుంటుంది. బర్నౌట్ నివారణ అంటే బాధ్యతల నుంచి పారిపోవడం కాదు, మనస్సుకూ శరీరానికూ తగినంత విశ్రాంతిని ఇవ్వడమే.
ఒకవేళ బర్నౌట్ లక్షణాలు మీ నిద్రను, ఆఫీస్ పనిని, వ్యక్తిగత బంధాలను, ఆకలిని తీవ్రంగా దెబ్బతీస్తుంటే.. ఆలస్యం చేయకుండా మానసిక ఆరోగ్య నిపుణులను (థెరపిస్ట్‌లు, కౌన్సిలర్లు) సంప్రదించడం ఉత్తమం. ప్రారంభ దశలోనే కౌన్సిలింగ్, స్ట్రెస్ మేనేజ్‌మెంట్ పద్ధతులు, జీవనశైలి మార్పులను అలవాటు చేసుకోవడం ద్వారా ఈ సమస్య పెద్ద జబ్బులుగా మారకుండా కాపాడుకోవచ్చు.
శరత్ చిట్టూరి హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా ఉన్నారు. 7ఏళ్ల జర్నలిజం ఎక్స్‌పీరియెన్స్‌తో ఇక్కడ బిజినెస్, ఆటో, టెక్, పర్సనల్ ఫైనాన్స్, నేషనల్- ఇంటర్నేషనల్, స్పోర్ట్స్ వార్తలు రాస్తున్నారు. 2022 జనవరిలో హిందుస్థాన్ టైమ్ తెలుగులో చేరారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు అదుకున్నారు. గతంలో ఈటీవీ భారత్‌లో కంటెంట్ రైటర్‌గా పని చేశారు. అక్కడ జాతీయం, అంతర్జాతీయం, బిజినెస్ వార్తలు రాసేవారు. ఏ అంశమైనా సరళంగా, చదివేందుకు సులభంగా ఉండే విధంగా తీర్చిదిద్దేందుకు ఇష్టపడతారు.IGNOU నుంచి జర్నలిజంలో పీజీ డిగ్రీ ఉంది. అంతకుముందు బీటెక్ పూర్తి చేశారు. కథలు చెప్పడం, రాయడంపై ఇష్టంతో ఈ రంగాన్ని ఎంచుకున్నారు. తన ఆర్టికల్స్‌తో ఇప్పుడు ప్రజలకు చేరువవుతున్నారు. Read More
బర్నౌట్ లక్షణాలను గుర్తించి, సకాలంలో చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. సరైన జీవనశైలి మార్పులు, వ్యాయామం, తగినంత నిద్రతో ఈ ముప్పును సమర్థవంతంగా ఎదుర్కోవచ్చు.


