
📌 Key Points
- ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధంతో చమురు కొరత వదంతులు, పెట్రోల్ బంకుల వద్ద జనం క్యూలు.
- హైదరాబాద్, మహారాష్ట్రలలో పెట్రోల్ బంకుల వద్ద భారీ రద్దీ నెలకొంది.
- ప్రభుత్వం, డీలర్ల సంఘాల ప్రకటన: దేశంలో ఇంధన కొరత లేదు, నిల్వలు పుష్కలంగా ఉన్నాయి.
- వదంతులను నమ్మి ఆందోళన చెందవద్దని ప్రజలకు ప్రభుత్వ విజ్ఞప్తి.
మిడిల్ ఈస్ట్ లో ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో, దేశవ్యాప్తంగా పెట్రోల్ కొరత ఏర్పడుతుందనే వదంతులు వ్యాపించాయి. దీంతో ప్రజలు పెట్రోల్ బంకుల వద్ద భారీగా క్యూ కట్టారు.
యుద్ధ భయంతో పెట్రోల్ బంకుల వద్ద క్యూలు
పశ్చిమాసియాలో ఇరాన్ – ఇజ్రాయెల్ మధ్య యుద్ధం తీవ్ర స్థాయికి చేరుకుంది. కాగా ఈ వార్ దాని ప్రభావం అంతర్జాతీయ చమురు సరఫరాపై పడుతుందనే వార్తలు సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారమవుతున్నాయి. ముఖ్యంగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడుతుందనే భయంతో జనం పెట్రోల్ బంకులవైపు పరుగులు తీసేలా చేస్తోంది. నిన్న తెలంగాణలోని హైదరాబాద్ లో పెట్రోల్ బంకుల వద్ద జనం భారీగా క్యూ కట్టగా.. నేడు అదే సీన్ మహారాష్ట్రలోనూ రిపీట్ అయింది. గురువారం మహారాష్ట్రలోని పర్భణి, ఛత్రపతి సంభాజీ నగర్ వంటి నగరాల్లో వాహనదారులు పెట్రోలు బంకుల ప్రజలు భారీ క్యూలో నిలబడిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఇంధన కొరతపై ప్రభుత్వ ప్రకటన
భవిష్యత్తులో ఇంధన ధరలు భారీగా పెరగవచ్చని, లేదంటే సరఫరా పూర్తిగా నిలిచిపోవచ్చనే తప్పుడు ప్రచారాలను నమ్మి, ప్రజలు తమ వాహనాల్లో ఇంధనాన్ని నింపుకునేందుకు పోటీ పడుతున్నారు. అయితే ఈ గందరగోళంపై పెట్రోలు డీలర్ల సంఘాలు మరియు ప్రభుత్వ యంత్రాంగం తక్షణమే స్పందించాయి. దేశంలో ప్రస్తుతం ఎటువంటి ఇంధన కొరత లేదని, సరఫరా వ్యవస్థ అత్యంత సాధారణంగా కొనసాగుతోందని వారు స్పష్టం చేశారు. కేవలం వదంతులను నమ్మి అనవసరంగా ఆందోళన చెందవద్దని, బంకుల వద్ద రద్దీ పెంచడం వల్ల ఇతరులకు ఇబ్బందులు కలుగుతాయని విజ్ఞప్తి చేస్తున్నారు.
వదంతులను నమ్మవద్దని విజ్ఞప్తి
ఇక భారత ప్రభుత్వం ఇంధన సరఫరా విషయంలో అత్యంత పకడ్బందీగా వ్యవహరిస్తోంది. అధికారుల సమాచారం ప్రకారం.. దేశంలో కొన్ని వారాలకు సరిపడా చమురు నిల్వలు (Strategic Petroleum Reserves) సిద్ధంగా ఉన్నాయి. ఒకవేళ యుద్ధం కారణంగా ఇంధన సరఫరాలో ఏవైనా ఆటంకాలు ఏర్పడినా, ఇతర దేశాల నుండి దిగుమతులు చేసుకోవడానికి, వ్యూహాత్మక నిల్వలను వినియోగించుకోవడానికి తగిన ఏర్పాట్లు జరుగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా చమురు రవాణాకు అత్యంత కీలకమైన ‘హార్ముజ్ జలసంధి’ (Strait of Hormuz) మూసివేయడంతో ఈ వదంతులు ఇంకా వేగంగా వ్యాపిస్తున్నాయని, అయితే అవన్నీ అసత్యాలను ప్రభుత్వం కొట్టి పారేసింది. ప్రస్తుతానికి పెట్రోలు బంకుల వద్ద బారులు తీరాల్సిన అవసరం లేదని, మార్కెట్‌లో లభించే సమాచారం కంటే ప్రభుత్వ అధికారిక ప్రకటనలనే నమ్మాలని సూచిస్తున్నారు.
ప్రస్తుతం దేశంలో పెట్రోల్ కొరత లేదని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాబట్టి ప్రజలు వదంతులను నమ్మి ఆందోళన చెందకుండా, ప్రభుత్వ ప్రకటనలను విశ్వసించాలని కోరారు.


